అజ్ఞాతవాసి

బంగార్రాజు కంఠ 8500350464

ఒకప్పుడతడు

గుడ్డిలోకానికి సిగ్గు దాచినవాడు

గుడ్డపేలికకు కొత్తనడక నేర్పినవాడు

చిన్నప్పుడు చొక్కా నిక్కరూ

ఒకే గుడ్డతో కుట్టి

నన్ను దసరాబుల్లోణ్ణి చేసేవాడు

మిగిలిన ముక్కలన్నీ కలిపికుట్టి

రంగుల గాలిపటంలా నన్నెగరేసేవాడు

పండక్కి కొత్తబట్టలు కుట్టమనిస్తే

తీరికలేదని తీరిగ్గా చెబుతూ

పాతబట్టలతోనే పండగని దేకించేవాడు

నాన్నిచ్చిన కొత్తబట్టలు

బీదా గొప్పా జాతివైరుధ్యాలు మరిచి

సమతాచిహ్నాల్లా చెట్టాపట్టాలేసుకుని

మళ్ళీ పండగదాక

అతని పాతదండెమ్మీద కళ్ళు మిటకరించేవి

ఎన్ని టమారాలు చేసినా

అతడెప్పుడు మా ఊరికిమిత్రుడే

పాతమిషన్పాదం తొక్కుతూ

బతుకుగుర్రాన్ని

కొత్త పరుగు తీయించాలనుకునేవాడు

పరుగుల పాలు మాటెలావున్నా

గంపెడు సంసారాన్ని నిండుకుండలా

నింపుకునేవాడు

పంచభక్షాలేమో గానీ

పట్టెడన్నాన్ని దర్జాగా కుట్టుకునేవాడు

 

ప్రతిష్టకు ప్రతీకై మెడలోని టేపు

జీవిత ప్రమాణాల్ని

అంగుళాల లెక్కనే కొలిచిచూసేది

బాబిన్లో దారంలా మాటిమాటికి తెగిపోతూ

బండబారిన సూదిమొనలా

బతుకు వెక్కిరిస్తున్నప్పుడు

చేతిలోని కత్తెరతో

లోకాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించి

కొత్తమోడల్ని కుట్టి

కాలందేహానికి వెలాడదీసేవాడు

ఒకప్పుడు ఫ్యాషన్రంగానికి

రాజైన ఈ దర్జీమారాజు

ఇప్పుడు రెడీమేడ్రంగడిదెబ్బకి

అదే రాజ్యంలో మారువేషంతో

బతుకీడుస్తున్న అజ్ఞాతవాసి

సమస్త ప్రాణికోటి నిద్రిస్తున్నప్పుడు

గతచరిత్ర గుట్టలకింద

నలిగిన వైభవాన్ని వెలికితీసి

దారిద్య్రరేఖ రంగుమార్చేందుకు

చెవిలోపెన్సిల్తో అదే నల్లగీతగీస్తూ

నిరంతరం  ప్రయత్నిస్తున్న నిత్యాన్వేషి