మహాకవి శ్రీశ్రీ.. మేడే.. లాక్‌డౌన్‌

- తెలకపల్లి రవి

ఏప్రిల్‌ 30 మహాకవి శ్రీశ్రీ 110వ జయంతి. పదేళ్ల కిందట ఆయన శత జయంతి సందర్భంగా విస్త్రతంగా జరిగిన సభలూ, చర్చాగోష్టులు గుర్తుండే వుంటాయి. ప్రజాశక్తి అప్పట్లో ప్రచురించిన నా పుస్తకం 'శ్రీశ్రీ జయభేరి' ఏడాదిలో మూడు ముద్రణలు పొందడం సాహిత్య రంగంలో అరుదైన అనుభవమే. పదేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించిన పరిస్థితులలో చూస్తే శ్రీశ్రీ మరింత సందర్భోచితంగా గుర్తుకొస్తున్నారు. తమ కాలానికి ప్రతినిధులుగా వుంటూనే భవిష్యత్‌ సందర్శనం కూడా చేయించగలిగిన వారే మహాకవులని అందుకే చెబుతారు. 'లాక్‌డౌన్‌, ఇంటి నుంచే పని' వంటి మాటలు చెప్పినప్పుడు ఇళ్లూ వాకిలీ వదలి దేశాలు పట్టుకుపోయిన వలస కార్మికులు ఏలినవారికి గుర్తుకు రాలేదు. కనీసం పాతిక మంది ఆకలితో మరణించిన కథనాలు వచ్చాక గాని కళ్లు తెరవలేదు (ఇప్పటికీ దానిపై నిర్మాణాత్మకంగా విధాన నిర్ణయాలు, నిధుల కేటాయింపులూ జరిగింది లేదు). లక్షోప లక్షల మంది రోడ్లు పట్టుకు తిరుగుతున్న దశ్యాలు చూసినప్పుడు అందరికీ గుర్తుకు వచ్చిన చరణాల్లో శ్రీశ్రీ పున:ప్రత్యక్షం..'కూటి కోసం కూలి కోసం/పట్టణంలో బతుకుదామని /తల్లి మాటలు చెవిని పెట్టక/ బయిలుదేరిన బాటసారికి /ఎంత కష్టం ఎంత కష్టం..'.
మారిన ప్రపంచం, కొత్త నైపుణ్యాలు, కాలం చెల్లిన సిద్ధాంతాలు అంటూ ఊగిపోయిన వారందరికీ చెంపపెట్టుగా శ్రామిక శక్తిని గుర్తించక తప్పని పరిస్థితి వచ్చిన తర్వాత అందరూ పారిశుధ్య కార్మికుల గొప్పతనం గురించి, ఆగిపోయిన ఉత్పత్తి గురించి మూసుకుపోతున్న గనుల గురించి చెప్పుకుంటున్నప్పుడు మళ్లీ ఉత్పత్తి ప్రారంభం చేస్తే తప్ప ప్రపంచం నడవదని గుర్తించినప్పుడు 'గనిలో వనిలో కార్ఖానాలో పరిశ్రమిస్తూ పరిక్రమిస్తూ..శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని' మరోసారి అర్థశాస్త్రవేత్తలు కూడా ఒప్పుకోక తప్పడం లేదు. వారిని పాక్షికంగానైనా పని లోకి దించకపోతే మానవాళి మనుగడే లేదని అంగీకరించడం అనివార్యమైంది. మూత పడిన పారిశ్రామిక వాణిజ్య రంగాలలో పనులూ జీతాలు లేని 30 కోట్ల మంది శ్రమజీవుల బాధలు గమనించినప్పుడు, 'విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోరు' అనాల్సి వచ్చింది. దిగుబడి బాగా వచ్చిందని సంతోషించిన రైతన్న కొనే నాథుడు లేక అరటి తోటలు ధ్వంసం చేసినప్పుడు, పళ్లు ట్రాక్టర్ల కింద వేసినప్పుడు..'పొలాల నన్నీ హలాల దున్నీ బలం ధరిత్రికి బలికావించే' రైతు బాధ కళ్లకు కట్టింది. అత్యంత సంపన్నమైన దేశాలలో కరోనా విషాద దాడి, పాలకుల నిర్లక్ష్యం చూస్తే 'ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?' అనే ప్రశ్న మళ్లీ కళ్ల ముందు నిలిచింది. ఇంతటి దుస్థితి లోనూ శ్రమ జీవులు ప్రజా సంఘాలు నూతన పద్ధతులలో నిరసన తెల్పుతున్న ఉత్తేజకర అనుభవాలు విన్నప్పుడు 'ఖండాంతర నానాజాతులు చారిత్రిక యథార్థతత్వం వినిపిస్తారొక గొంతుకతో' అనే నమ్మకం కలిగింది. ఈ పరిస్థితులలో కూడా కరోనాను గాక కుల మతాల భాషలో మాట్లాడేవారిని చూసినప్పుడు 'మాకు గోడలు లేవు/గోడలు పగలగొట్టడమే మా పని' అనిపించింది.
