విహంగిని

- సునీత గంగవరపు

ఆమెనలా వుండనివ్వండి
కాసేపైనా..
శూన్యంలో వేలాడే చినుకుచుక్క
నేల గుండెను ముద్దాడేవరకైనా
రాత్రి జాము..
సముద్రపు ఒడ్డున
చెక్కిట చేయి చేర్చి
అలలపడవల్లో
కలలు కంటున్న ఆమెను
అలా...వుండనివ్వండి
చుట్టూ.. ఏ శబ్ద సంకేతాలు
చొరబడని చీకట్లలో
ఓ స్నేహస్పర్శకై దాహంతో
దోసిలొగ్గిన ఆమె సందేశాన్ని
వెన్నెల జడిలో ..కాసేపలా
సేదదీరనివ్వండి
అసంకల్పిత సంఘర్షణలతో
ఆశల కంకుల నడుమ
చిట్టి ముక్కు పిట్టలా విహరిస్తున్న
ఆమెను.. ఎవరూ కదపకండి
వేళ్లసందుల గుండా
జారుతున్న జ్ఞాపకాల్లో..
గోరువెచ్చని ఊహల్ని నెమరేసుకుంటూ
కంటిరెప్పల కింద నానిన
అనుభూతుల పుటల్ని
వేకువ పొద్దులో
అభావంగా తిరగేస్తున్న ఆమెను
ఎవరూ..కదల్చకండి
ఆమెనలా.. కాసేపు
ఆమెతోనే వుండిపోనివ్వండి!