జ్వలతి

డా|| ఎన్‌. గోపి

కన్నీళ్ళు అందరికీ వుంటాయి
ఏ కన్నీటి వెనుక ఏముందో
ఎవరూ తొంగి చూడరు.
అందరిని తాకే గాలే నిన్నూ తాకుతుంది
క్షణక్షణం మారే జీవన వాసనల్లో
తేడా ఎప్పటికీ అర్థం కాదు.
ఆకాశం అందరికీ వుంటుంది.
శూన్యం మాత్రం
కొందరి కళ్ళలోంచే రాలిపడుతుంది.
భౌతిక కారణాలు
పరిపూర్ణ తార్కిక శోభకు
తార్కాణాలు కావు
స్తబ్దత మనసులోంచి కూడా పుట్టొచ్చు.
దేశదిమ్మరిగా ఉన్నప్పుడే నేను కవి నౌతాను
ఒకేచోట కూర్చుంటే గడ్డ కట్టుపోతాను.
అందరికీ ఆశలుంటాయి
ఏ ఆశ ఎవరి నిరాశల్లోంచి
నడిచొస్తుందో అంతుపట్టదు.
పొద్దున లేచిన దగ్గర్నుంచీ
ప్రతి పనినీ కాగితంపైన రాసుకుంటాను
రాత్రి పడుకునేటప్పుడు చదివితే
ఒక్క ప్రాణ స్పందనా మిగులదు.
నిరర్ధకమైన నీరవ ధ్యానంలో
శబ్దాలన్నీ అశబ్దాలవుతాయి.
ఆలోచనలు అందరికీ వుంటాయి
అవి చీకటి గుహలో
వెలుగుల మాయలో అర్థం కావు
గిరి గీసుకున్న చేతనావరణంలో
స్వార్థమెంతో
పరార్థమెంతో అర్థం కాదు.
ఉదయాలు అందరికీ వుంటాయి
వాటిలో కిరణాలెన్నో
ముందుకు సాగని చరణాలెన్నో నిర్ధారణ కావు.