ఆన్‌లైన్‌... లైఫ్‌లైన్‌!

సంపాదకీయం 

అనిసెట్టి అరవై అయిదేళ్ల కిందటే అన్నమాట అన్నా మనకీ లోకం పన్నిన పద్మ వ్యూహం గుర్తుచేస్తుంది జీవితం. ఏడు మాసాలు గడిచినా తగ్గని కరోనా వైరస్‌ తాకిడి. అందులోనూ రోజువారి పెరుగుదలలో ప్రపంచ రికార్డు చేదించిన ఇండియా. వాక్సిన్‌ పై ఆశలు అలా ఆలస్యమవుతూనే వున్న వాస్తవం. ప్రజారోగ్య వ్యవస్థ కొరతలు కార్పొరేట్‌ వైద్యం వాతల మధ్య గిజగిజ. ఆన్‌లాక్‌ 4 అంటున్నా జీవిత సమస్యల గడియలు తెరుచుకునే తాళం దొరకని స్థితి. ఉపాధి పోయినవాళ్లు, ఉద్యోగాలు చేస్తున్నా జీతం పూర్తిగా చేతికి రానివాళ్ల్లు, నియామకాలు నిలిచిపోయి చిరు వ్యాపారాలు ఆగిపోయి భవిష్యత్తు అగమ్యమైన వాళ్లు, గ్రామసీమల్లో పనులు లేని లక్షలాది శ్రామికులు, ఇంతటి కల్లోలంలోనూ పంటలు బ్రహ్మండంగా పండించికూడా బతుకు నిలిపే గిట్టుబాటు ధర నోచని కర్షకులు., ఇంటినుంచే పని పర్వంలో ఇంటెడు పనీ అదనంగాచేయడమే గాక గృహ హింస పెరుగుదలకు గురవుతున్న స్త్రీలూ పిల్లలూ, సాహిత్య కారుల కలాలను నిరంతరం పలకరించే వృద్ధ తరం పెద్దలూ ఒకరేమిటి ఎవరికి వారు బాధల బంధీలైన దుస్థితి. ధరల పెరుగుదల పున: ప్రారంభమయ్యే ఇఎంఐలు కట్టడమెలా అని మధ్యతరగతి మానవులు మదనపడుతుంటే జిఎస్‌టి లోటు పోటుతో రాష్ట్రాలే తలకిందులవుతున్న పరిస్థితి. మైనస్‌ ధరలో పడిపోయిన పెట్రోలుపై 18 లక్షల కోట్ల మిగులు వాటితో పంచుకోవడానికి సిద్దంగా లేని కేంద్రం అప్పుల మార్గమే చూపిస్తున్న విచిత్రం. ఇవన్నీ గాక ఎపిలో అదనంగా రాజధాని ప్రతిష్టంభనలో రాజకీయ పరిభ్రమణం. మరోసారి ప్రాంతాల కులాల కుటిల కృత్రిమ రాజకీయాల విజృంభణ. ఇవన్నీ పన్నిన పద్మవ్యూహం కావచ్చుగాని కవిత్వమొక తీరని దాహం అనిన్నీ అనలేదా మన మహాకవి! కాబట్టి జంకుగొంకు లేక ముందుకు సాగిపోవాల్సిందే. జీవిత పోరాటం సాగించాల్సిందే. ఈ కరోనానే కవి కట్టిన వారూ, పాటలు పాడిన వారూ ఎందరో! ఏలినవారు సెప్టెంబరు 21 తర్వాత వందమందికి మించకుండా సభలూ సమావేశాలు జరుపుకోవచ్చన్నారు గనక సాహిత్య జీవులు ఆన్‌లైన్‌ నుంచి మళ్లీ లైఫ్‌లైన్‌లోకి రావచ్చు. జాగ్రత్తలు మాత్రం మర్చిపోకూడదు సుమా!