వడబోత

కవిత

- డా. ఎన్‌.గోపి

నేనెప్పుడూ

పేదల గురించే ఆలోచిస్తాను

పైనించి ఏ ప్రకటన వెలువడ్డా

అది కిందికి వెళ్తుందా లేదా అని చూస్తాను.

ఉపన్యాసాలకు వేసే రంగులను

తుడిచేసి వింటాను

ఓట్లగారడీ వుంటే

దాన్ని కనిపెడతాను.

చిత్తశుద్ధికి స్టెతస్కోపు పెట్టి

స్పందనలను లెక్కిస్తాను.

అసలీ వ్యవస్థ వారికి

అర్థమైందా అని సందేహిస్తాను.

 

వర్గ స్పృహ సంగతి తర్వాత

ఇంతకు వర్ణ వర్గ సంబంధాలు

అవగతమైనాయా అని గొణుక్కుంటాను.

ప్రతినోటా మానవత్వం అనేమాట

మలినమవటాన్ని చూసి దిగులుపడతాను

 

నేనెప్పుడు పేదలగురించే ఆలోచిస్తాను

పేదరికం అంటే ఏమిటో

లెక్కలు తేలక డీలా పడతాను.

సంక్లిష్టతతో స్పష్టతకోసం

సదా పెనుగులాడుతుంటాను.

 

మేధావిగా వుండలేక

పామరత్వాన్ని మేలుగా తలుస్తాను

అద్దాల్లో పెట్టిన వజ్రాల మెరుపులకు లోనుగాక

వీధిలో పెంకాసులను యేరుకుంటాను.

సినిక్‌ గా మారిపోతున్నానా!

జనం నన్ను చూసి భయపడ్తున్నారా!!

భ్రమావరణంలోంచి

శ్రమ సామ్రాజ్యంలోకి వెళ్లాలని వుంటుంది

అయినా ఏదో ఒక రూపంలో

నేనెప్పుడూ పేదల గురించే ఆలోచిస్తాను.