అన్నంకుండ

కవిత

- మార్ని జానకిరామ్‌చౌదరి - 94403 38303

ఒకప్పుడు
తన కడుపు కాల్చుకుంటూ
అందరి కడుపూ నింపిన అన్నంకుండ
నేడు ఓటికుండగా మిగిలి
తనువెల్లా శిధిలమై
శిశిర పత్రంలా నేలచూపులు చూస్తోంది.

కడుపు చీల్చుకొచ్చిన మొలక
ఆకాశమంత ఎత్తు ఎదిగినా
జానెడు నీడ పంచటానికో
గుప్పెడు గింజలు రాల్చడానికో
లెక్కలేసుకొన్నప్పుడు
దిగులు ఊబిలో కూరుకుపోతున్న బాధ.
గాజుకంటిలో ఊరుతున్న నీటిని
రెప్పమాటున తాటిస్తూ
''ఆకలేస్తోందన్న'' మాట
చీదరింపుల పెదవి విరుపుల మధ్య
గొంతు దాటక మునుపే
పూడుకుపోతుంది.
తడితేలిన కళ్ళకు
వెలుతురు కాటుక దిద్ది
చితికిన మనసుకు
అతుకులు వేసుకుంటూ
జ్ఞాపకాల నెమరును
లేపనంగా పూసుకొంటోంది
పొద్దువాలుతున్న వేళ
ఈకలు రాల్చిన దిగులు పక్షిలా
పడమటి కొండలకేసి
చూపు సారిస్తోన్న మనసు
ఆఖరి పిలుపుకోసం
వేగిరపడుతోంది
పేగు తెంచుకున్న పాశం
చిటికెడు ప్రేమను రంగరించి
గోరువెచ్చని స్పర్శతో
గుండె తడిమే రోజుకోసం
ఆరాటపడుతూనే ఉంటుంది...
పగిలిన ఆ ''అన్నంకుండ''
గుప్పెడు మన్నుగా మారేవరకూ!
(అక్టోబరు 1వ తేదీ ''ప్రపంచ వృద్ధుల దినోత్సవం'' సందర్భంగా)