గర్భశోకం

- మార్ని జానికిరామ్‌ చౌదరి

9440338303

పచ్చిరెక్కల తడారకుండానే

పరాయిదేశం వలసపోయిన బిడ్డ

'మందుబిళ్ళేసుకున్నావా నాన్నా'

అన్న పలకరింతకు

ఆ తండ్రి ఆయుషు

మరో ఏడాది పెరుగుతుంది.

ప్రతిరోజూ పలకరించే

సెల్‌ఫోను రింగుటోను శబ్ధానికి

మురళీరవం విన్న యశోదలా

ఆ తల్లి మనసు పులకిస్తుంది.

ఎండిన గుండెల్ని చిత్తడి చేసే

రెండు మెత్తని మాటలు కోసం

ఒళ్ళంతా చెవులు చేసుకొన్న

ఆ ముసలి జీవాలు రెండూ..

కరకుబోయ విసిరిన

'జాతి వివక్ష' తూటా కాటుకు

'పేగుబంధం' బలైందన్న వార్తతో

మండుతున్న కొలిమిలో పడ్డ

కపోతాల్లా కొట్టుకుంటున్నాయ్‌.

కాలుతున్న చితిలో

సజీవ సమిధలై మండుతున్నాయ్‌.

కోయిల కూతకూ తీతువు రోదనకూ

తేడా తెలియని అమాయకపు బిడ్డ

ఏదోరోజు రెక్కలు కట్టుకునొస్తాడని

తనరెక్కల మాటున

పొదువుకుంటాడన్న ఆశ

ఉద్దీపనా శక్తిలా పనిచేస్తుంటే..

అందివచ్చిన కొడుకు

హత్యాఘాతుకానికి బలయ్యాడన్న వార్త

ఫిరంగి గుండులా గుండెల్ని తాకింది.

పక్వానికొచ్చిన పళ్ళకంటే ముందు

వసరికాయ రాలినట్టు

ఊతమిచ్చి నడిపించాల్సిన ఊతకర్ర

పుటుక్కున విరిగితే

గుండెలో గునపం దిగినట్టయింది.

బద్దలైన గుండె శకలాల్లో

అశ్రుకణాలు ఆవిరయ్యాయి

ఒంట్లో ఉన్న నాలుగు రక్తపు చుక్కలూ

కంట్లో నుండి బయటపడ్డాయి.

బృందావనం లాంటి ఆ గూడు కాస్తా

ఉప్పెన ముంచెత్తిన వల్లకాడైంది.

(7 జూలై 2018న అమెరికాలో దుండగుడి కాల్పులకు బలైన వరంగల్‌ విద్యార్థి శరత్‌ కొప్పుల మృతికి నివాళిగా)