మాక్కొంచెం స్వేచ్ఛనివ్వండి!

పుట్టి గిరిధర్‌
94914 93170

పిల్లపక్షులు తల్లి రెక్కల చాటు నుండి
బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టి
రెక్కలు విదిలించేలోపు
చదువుల పంజరంలో వేస్తారు
మేము మాలా జీవించాలనుకున్నా
అధికారులు, తల్లిదండ్రులే
మా మధ్య గోడలుగా నిలుస్తారు
మార్కులంటూ, ర్యాంకులంటూ
మా మధ్య తెలియని గీతను గీస్తారు!

మాక్కొంచెం స్వేచ్ఛనివ్వండి చాలు
పుస్తకాలతో బాటు అల్లరిని
మా భుజాన మోస్తాం
ఆకాశంలోకి ఎగిరేలోపు
ముందు భూమ్మీద నడవటం నేర్పిస్తాం
కిందపడితే కూలిపోవడం కాదు
లేచి నడవడమెలాగో చూపిస్తాం!

వారి హృదయాల్లోకి కిరణాలై ప్రసరించి
వారి కళ్లల్లో వెలుగును చూడకముందే
మేఘాలై అడ్డు నిలిచి నవ్వులను రాల్చేస్తారు
మాక్కొంచెం స్వేచ్ఛనివ్వండి చాలు
పైపైకి ఎదగడం ఒక్కటే కాదు
నీడనిచ్చే మహావృక్షాలను చేస్తాం!

పిల్లల్లో పిల్లలమై తోడుగా
మేము నిలవాలనుకుంటాం
కానీ మమ్మల్ని యంత్రాలుగా చేస్తారు
మాక్కొంచెం స్వేచ్ఛనివ్వండి చాలు
ఆ చిన్న ప్రాణాలకు కూడా
స్వేచ్ఛ ఉందని తెలియజేస్తాం!

పసితనపు తీగలు
మమ్మల్ని అల్లుకుపోవాలని చూస్తాయి
మీ ఆశలకు అనుగుణంగా
వాటిని ఇనుప తీగలుగా మార్చి
బంగారు తీగలని మురిసిపోతారు
మాక్కొంచెం స్వేచ్ఛనివ్వండి చాలు
ఆ పసిమొక్కల ఆలోచనలకు వీలుగా
పాదులు తీసి తడిని పంచి
పచ్చగా అల్లుకునేలా పెంచుతాం!

లేనిపోనివన్నీ రుద్దేస్తూ
అనుక్షణం శాసించేది మీరు
అనుకున్నది చిక్కకపోతే
నిందలు వేసేది మీరే
మాక్కొంచెం స్వేచ్ఛనివ్వండి చాలు
కొత్తగా నేర్పడం కాదు
అసలు బతకడమెలాగో నేర్పిస్తాం!

అలల్లా ఎగసే స్వేచ్ఛను
మీ అదుపాజ్ఞలతో బంధిస్తారు
ఎంతగా ఎగిసినా
తీరాన్ని మాత్రం దాటనివ్వరు
మాక్కొంచెం స్వేచ్ఛనివ్వండి చాలు
ఉరుకుల పరుగుల జలపాతాలను సృష్టిస్తాం!

మీరు కోరే భవిష్యత్తు వైపు పరుగులు పెట్టించి
ఉరితాళ్లను పేననివ్వకండి
మాక్కొంచెం స్వేచ్ఛనివ్వండి చాలు
వలతాళ్ళు విసిరి
లక్ష్యాన్ని అందిపుచ్చుకునేలా చేస్తాం!

ఎవరెటువైపు ఉన్నా
మమ్మల్ని ఎన్నెన్ని హింసలకు గురిచేసినా
గురువులుగా మేము మాత్రం పిల్లలవైపే ఉంటాం
పిల్లలు నడిచే దారులమవుతాం!