కాలాన్ని సవరించిన మనిషి

కవిత 
- ర్యాలి ప్రసాద్‌ - 9494553425


కంటికి మరో కన్ను తగిలించుకుని
చెడిన కాలాన్ని బాగుచేస్తున్న అతన్ని చూస్తుంటే
మూడో కన్ను తెరవని ముక్కంటిలా కనిపిస్తాడు.

కాలానికి ప్రతిగా కాలాన్ని
సష్టించడం తెలిసిన బ్రహ్మ అతను.

కీ యిచ్చి ముడికాలాన్ని
దగ్గరకు బిగించినపుడు
సమాజాన్ని ఏకంచేసే సూత్రమేదో
మనుషుల్ని దగ్గర చేస్తూ
మహాబంధం అలుముకున్నట్లుంటుంది.

వదులవుతున్న మెయిన్‌ స్ప్రింగ్‌ నుండి
సెకన్లూ నిమిషాలూ గంటలూ
పన్నెండు అంకెల మధ్య దాచివుంచిన
ఇరవై నాలుగ్గంటలుగా రోజును విడదీసి
ప్రపంచానికి పంచుతుంటాడు.

ఒక్కోసారి కాలాన్ని
వేగంగానూ నెమ్మదిగానూ
క్రమంగా నడిపిస్తాడు.

ఒకే డైలులో
రెండు పొద్దుల్ని చూసినపుడు
కాపురాన్ని నడిపే ఆలుమగల్లా వుంటాయి.

తలవెంట్రుక కన్నా
సన్నని హెయిర్‌ స్ప్రింగును గుండ్రంగా చుట్టి
బేలన్స్‌ స్టాపును లయబద్ధంగా
అటూ యిటూ అచ్చం
గుండెలాగా నడిపిస్తాడు.

కాలాన్ని చూపే మూడు ముళ్ళూ
బాల్య యవ్వన వార్ధక్యాల ప్రతిబింబాలవుతాయి.

సుముహుర్తం కోసమో
నమాజ్‌ వేళల పట్టువిడుపుల కోసమో
ప్రత్యేక సమయాల గంటమోతల కోసమో
మతరహితంగా చూసేది ఇతని కాలాన్నే.

లోకంలోని ప్రతి కదలికనూ
నమోదు చేసే భూమ్మీది చిత్రగుప్తుడతను.

శివమెత్తి తిరుగుతున్న కాలం
ఉదయానికల్లా శవమవుతుంది.
కీ తో మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది.

ఆధునికత మనిషి జీవితాన్ని
సులువుగా కాటేయడం మొదలుపెట్టాక
బేటరీరూపంలో ప్రవేశించింది.

వాచీమెకానిక్కు
ఇపుడు కాలం చెల్లిన నాణెం.
శిధిలాలుగా మిగిలిన గంటల గడియారం.

రోడ్డు పక్క అద్దాల పెట్టెలు
గోడకు తగిలించిన పాతకాలం ఫొటోల్లా
గతించిపోయిన కాలానికి
గుర్తులుగా మిగిలిపోతాయి.