పి.ఎల్.ఎన్. మంగారత్నం
97014 26788
ఆ రోజు ఉదయం ..
తొమ్మిది గంటలకు నేనింకా .. వంటలో ఉండగానే వీధి గుమ్మంలోనుంచి ఉషామణి గారి నుంచి పిలుపు. నన్ను పేరుతో పిలిచేది ఆవిడ మాత్రమే!
రెండు బ్లాకులుగా కట్టిన ఈ అరవై పోర్షన్ల అపార్టుమెంటులో మిగిలిన వాళ్లందరికీ నేను 'అంటీ'నే. పిల్లలకైనా, పెద్దలకైనా. ఇంకా ఉంటే .. వాళ్ళ మనవలకైనా. రిటైరు అయి రెండేళ్ళు గడిచిన నా వయసు కన్నా .. మరో పదేళ్ళు పెద్దది ఆవిడ.
మా డోర్ కర్టెను పక్కకు లాగి పట్టుకుని, లోపలి తొంగి చూస్తూ 'పనిలో ఉన్నారా?' మళ్ళీ అడిగింది.
ఉదయం, నిద్ర లేచినపుడు తీసిన తలుపు .. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడే వేసేది. అయిదవ ఫ్లోర్లోని లిఫ్ట్ పక్క పోర్షన్ అయినా సరే, అది అలానే ఉంటుంది ఎప్పుడూ. నాకు తలుపులు తెరుచుకుని ఉండే అలవాటు ఉన్నందుకేమో! ఎదురు పోర్షన్లోకి ఎవరు వచ్చినా తలుపులు బిడాయించుకునే ఉంటారు.
అలాగే, ఈవిడా. ఎంతో అవసరం అయితే తప్ప బయటకు రాదు. కనిపిస్తే పలకరించుకోవడమే. అలాంటిది ఏం అవసరం వచ్చిందో, పొద్దుటే, గుమ్మం ముందుకు వచ్చింది. ఇంతకు ముందు అయితే .. సాయంత్రాలు వాళ్ళ తలుపులు తెరిస్తే, అప్పుడప్పుడూ ఇంట్లికి వెళ్లి కూర్చునేదాన్ని. ఇంట్లో ఆవిడా, అన్న గారు ఇద్దరే ఉంటారు.
ఆవిడకి భర్త లేకపోతే .. అన్న గారికి భార్య లేదు.
ఉషామణి గారికి ఒక కొడుకూ, కూతురు అయితే .. అన్న గారికీ ఓ కొడుకూ, కూతురే. ఈవిడ కొడుకు సుదర్శనరావు హైదరాబాదులో మంచి ఉద్యోగంలో ఉంటే .. కూతురు పెళ్లై అత్తవారింటిలో ఉంది. కొడుక్కి చేసుకున్నది, ఇంకో అన్న కూతుర్నే. అయినా, ఆ పిల్లకి మేనత్త పొడగిట్టక పోవడంతో .. రిటైరు అయినా కొడుకు దగ్గరకు వెళ్లి ఉండక .. ఉన్న ఊరిలోనే ఉండిపోయింది ఒంటరిగా. ఆ తరువాతి కాలంలో, అన్నగారికి భార్యా, కొడుకూ పోవడంతో .. చెల్లెలి దగ్గరకు వచ్చేసాడట, ఆవిడది సొంత ఇల్లు కావడంతో.