సాహిత్యం ఎందుకు? ఎవరికి?

- శ్రీశ్రీ

సామాజిక జీవితం లేకపోతే సాహిత్యం అనేదే సాధ్యం కాదు. ఈ సంగతి జ్ఞప్తిలో ఉంచుకుంటే సాహిత్యం ఎందుకు? అనే రెండు ప్రశ్నలకూ జవాబు వస్తుంది. ఎందుకంటే సమాజాభివృద్ధికనీ, ఎవరికంటే ప్రజలకీ అని.
కాని ఈ సమస్యలింత సులభంగా సూక్ష్మంగా పరిష్కారం అయిపోగలిగినవి కావు. అభివృద్ధి అంటే ఏమిటి? ప్రజలంటే ఎవరు? అనే ప్రశ్నలు మళ్లీ బయలుదేరుతాయి. వాటికి జవాబిచ్చే ప్రయత్నంలో మరికొన్ని కొత్త ప్రశ్నలెదురవుతాయి.
ఇప్పుడు రాస్తున్న రచనలన్నీ అభివృద్ధికే దారితీస్తున్నాయా? ఈ రాస్తున్నవన్నీ ప్రజల అందుబాటులోకి వస్తున్నాయా? అసలీ సాహ్యితం పట్ల ప్రజలేమాత్రం సుముఖంగా ఉన్నారు? దాదాపు నూటికి 90 పాళ్ళు నిరక్షరాస్యులుగా దరిద్రులుగా ఉంటూన్న ప్రజలకు మీ పాటలూ, పద్యాలూ, కథలూ, కబుర్లూ చెవికెక్కుతున్నాయనే నమ్ముతున్నారా? అటువంటి అవకాశం లేనప్పుడు ఇక మీ సాహిత్యం ఎందుకు?
సాహిత్యంలో ఏ మాత్రం సంబంధం ఉన్నవారైనా ఈ ప్రశ్నలను గురించి తీవ్రంగా ఆలోచించక తప్పదు.
ప్రజాసామాన్యానికి సాహిత్యం అందుబాటులో లేదన్న యదర్థాన్ని గుర్తించక తప్పదు. స్వతహాగా దాన్ని అందుకోడానికి వారు అనర్హులు కారని కూడా గుర్తించాలి. కొన్ని ప్రతిబంధకాలు అడ్డుపడి ప్రజలు సాహిత్యానికి నాడు దూరమైపోయారు. ఆ ప్రతిబంధకాలను తొలగిస్తే సాహిత్యానికి ప్రజల ఆదరం దొరుకుతుంది. ఎక్కడ సాహిత్య సభలు జరిగినా ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉండడమే వారిలో ఉన్న తీవ్రకాంక్షకు నిదర్శనం. అట్టి కాంక్షను సంతృప్తిపరచకపోతే ఆ లోపం రచయితలదే అవుతుంది.
నిజానికి లోకాన్ని నిరాకరించి ఏ రచయితా కావ్యం అల్లలేడు. లోకాతీతమైన విషయాలు రాస్తున్నాని యెవడైనా అనుకుంటే అంతకంటే ఆత్మవంచన ఇంకొకటి ఉండబోదు. రచయితలకు ఆత్మవిశ్వాసం ఉండవలసిందే. కాని ఆ దృఢ విశ్వాసం ఇతరులపట్ల అలసభావంగా పరిణమించకూడదు. ''నేను చాలా గొప్పవాణ్ణి కాని నన్నెవ్వరూ గుర్తించకుండా
ఉన్నారనుకోవడం తప్పు. గొప్పతనంలో ఉన్న గొప్పతనం గుర్తించబడడంలోనే ఉంటుంది. అందుకే పేరు ప్రఖ్యాతులు వచ్చిన ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక విశేషం ఉంటుంది,
ఉండి తీరుతుంది. అలాగే ఒక విశేషం ఉన్నప్పుడు దాన్ని గుర్తించగలిగినవారు కూడా ఉంటారు.
ప్రజాసామాన్యానికి మొత్తం మీద ఉండే ఒకానొక ఇంగితజ్ఞానమే నాయకత్వానికి తూకం వేస్తుంది. జీవితంలోని అన్ని శాఖలకూ - కళ, సాహిత్యం, పరిపాలన, నీతి అన్నిటికీ ఈ సమిష్టి జ్ఞనమే నికషోపలం. కాబట్టి దేని ప్రాశస్త్యాన్నైనా, నిర్ణయించవలసిన వారు ప్రజలే.
