ఈ కవి చాలా ఆశ పెడుతున్నాడు

ప్రసాదమూర్తి
84998 66699

పువ్వు పట్టగానే పరిమళిస్తుందంటారు. కవి పుట్టగానే లోకాన్ని వేల కళ్ళతో పలకరిస్తాడు. కవి పుట్టడం అంటే అతను పుస్తకంగా లోకంలోకి వచ్చిన మొదటి విశేషమే. రానున్న కాలంలో తాను రాల్చే అగ్నిపూల రేకుల పరిమళాలు ఆ తొలి పుస్తకానికి తోరణాలవుతాయి. సాంబమూర్తి లండ మొదటి కవితా సంపుటి 'గాజు రెక్కల తూనీగ'. తాను ముందు ముందు మరిన్ని రెక్కలతో మన చుట్టూ సుగంధాలు కురిపిస్తూ ప్రత్యక్షమవుతానని వాగ్దానం చేసినట్టు ఆ పుస్తకం మనకు మాటి మాటికీ చెప్తుంది. 'ఇంకొంచెం యుద్ధాన్ని ప్రేమించు' అనే కవితతో తన మొదటి పుస్తకం మొదలవుతుంది. 'జీవితమంటే యుద్ధాన్ని పొడిగిస్తూ పోవడమే' అంటాడు. అదిగో అంత స్పష్టంగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన వాడు సాంబమూర్తి. నిజంగానే ఇప్పుడు నాలుగు రెక్కలు తొడుక్కుని వస్తున్నాడు. గాజు రెక్కల తూనీగ మన హృదయాల మీద ఇప్పటికే ఒక నాజూకు సంతకం చేసింది. ఇప్పుడు నాలుగు రెక్కలతో ఒక పిట్ట సంబరం చేయడానికి మన అంబరాల మీద వాలుతోంది.
''కవిత్వం హేతుబద్ధమూ కాదు, అహేతుకమూ కాదు. అది పరిపూర్ణ మానవానుభవం. అనుభవాన్ని అనుభవంగా అందించడం కవిత్వ లక్ష్యం. సత్య సాధన దాని గమ్యం.'' ఇది ఇస్మాయిల్‌ మాట. కవిత్వానికి నాకు నచ్చిన గొప్ప నిర్వచనాల్లో ఇదొకటి. సాంబమూర్తిని చదువుతుంటే నాకు ఈ మాటలు గుర్తుకొచ్చాయి. ఇతను తెచ్చిపెట్టుకున్న అనుభవాన్ని పంచుకోలేదు. లేని ఆడంబరాన్ని ప్రదర్శించలేదు. తనకు తెలిసిన లోకాన్ని తనకు తెలిసిన జ్ఞానంతో చూసి తనకు తెలిసిన అనుభవంతో కవితలు రాసుకున్నాడు. నేను రెండో పుస్తకాన్ని చదివి అతను రాసిన మొదటి పుస్తకాన్ని మళ్ళీ చదివాను. అనుభవంలో, లోక పరిశీలనలో, వస్తువును ఎంచుకోవడంలో, వ్యక్తీకరణలో, కవిత్వమై పరవశించడంలో మొదటి పుస్తకం కంటే కవి ఏ మాత్రం పరిణతి సాధించాడన్నదే గీటురాయి. చాలామంది ఎంత గొప్ప కవిత్వం రాసినా తమ మొదటి పుస్తకం దగ్గర నుంచే ప్రతిసారీ వారి గుర్తింపు మొదలవుతుంది. అదే అసలైన కవికి సిసలైన గుర్తింపు కూడా. శ్రీశ్రీ గుర్తుకొచ్చినప్పుడు మహాప్రస్థానం గుర్తు రాకుండా వుండదు. దీని అర్థం ఆ కవి తన మొదటి పుస్తకంతోనే ఆగిపోయాడని కాదు. కవికి వయసు పెరిగినట్టే అతని కవితల సంఖ్య పెరగవచ్చు. అది కవి యాత్రలో క్రమాన్ని తెలిపేదే కాని ఆ కవికి అదే కొలమానం కాదు. ఎంత వైవిధ్యభరితంగా కవి తనను తాను ఆవిష్కరించుకుంటూ ముందుకు సాగిపోతున్నా అతని తొలి అడుగుల సవ్వడులు గుర్తు రాకుంటే అతని యాత్ర అసంపూర్ణమే!