కేవలం పోరాటాలు ఉద్యమాలే కాదు, సవాళ్లు సంక్షోభాలు ఎన్ని వున్నా మానవాళి పురోగమనం ఆగేది కాదని శ్రీశ్రీ కి తెలుసు. 'పదండి ముందుకు పదండి తోసుకు..దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి పోదాం..' అనే పిలుపు నిరంతరం వినిపిస్తుంటుంది. శ్రమ జీవులనే కాదు, ఇప్పుడు అమితంగా చెప్పుకుంటున్న వైద్యులను కూడా శ్రీశ్రీ తన 'కవితా! ఓ కవితా!'లో ప్రస్తుతిస్తాడు. 'వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్ర జాలంలో చావుబతుకుల సంధ్యాసమయంలో..' అంటూ వారి సేవలను గొప్పగా చెప్పడం ఇప్పుడు గుర్తు రాకమానదు.
ఇప్పటి వరకూ మాత్రం కరోనాను అరికట్టడంలో కార్పొరేట్‌ వైద్య వ్యవస్థ అక్కరకు రాదని తేలిపోయింది. ప్రజారోగ్య వ్యవస్థను కుప్పకూల్చిన పాపానికి పరిహారం రెండు లక్షల మరణాలను దాటింది. అయినా పోరాటం సాగుతూనే వుంటుంది. మనిషి ముందుకు పోవలసిందే. 'వెనక్కు తిరిగి చూసుకునే అలవాటే లేదు నాకు/అర నిముషం గడిచేసరి/ కదే నాకు గత శతాబ్ది/ ఎందుచేతంటే భవిష్యత్తు మీదే ఎప్పుడూ వుంటుంది నా నిఘా/ఇవాళ కంటే రేపు/ఎంతో బాగుంటుందంటాను నేను/'. విప్లవ చైతన్యం ప్రసరించడమే కాదు, విజ్ఞాన శాస్త్ర విజయం తథ్యమని చెప్పిన మాటలు ఈ కరోనా వైరస్‌ను ఎదుర్కొనగలమనే భరోసా ఇస్తాయి. 'చికిత్స లేదనుకున్న వ్యాధులు /చిత్తగిస్తున్నాయి పరారీ/పదార్థ విజ్ఞాన శాస్త్రం అమోఘంగా వికసిస్తోంది/ప్రాణం స్వభావం ఏమిటో/ పరిశోధనలు సాగుతున్నాయి'.
నిన్నటి పోరాటం నేడు అందుకోక తప్పదు!
శ్రీశ్రీ వంటి ప్రజాకవులు కవిత్వంలో చెప్పిన వాటన్నిటి ఆచరణ రూపం మే దినోత్సవ స్ఫూర్తి. రోజులో పదిహేను ఇరవై గంటల పాటు గొడ్డుచాకిరీ చేయించుకుంటే పుట్టిన పిల్లలను కూడా చూసుకోలేనంతగా పనిలో మునిగి తేలేవారట ఆనాటి కార్మికులు. మహా రచయిత మాగ్జిం గోర్కీ మాటల్లో చెప్పాలంటే రోజంతా పని చేసి ఫ్యాక్టరీ వదలిపెట్టిన వ్యర్థాల లాగా బయిట పడేవారట కార్మికులు. వారి పోరాటాలతోనే పని పరిస్థితులు మార్చుకున్నారు. హక్కులు సాధించుకున్నారు. సామ్యవాద సమాజాలు స్థాపించుకున్నారు. సోవియట్‌ విచ్ఛిన్నం తర్వాత కూడా, చారిత్రికంగా మార్పులు ఎన్ని వచ్చినా ఇప్పటికీ చైనా, వియత్నాం, క్యూబా వంటివి దానికి ప్రతీకలుగా వున్నాయి. కరోనాను అరికట్టిన చైనాపై దుష్ప్రచారాలు సాగుతున్నా వైరస్‌కు వ్యాక్సిన్‌లో 'సినోఫామ్‌ బయోటెక్‌' అనేది మొదటి దశను దాటింది. దాన్ని తట్టుకోవడం కోసమే అమెరికా హడావుడిగా తన కంపెనీ ఔషధాన్ని వినియోగించడానికి అనుమతినిస్తున్నది. ఆ సంగతి అలా వుంచితే మేడే పోరాటాల వారసత్వంతో సాధించుకున్న ఎనిమిది గంటల పనికి ఇప్పుడు ఎసరు పెట్టడానికి కరోనా సాకుగా మారింది. భారతీయ పరిశ్రమలలో సంస్థలలో 12 గంటలు పని చేయించుకోవడానికి వీలుగా ఫ్యాక్టరీ చట్టాలనే మార్చేస్తున్న విపరీతం చూస్తున్నాం. 'నిన్న విరమించిన పోరాటం /నేడు అందుకోక తప్పదు' అన్నట్టు పాత హక్కులు పరిరక్షించుకోవడానికి కూడా ఇప్పుడు ఉద్యమించవలసి వస్తున్నది.