అటువంటి ప్రజలు ఈనాడు అంధకారంలో, అజ్ఞానంలో, దారిద్య్రంలో అలమటిస్తున్నారు. వీరినిట్టి స్థితిలో ఉంచడం కొందరికి లాభదాయకం. కాబట్టి స్వప్రయోజనం కోసమని ప్రజాభివృద్ధి వీరు నిరోధించక తప్పడం లేదు. ప్రజలలో జ్ఞానం వృద్ధి అవుతున్నకొద్దీ ఇటువంటి వారికి ఆటకట్టు అయి తీరుతుంది. ప్రజలు అజ్ఞానంలో మగ్గుతూ ఉండడం ఎవరికైనా లాభకరం కావచ్చును కాని రచయితలకు మాత్రం కాదు. ప్రజాసామాన్యం నికృష్టిస్థితిలో ఉంటే రచయిత కూడా ఆ స్థితిని దాటలేడు. నిజమైన వికాసాన్నీ ప్రబోధాన్నీ ఇచ్చే శక్తి సాహిత్యానికే ఉన్నప్పుడు దానిని రచయిత ప్రజాయత్తం చేయకుండా ఉండలేడు. గాయకుని సంగీతం, చిత్రకారుని బొమ్మలూ, నటుని అభినయం, సాహిత్యపరుల రచనలూ ఎందుకంటే ప్రజలకు ఉత్తేజపరచడానికే. ఇది అన్ని కాలాల్లోనూ జరుగుతున్న పని. ఈనాడు ముఖ్యంగా జరగవలసిన పని.
సాహిత్యానికి ప్రజలు దూరమైపోయినట్లే ప్రజలకు సాహిత్యపరులు కూడా దూరమైపోతున్నారు. ప్రజలను కలవరపరిచే సమస్యలతో నిమిత్తం లేకుండా వీరందరూ ఎవరి ప్రాకారాలలో వారు జీవిస్తున్నారు. ఇందువల్ల ప్రజలకూ రచయితలకూ పెద్ద అఖాతం ఏర్పడింది. ప్రజల సమస్యలే తన సమస్యలని రచయిత గ్రహించలేకుండా ఉన్నాడు. ఎవరికీ బోధపడని రాతలు రాస్తున్నాడని రచయితపట్ల ప్రజలు ఔదాసీన్యం వహించడం తటస్థిస్తోంది. ఈ విధంగా ఇరువురి మధ్యనూ ఏర్పడ్డ అఖాతం నానాటికి మరింత హెచ్చిపోకుండా చేయాలంటే రచయితలే ముందుగా ప్రజలవైపు చెయ్యి జాచవలసి వుంటుంది. నేను ప్రజలకంటే అధికుణ్ణనిగాని, అతీతుణ్ణినిగాని, రచనలు వారి కోసం రాయడంలేదనిగాని అనుకొని ప్రయోజనం లేదు. సమాజంతో సంబంధం వదలుకొని సమాజం తన్ను ఆదరించలేదని బాధపడే రచయితను చూచి జాలిపడడం తప్ప మరేమీ చెయ్యలేము.
నేటి ధనస్వామ్య వ్యవస్థలో సాహిత్యం ఎందుకు? ఎవరికి? అనే ప్రశ్నలకు చటుక్కున స్ఫురించే జవాబులు కూడా లేకపోలేదు. రచయితలలో నున్న ఎన్నో కల్మషాలను పట్టి చూపించే జవాబులవి. ఈ వ్యవస్థను ఎందుకు మార్చవలసి ఉందో చూపించడానికి ఈ జవాబులూ, వీటి వెనక ఉన్న మనస్తత్వమూ ఉపకరిస్తాయి.
సాహిత్యం ఎందుకు? డబ్బుకోసం. సాహిత్యం ఎవరికి? ధనమున్న వారికి. ఇవీ ప్రస్తుతం వ్యవస్థలో స్ఫురించే జవాబులు.
ఇరవయ్యో శతాబ్దం ప్రారంభమైన సరికి ధనస్వామ్య వ్యవస్థ పారమ్యం పొందింది. స్వచ్ఛంద వ్యాపారం అనే సూత్రం నిరాఘటంగా రాజ్యం చేసింది. దీని ఫలితంగా ఆఫీసు
కుర్రాళ్లు కోటీశ్వరులయ్యారు. తిరుగుబోతులు సామ్రాజ్య నిర్మాతలయ్యారు. వారి జీవితాలు స్వయం సహాయానికి
ఉదాహరణలయ్యాయి. అట్టి పనులను ముందుతరాల వారికి ఆదర్శప్రాయులుగా చూపించడం జరిగింది. ''నేను జీవితం ప్రారంభించినప్పుడు జేబులో మూడు షిల్లింగులు లేవు. ఇప్పుడు నేను మూడు కోట్ల పౌన్లను కేవలం దానధర్మాలకింద వినియోగించగలుగుతున్నాను' అని ఒక కోటీశ్వరుడంటే స్వచ్ఛంద వ్యాపారానికి జై అనక తప్పింది కాదు. లోకానికి కొత్తకొత్త యంత్రాలు, రైళ్లు, స్టీమర్లు, తపాలాలు, తంతి, నిస్తంత్రి వార్తలు, కాలాన్నీ, దూరాన్నీ జయించడం - ధనస్వామ్య వ్యవస్థకు అసాధ్యమన్నదే లేదన్నట్లు కనబడింది. నిర్మాణ దృష్ట్యా ధనస్వామ్యం ప్రపంచమంతటా ఒక బలిష్టమైన వల అల్లివేసింది. అడుగున ప్రారంభించడం, ఒక్కొక్క మెట్టుగా ఎక్కడం, శిఖరం అందుకోవడం! జీవితం ఈ సింపుల్‌ ఫార్ములా కి రెడ్యూస్‌ అయిపోయినట్లు తోచింది.