సాంబమూర్తి గాజు రెక్కల తూనీగ మన వేళ్ళ మీద వాలి అతని ప్రయాణంలోని మలుపులన్నీ మనకు పరిచయం చేస్తుంది. అది ప్రస్తుతానికి నాలుగు రెక్కలు తొడుక్కుంది. ఇంకోసారి పది రెక్కలతో పలకరించవచ్చు. మరోసారి వేయి రెక్కలతో మనల్ని చుట్టుముట్టవచ్చు. సాంబమూర్తి అంత ఆశ కల్పించాడు ఈ రెండో పుస్తకంతో. చాలాచోట్ల ఈ యువ కవి నన్ను కలవరానికి గురి చేశాడు. 'పాటల అవ్వ' అనే కవిత చాలాసార్లు చదువుకున్నాను. పాటల అవ్వ మాయమైపోయింది. ఆమెను స్మరించుకుంటూ రాసిన కవిత ఇది. అంటాడు కదా..
''గొంతు చేతులతో పాటనెత్తుకుని
ఊరేగేంచే అవ్వ
ఇవాళెందుకో పాటను
జ్ఞాపకాల వాకిట్లోనే దించేసి వెళ్ళిపోయింది
.................
అవ్వ జోరుగా పాటల సేద్యం చేసే రోజుల్లో
రాలిపడ్డ గింజలేమైనా ఉంటే
పాటలై మొలకెత్తే వరకూ / వేచి చూడండి.''
కవి ఊహ, ఆ ఊహతో కవి చేసే పారవశ్య ప్రయాణం ... ఇలా కొన్ని పద చిత్రాల్లో కొన్ని బలమైన వాక్యాల్లో వ్యక్తమైనప్పుడు పాఠకుడు పరమానంద భరితుడవుతాడు. ఈ పుస్తకంలో నాకు ఇలాంటి ఆనందాలు చాలా కలిగాయి. 'ఇన్నేళ్ళ నా కాలి కింద నేల/ ఒక మట్టిపద్యాన్ని చదివింది/ ఎప్పటిదో ఒక పూల తీగ/ నా వెన్నులో అటూ ఇటూ ఊగింది' అని ఈ కవి 'తొలి పువ్వు' కవితలో అంటే నా వెన్నులో కూడా ఏదో పూల తీగ ఊగినట్టయింది. చూడాలంటే ఊరిని అది నిద్ర లేస్తున్నప్పుడే చూడాలి అంటాడు మరో కవితలో. ఆ వాక్యం చదివిన వెంటనే నాకు మా ఊరు.. నా బాల్యం.. ఊరు నిద్ర లేచినప్పుడు నేను కన్నవి.. విన్నవి నా కడుపులో దాచుకున్న సమస్త దృశ్యాలూ నా నరాల్లో సంగీతమై ప్రవహించి నన్నూ ఆ ప్రవాహంలో కలిపేసుకున్నాయి. కవిత్వం చేసే మెస్మరిజం ఇదే!
నాకు సాంబమూర్తి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. అంటే ఎఫ్బీలో నేను అతను పోస్టు చేసిన కవితను చదివి ఇతనెవరో బాగా రాస్తున్నాడే అనుకున్నాను. ఒకరోజు అతని కవిత ఒకటి ఆంధ్రజ్యోతిలో చదివి ఫోన్‌ చేశాను. నా నుంచి ఫోన్‌ రావడం గొప్పగా వుందన్నాడు. దీని కంటే నీ కవితే గొప్పగా వుందన్నాను. యువకుల ముందు వినమ్రంగా తల దించుకున్ననాడే మన పెద్దరికం నిలబడుతుంది. ఇవాళే అతను రాసిన కవిత ఒకటి ప్రజాశక్తిలో వచ్చింది చూశాను. ''జీవితం రొదలో ప్రపంచం/ యుద్ధాన్నెప్పుడో మరిచిపోయింది'' అన్నాడు. నా గుండెల్లో ఏవో నీళ్ళు రొద చేశాయి. నిరీక్షణా యుద్ధమే అన్నాడు. చెమర్చిన కళ్ళూ ఏదో రొద చేశాయి. ''రెప్పల బయట ఎదురు చూసే కల'' అని మొన్నామధ్య ఇతని కవిత ఒకటి చూశాను . కల లోపలికి ప్రవేశించే ఒక కలలాంటి కవిత అది. చదువుతున్న కొద్దీ అతని పట్ల ఇష్టం పెరుగుతూ వచ్చింది. కుర్రాళ్ళ మీద గురి కుదురుతూ వచ్చింది. 'మొలకెత్తుతున్న ఇల్లు' అని ఇంకో కవిత చూశాను.