లాక్‌డౌన్‌ లేని పీడన
చివరగా వర్తమానం లోకి. లాక్‌డౌన్‌ పొడిగింపు విషయానికి వస్తే మోడీ ప్రభుత్వ అసమగ్ర పోకడలకూ అరకొర విధానాలకూ అది అద్దం పడుతుంది. పైన ప్రస్తావించుకున్న అంశాలతో సహా అసంఖ్యాకమైన సవాళ్లు దేశం ముందు పరుచుకుని వున్నాయి. రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేయకపోగా రావలసిన నిధులు కూడా ఇవ్వకపోవడంతో ప్రజల అవసరాలను ఆరోగ్య సంరక్షణ బాధ్యతలను నెరవేర్చడం శక్తికి మించిన వ్యవహారంగా మారింది. కేరళ వంటి రాష్ట్రాలు ముందు నుంచి స్పష్టమైన విధానంతో సత్ఫలితాలు సాధించినప్పటికీ ఆర్థిక లోటు వెంటాడుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో ఆర్థిక కొరతతో పాటు విధాన పరమైన లొసుగులు కూడా సమస్యను సంక్లిష్టం చేశాయి. కేంద్రం పొడగింపులు, సడలింపులు అంటూ నిర్దేశకాలు ఇవ్వడమే గాని రాష్ట్రాలలో అమలుకు సంబంధించి స్పష్టత ఇవ్వదు. ఆర్థిక బాధ్యత అసలే తీసుకోదు. కరోనా చావులు, ఆకలి చావులు అంటూ పోటీ పెట్టి కంపెనీలు మూయడం తెరవడమే సమస్య అన్నట్టు మాట్లాడటం పాక్షికత్వం అవుతుంది. పైగా ఉత్పత్తి, ఉపాధి అంటూ యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు కార్మికులను ఉద్యోగులను వదిలేయడం, వారి ఒత్తిడిపై పని గంటలు పెంచి భద్రతా బాధ్యతలు తగ్గించడం పరిస్థితిని ఇంకా దుర్భరం చేస్తుంది. పైగా పని ప్రదేశం లోనే అందుబాటులో వుండాలన్నట్టు కూడా చెబుతున్నారు. ఇదంతా ఆచరణలో ఎలాంటి సమస్యలకు దారితీసేది చెప్పడం కష్టం. ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, పనులు పోతున్న పరిస్థితి పనివారిని గత్యంతరం లేని స్థితికి నెట్టే ప్రమాదం చాలా ఎక్కువ. పైగా మొత్తం పాత వారందరినీ తీసుకోవడం కూడా జరగదు. ఈ పేదలు అసంఘటిత కార్మికుల ఆకలి తీర్చడానికి రూ.60 వేల కోట్లు కావాలని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ వంటి వారంటున్నారు. కాని కేంద్రం అదే మొత్తం నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ వంటి మోసకారుల ఎగవేత బకాయి మాఫీకి మళ్లిస్తున్నది! ఇక్కడ మళ్లీ శ్రీశ్రీ చరణాలు 'పేదల రక్తం దాల్చిన రూపం/బలిసిన జలగలు దాచిన పాపం/ దేవతలను ఆడించే డబ్బు / మానవులను పీడించే డబ్బు /తెలుపో నలుపో జానేదేవ్‌/ ఆ తేడాలిక్కడ లేనేలేవ్‌'. ఏతావాతా కరోనా నివారణ కోసం చేతులు కడుక్కోవడం, దూరం పాటించడం, ఇంట్లోనే వుండటం వంటివి మాత్రమే సరిపోవు. మన చేతులు కడుక్కోవడంతో పాటు పాలక వర్గాల మాయదారి చేతలను కూడా ప్రక్షాళన చేయకపోతే ప్రజలపై దోపిడీ మరింత తీవ్రమవుతుంది. అలా జరగకూడదంటే మేడే అమరవీరులు చూపించినట్టు, మహాకవి చెప్పినట్టు 'పదండి ముందుకు పదండి తోసుకు' అనవలిసిందే!