వన్నె తగ్గని వేమన్న పదం

జంధ్యాల రఘుబాబు
నాలుగు వందల ఏళ్ళు దాటినా వేమన పదం కాని, పథం కాని వన్నె తగ్గలేదని అనంతపురం లో జరిగిన వేమన సాహితీ సమాలోచన రుజువు చేసింది. ప్రజల నాలుకలపై తారాడిన, తారాడుతున్న వేమన పద్యాలు నిత్య సత్యాలుగా ఇప్పటికీ వెలిగిపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని, ఒకింత గర్వాన్ని కలుగజేశాయి. అందుకు మనం తెలుగువాళ్ళం కావడమే కారణం కావచ్చు. ''ఏమిటయ్యా, ఈ తెలుగోళ్ళు ఒక మనిషిని ఇంతగా ఆరాధిస్తారా?''  అని ఓ పాత్ర చెప్పే  మాటలు గుర్తొచ్చాయి.  నిజంగా ఎవరినైనా గుర్తుపెట్టుకోవటం, మరచిపోవటం రెండూ మనవారికి బాగా తెలుసు.   సమాజ సేవకులుగా, సంఘ సంస్కర్తలుగా ఉన్నత స్థానంలో పనిచేసినవారు, పేరు తెచ్చుకున్నవారు వేమనను ఎంతగా ఆరాధించారు? అసలు ఆయన చెప్పిన విషయాల్ని ప్రజలకు చేరవేయాలన్న ఆలోచన వారికి కలిగిందా? కలిగినా తొక్కిపెట్టారా? మనసు చంపుకొని ఆ పని ఎలా చేయగలిగారా అన్న అనుమానం మనక్కలుగుతుంది.  ఇంకో పక్క చూస్తే ఒక మహాకవి తన కవిత్రయంలో వేమనకు స్థానమిచ్చాడు. ఇంకో మేటి కవి వేమనను ఏకవచనంతో పలకలేక ''వేమనగారు''అనే రాశాడు. వేమన్న పదాలు వేళ్ళూనుకున్నంతగా ఇతరుల రచనలు సమాజంలో లోతుగా విస్తరించలేదని చెప్పిన కొందరు విమర్శకుల  మాటల్ని మనం ఒప్పుకోవాల్సిందే. 

ఎందరో వక్తలు సదస్సులో ప్రసంగించారు. ఒక్కొక్కరూ వేమనను ఒక్కో కోణంలో చూపటానికి ప్రయత్నించారు. తత్వ శాస్త్రం నుండి సైన్సు దాకా ప్రతి విషయం ఆయన చెప్పాడని ఉదాహరణలతో పాటు వివరించటానికి ప్రయత్నించారు. నిజంగా వేమన నేటికీ ఇంత నిత్యనూతనంగా కనిపించటానికి కారణాలేమిటి అని ఆలోచిస్తే ఆయన ఒక యోగిగా, ఒక సంఘ సంస్కర్తగా, ఒక మహాకవిగా, ఒక విశ్వకవిగా ఎంచుకున్న అంశాలు, చెప్పిన పధ్ధతి పండిత పామరుల 

హదయాలకు దగ్గరగా అల్లిన అల్లికలేనని అనుకోవచ్చు. అసలు సాహిత్యాన్ని, సమాజాన్ని, మన బతుకులను, మన చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు వీటిలో దేనినీ వేమననుండి విడగొట్టి చూడలేకపోవటం ఇంకో కారణం. ఈ విధంగా స్ఫూర్తినిచ్చినవారిలో వేమన ఆద్యుడిగా ఉంటాడు. అతని ఘనత అందులోనే దాగి ఉంది.
 శ్రీ శ్రీ, జాషువా, గురజాడ, కుసుమ ధర్మన్న, సి.వి.రచనలు ఇలా స్రవంతిగా సాహితీ స్రవంతి తన బాధ్యతగా వేమన్నను ఆవిష్కరించాలన్న తలంపే అనంతపురం సదస్సు. దాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వందనం. అందులో భాగంగానే కర్నూలులో జరిపిన సదస్సులో బనగానెపల్లెనుండి ముగ్గురు వేమన అభిమానులు ఎండలకు కూడా లెక్క చేయక వచ్చి పాల్గొనటం ఆశ్చర్యం కలిగించింది.  దానివెనుక ఆ మహాకవి రాసిన పద్యాలు జనాల మనసుల్లో ఇంకా మారుమ్రోగుతుండటమే దానికి కారణం. 

 

''వేమన మన వేమన ఘన వేమన వినవేమన''  అన్న తెలకపల్లి రవిగారు రాసిన రూపకం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ''ఒక సూర్య బింబం, ఒక దీపస్థంభం, ఒక ధైర్య శిఖరం, ఒక జ్ఞాన సంద్రం'' అంటూ మొదలై వేమన పద్యాలు కలిపి నేటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ రాసిన ఈ రూపకం చివరిలో   ''ఎంతగ నువ్వేడ్చావో ఎంత బాధ భరించావో, ఎంతగ తపించావో తరగని తడి గుండె నింపావు'' అన్న పదాలు విన్నప్పుడు   చాలామంది కళ్ళలో నీళ్ళు తిరిగాయి.  ఇదంతా వేమన రచనల్లోని  గొప్పదనాన్ని గుర్తించటమే. 
మొత్తం మీద మహాకవి వేమనను మరొక్క సారి ఆవిష్కరించి ఆయన చెప్పిన వేదాన్ని తెలుసుకోవటానికి చేసిన ఈ ప్రయత్నం అనంతపురంలో ఘనంగా జరపటం అభ్యుదయవాదులకు, లౌకికవాదులకు, ప్రజాస్వామ్యవాదులకు మంచి ఊతాన్నిచ్చిది.   వెనక్కి తిరిగి చూసుకున్నా, వర్తమానంలో చూసినా, భవిష్యత్తును చూసినా వేమన మనవెంటే ఉన్నాడన్న బలం, ఉత్సాహం మనల్ని వెన్నంటే 
ఉంటాయి అన్నది నిజం. అదే వేమన ఘనత.