''కాగితంలో గీసుకున్న గీతలు
నేల మీద వాలుతుంటే
ప్రసూతి గది బయట
పచార్లు చేసే భర్తనవుతాను
అంతా అనుకున్నట్టే జరుగుతుందా
బిడ్డేమీ అడ్డం తిరగలేదు కదా''
నేనలా పచార్లు చేసిన ఒక రాత్రి నాకు గుర్తుకొచ్చింది. ఒక్కోసారి కాళ్ళ నుంచి కూడా కన్నీళ్లు కురుస్తాయి. అరికాళ్ళలో తడి తగిలింది. ఈ కవితలోనే అంటాడు కదా ..
''అతిథుల్లారా కొంచెం మెత్త మెత్తగా నడవండి
ఇంట్లో నేలంతా / నా గుండెను తాపడం చేసాను
కిటికీలను సున్నితంగా తెరవండి
నా కనురెప్పల్ని / కర్టెన్లుగా వేసుంచాను''
ఇది చదివితే నాకు మీర్‌ అనే ఉర్దూ కవి రాసిన వాక్యాలు గుర్తుకొచ్చాయి. ఈ ప్రపంచం ఒక గాజు కార్ఖానాలాంటిదట. మనం ఊపిరి కూడా ఎంతో సున్నితంగా తీసుకోవాలట. ఇలా ముట్టుకుంటే అలా భళ్ళుమని పగిలిపోతుందా ఇతని హృదయం అన్నట్టుండాలి కవి. అప్పుడే ఇలాంటి మాటలు సాధ్యమవుతాయి.
ఇతనిలోని తాత్విక ధోరణులు నన్ను మరీ మురిపించాయి. వయసెంతైనా తాత్వికత అనేది కవికి రక్తమాంసాలకు అతీతమైన ప్రాణశక్తిలాంటిది. అనుభవం అనే కవితలో చూడండి :
''చిన్నప్పుడు/ రాత్రులు ఎందుకనే ప్రశ్న
నీడలా వెంటాడేది
రాత్రులున్నది / కొద్ది కొద్దిగా
మరణాన్ని అలవాటు చేయడానికే అని
తెలిసొచ్చాక/ రాత్రులతో ప్రేమలో పడ్డాను''
కవికి ఉన్నంతగా మరణానుభవం మరెవరికీ ఉండదు. మరణంలో పుట్టి మరణంలో బతికి మరణంలో జీవితాన్ని రసమయం చేసుకునే తాంత్రికుడు కవి. మరణం అంటే కవికి జీవితమే! యుద్ధమూ మరణమూ కవికి రెండు గుండెలు.
''కలా కానీ మెలకువా కానీ/ ఒక నిశ్చింత వేకువలో/ ఎదురయ్యే ప్రతి స్వప్నం/ ఏవో పురాతన మరణ రహస్యాలను/ విప్పి చెబుతుంది.''
చూశారా, ఈ కవిత చదివే మొదటిసారి నేను సాంబమూర్తికి ఫోన్‌ చేశాను. వయసుకి మించిన తాత్వికతను కవి మెడలో పేగులా వేసుకు పుడతాడు. ఈ మాటలు చూడండి : ''నా కోసం/ ఆరడుగుల నేలను వెతికే పనిలో
మట్టీ,/ ఒక ఎలిజీని రాసే పనిలో
అలలూ / తలమునకలై వుంటాయి''
ఇంకా ఏం చెప్పాలి? అసలీ కవి తన మొదటి పుస్తకంలోనే ఈ వాసన వేశాడు. వాసన అంటే జీవితం గురించిన చింతనాత్మకమైన పరిమళం. ''బంధాల చెట్టు పై నుండి/ ఒక ఆకులా రాలిపోయేటప్పుడైనా/ నవ్వుతూ వెళ్ళిపోవాలి.'' హిమాలయాలను అధిరోహించేవాడే కాదు, మృత్యు శిఖరాలపై నిలబడి మీసం తిప్పే కవే సాహసికుడు.