కాని ఈ శతాబ్దంలో యాభై సంవత్సరాలైనా పూర్తి కాకుండానే రెండు ప్రపంచ మహాయుద్ధాలు ఒక దాన్ని కన్నా ప్రచండంగా ఇంకొకటి చెలరేగాయి. గత శతాబ్దంలో హెచ్చరికలు చేసిన వారి జోస్యాలు ఫలించడం మొదలుపెట్టాయి. స్వేచ్ఛా వ్యాపారం స్పర్థలకీ, అనర్థాలకీ, యుద్ధాలకీ దారి తీస్తుందనీ, ధనస్వామ్యవ్యవస్థలో గర్భితంగా ఉన్న పరస్పర వైరుధ్యాలే దాని పతనానికి కారణమవుతాయనీ, తర్వాత అంతకన్నా న్యాయబద్ధమైన, సామ్యసిద్ధమైన వ్యవస్థ ఏర్పడుతుందనీ, చేసిన జోస్యం ఫలోన్ముఖానికి వస్తోంది.
ప్రపంచం ధనస్వామ్య వ్యవస్థలోంచి సామ్యవాద వ్యవస్థలోకి రెండు మహామారణ హోమాల ఫలితంగా మారిపోతున్న ఈ సంధియుగంలో మనం జీవిస్తున్నాము. ఈ దృక్పథాన్ని అలవరచుకోకుండా ఇంకా పాత బాటలలోనే పాత పాటలతోనే కాలం గడుపుతూన్న రచయితలున్నారు. వారు ఆరాధిస్తున్న ఆదర్శాలు బహిరంగంగా పరువు పోగొట్టుకొంటున్నప్పటికీ ఇంకా వాటినే పట్టుకొని ప్రాకులాడుతున్నారు. అయినా వీరి విషయమై మనం ఎక్కవగా బెంగ పెట్టుకోనక్కరలేదు. ఒక కొత్త శక్తి అది. ఇది వరకు ఆ శక్తి కొక గొంతుక లేకపోయింది. ఇన్ని యుగాలుగా అణచిపెట్టబడిన ఈ శక్తి ఇప్పుడు విజృంభిస్తోంది. బలప్రయోగంవల్లగాని, మాయోపాయాలవల్లగాని ఎవ్వరూ దీనిని అరికట్టలేరు.
ఈ శక్తిని ఉద్దీపింపజేసే రచనలు సాగించడమే సాహిత్యపరుల కర్తవ్యం. అందువల్ల ప్రజల పురోగమనానికి రచయితలు తోడ్పడిన వారౌతారు. లేనప్పుడు రచయితలే వెనకబడి ప్రజలలో నుంచే సాహిత్యవీరులు బయల్దేరుతారు. రచనల ప్రాశస్త్యానికి కొలతబద్దలు మారిపోతున్నాయి. ఈనాడు నలుగురు మిత్రులు మధ్య కూర్చొని పద్యం చదవడానికి బదులు నాలుగు వేల జనాభా ముందు మైక్‌లోకి తన సందేశం విసురుతున్నాడు కవి. రచయితకూ, పాఠకునికీ మధ్య వచ్చిన పెద్ద మార్పు ఇది. ఈ మైక్రోఫోన్‌ ముందు ఒకటిన్నర చరణాలు చదివి వేల కొలది ప్రజలను ఉర్రూతలూగించవచ్చును. సంఘ చైతన్యానికి ప్రాతినిధ్యం వహించిన రచయితకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మన ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా యంత్రయుగము మనకు సంప్రాప్తించింది. మనలో మనం కొట్లాడుకొని ఈ యంత్రాలకు బానిసలమై వీటికే బలి అయిపోవడమా, లేక మన మందరం ఒకే కుటుంబం అనుకొని ఒక సమాధానానికి వచ్చి ఈ యంత్రమునే మన బానిసలను చేసుకొని జీవితాన్ని ఇంకా వైభవంగా సౌఖ్యవంతంగా అనుభవించడమా అనే ప్రశ్నకు రెండు జవాబులుంటాయని నేననుకోను.
(ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం మూడో మహాసభలో (31.12.1945 నుంచి 2.1.1946) 'సాహిత్యం ఎవరికి? ఎందుకు? అనే అంశంపై జరిగిన సాహిత్య చర్చలో అధ్యక్షోపన్యాసం. ముద్రణ : తెలుగుతల్లి, మాసపత్రిక, మార్చి 1946)
'సాహిత్యంలో విప్లవం, చరిత్ర, శిల్పం, స్వీయానుభవాలు'
పుస్తకం నుండి. సంకలనం: తెలకపల్లి రవి