''ఎవరో ఒకరు
నీలోంచి ఎగిరిపోయాక గానీ తెలీదు
నువ్వు శూన్యానివని''
ఈ దారిలోనే శూన్య కవిత కురిసింది. ఈ కవిత మొత్తం ఒక సుదీర్ఘ జీవితానుభవంలోని పరిపక్వమైన ఆనందాన్నిస్తుంది. ''జీవితం పొడవునా ఇంటిల్లిపాదికీ/ అందమైన కవితలల్లుతూ అలసిన నేను/ నా సమాధి మీద చెక్కేందుకు/ ఒక శూన్య కవితను రాసి పెట్టుకోవాలి''
మరి ఈ కవిని నేను మనసునిండా హత్తుకోకుండా ఎలా వుండగలను? ఇతను రాసిన స్త్రీ కేంద్రక కవితలూ, స్త్రీలు ఆకర్షించినంతగా ఆకర్షించాయి. స్త్రీలను ప్రేమించని వాడు పురుషుడూ కాదు, స్త్రీ కానివాడు కవీ కాదు. ప్రతి కవిలోనూ ఎంతో కొంత స్త్రీత్వం ఉంటుంది. అప్పుడే అతని కవిత్వం మృదుత్వంలో స్నానించిన ఒక లలితమైన నగ దేహ ఖడ్గంలా ప్రకాశిస్తుంది. ఈ రహస్యం తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో కానీ ఒక చోట -
''సగాన్ని మాత్రమే ఆమెకిచ్చే
లోభత్వం నాలో లేదు
అందుకేనేమో
నా వాక్యాలు స్త్రీ వాసనేస్తుంటాయి
గంటో గడో స్త్రీలు కాకపోతే
ఎవరైనా కవిత్వాన్నెలా రాస్తారు?''
ఇది చదివాక ఇతనికి తెలియనిదేముంది అనిపిస్తుంది. ''ఆ రోజుల్లో'' అనే కవిత స్త్రీని గాయాల నదిలా మన ముందు ఆవిష్కరిస్తుంది.
''కొత్తేమే కాదు
నా పుట్టుకకు పూర్వమే
నేను సంతకం చేసిన మోసపు ఒప్పందం ఇది''
ఇలా మొదలు పెట్టి, ప్రకృతి పన్నిన ఉచ్చులో ఇరుక్కుపోయిన స్త్రీని ప్రవహిస్తున్న గాయాల నదిగా ముగిస్తాడు. అందుకే ఇతను సతిని ముట్టని నాటి సాంబమూర్తి కాదు. సతిలో నిత్యం రగిలే చితిని అరచేతుల్లో పట్టి చూపిన సాంబమూర్తి.
సుమారు ఆరు పదులకు పైగా కవితలతో ముస్తాబవుతున్న ఈ పుస్తకంలో అతని ఊరు గురించిన స్పందనలు నిజంగా వినగలిగితే ఆ ఊరు ఈ కవిని కన్నందుకు కన్నీళ్ళతో కౌగిలించుకుంటుంది. ఎవరైనా ఒక తల్లికే పుడతారు కానీ కవి మాత్రం పల్లె తల్లికే పుడతాడు. సముద్ర తీరంలో ఉద్యానవనంలాంటి ఊరు, అమూర్త శక్తుల అఘాయిత్యాలకు గురై, మూత్ర పిండాలు కోల్పోయిన ఉత్త ఉద్ధానంగా మిగిలింది. శోక తీరం, ఐదో ఎక్కం లాంటి కవితల్లో కవిగారి ఊరు ప్రతి అక్షరానికీ ఊ కొడుతున్నట్టు ఉంటుంది.
''కాలం కత్తి వాదర మీద వెనక్కి వెనక్కి నడుస్తోంది
కలల తీరం కోతకు గురువుతూనే వుంది
ఏళ్ళుగా ప్రవహించిన నిర్లక్ష్యమిప్పుడు
గరళమై ఉద్దాన గర్భాన్ని విచ్ఛిన్నం చేసింది
కిడ్నీలు అలసిపోయిన తీరమిప్పుడు
మొప్పలు తెగిపడిన చేపల్లే
గుప్పెడు ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది''
నేను టీవీ9లో 30 మినిట్స్‌ ప్రోగ్రాం చేసినప్పుడు ఉద్దానం మీద కొన్ని ఎపిసోడ్స్‌ చేశాను. అప్పుడూ, ఈ కవిత చదివినప్పుడూ నా దేహంలోనూ ఒక ఉద్దానం ఉన్నట్టు ఒకసారి తడిమి చూసుకున్న అనుభవమే కలిగింది. ''ప్రతి రాత్రీ దు:ఖానికే రాసిచ్చేసి/ నా నేల నిద్రలోకి జారుకుంటుంది/ ఎవరైనా ఇటుకేసి వస్తారో రారో/ వచ్చినా నిద్ర లేపుతారో లేదో/''. ఇలాంటి వాక్యాలు చదివినప్పుడు ఆ దు:ఖం మన రెప్పల మీద వేలాడుతున్నట్టే అనిపిస్తుంది.
కవికి పొలిటికల్‌ టెంపర్మెంట్‌ కూడా అవసరమే. అదే కావాలంటే అక్కడే నా తగాదా. కవి తన చుట్టూ జరుగుతున్న వాస్తవాలను చూసి అవి తనకే జరుగుతున్న అనుభవంలోకి వెళ్ళి అక్షరాల్లో తనను అగ్ని కణికల్లా నిక్షిప్తం చేసుకుంటాడు. అలా చేయనంత మాత్రాన కవి కాకుండానూ పోడు. కానీ సాంబమూర్తికి ఈ లక్షణమూ ఒక అతని కవిత్వాన్ని వెలిగించే మరో దీపమైంది.
''రాబందూ రాబందూ కూడబలుక్కోని
వల్లకాడును పంచుకున్నాక
మద్దతు ధర ఆశలైనా
వలస దు:ఖపు ఉపశమనాలైనా
ఐదేళ్ళకోసారి వల్లె వేసుకునే
ఐదో ఎక్కంలోని గుణిజాలే''
ఒక్కో కవిలో ఆగ్రహం ఒక్కో దారి వెతుక్కుంటుంది. రైతుల ఉద్యమం సాగిన రోజుల్లో ఇతను రాసిన పద్యాలు ఇతని రాజకీయ చైతన్యాన్ని చూపే దివిటీలు. ఇతను పరిణతి చెందుతున్నాడని, ఇతను ముందు ముందు మంత్రదండం పట్టుకుని కవిత్వాన్ని కుప్పిగంతులు వేయిస్తాడని మాయ మాటలు చెప్పను. ఇతను నిజంగా స్వచ్ఛమైన కవిత్వాన్ని మరింత స్వచ్ఛంగా పలవరించి, కవిత్వ ప్రేమికులను మరింత ప్రేమగా పలకరిస్తాడన్న భరోసా మాత్రం ఇస్తాను. ఈ ధైర్యం ఈ కవితలు కలిగించాయి.
''నువ్వెళ్ళిపోయాక కూడా
నీ కలల చెట్టు పూలు పూస్తుండాలి
.................
జ్ఞానంతోనో కవిత్వంతోనో వెలిగిస్తేనే
ఈ ముఖాల ప్లాస్టికత్వం పోతుంది''
ఇలాంటి మాటలు సాంబమూర్తిని మనకు మరింత దగ్గర చేస్తాయి. అనేకానేక అవకతవక ముఖాల ప్లాస్టికత్వం మీద చల్లుతున్న మానవత్వం ఇతని కవిత్వం. ''నాలో మానవతా దీపాల్ని వెలిగించిన/ ప్రతి కవికీ వినమ్రతతో నమస్కరిస్తున్నాను'' అని సాంబమూర్తి తన వినయాన్ని ప్రకటించుకున్నాడు. ఇతని కవిత్వానికి నేనూ వినమ్రంగా అభినందనలు తెలుపుతూ, సాంబమూర్తి భుజం తడుతున్నాను కొంచెం సంబరంగా. కొంచెం తన్మయంగా, చాలా ఆశగా.