బాబ్రీ విధ్వంసంపై తీర్పు-వివేకానికే సవాలు

వర్తమానం 
- తెలకపల్లి రవి


28 సంవత్సరాలు, అత్యున్నత పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో 600 పైగా సాక్ష్యాధారాలు, 351 మంది సాక్షులు, 500 పేజీ లిఖిత వాదనలు, 2300 పేజీ తీర్పు, ఏడాది కిందటే రిటైర్‌ కావలసిన న్యాయమూర్తికి పొడగింపు, అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు, జోక్యాలు, ఉన్నత న్యాయస్థానం, ఒకటికి రెండు కోర్టులలో విచారణ, మధ్యలో ఒక కమిషన్‌, దేశమంతా చూసిన దశ్యాలు, వందలు వేల్లో మీడియా నివేదికలు ఎన్ని వుంటేనేం? లక్నోలో విచారణ ముగించిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సురేంద్ర కుమార్‌ యాదవ్‌కు ఈ సాక్ష్యాలేవీ సంతప్తి కలిగించ లేకపోయాయి.
1992 డిసెంబరు ఆరవ తేదీన బాబ్రీ మసీదు విధ్వంసం వెనక కుట్ర కోణం వుందనడానికి సరైన సాక్ష్యాలు లేవంటూ అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి, కళ్యాణ్‌ సింగ్‌తో సహా 32 మందిని గుండు గుత్తగా వదిలి పెట్టేశారు. ఆ మూడు గుమ్మటాల కింద రాముల వారి విగ్రహాలు వున్నాయి గనక భక్తులైన వారెలా కూల్చివేస్తారని ఆయన ఆధ్యాత్మిక సందేహాలు తీసుకొచ్చారు. ఈ కారణంగానే విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడైన అశోక్‌ సింఘాల్‌ కట్టడాన్ని కాపాడేందుకు ప్రయత్నించారని కూడా కితాబునిచ్చారు. దేశ చరిత్రలో ఎరుగని మత తత్వ రాజకీయ వ్యాప్తికి, ఘర్షణకు, వందలాది మంది మరణించడానికి కారణమై, దశాబ్దాల పాటు కొనసాగిన ఈ విధ్వంస కాండపై న్యాయమూర్తి అయిదు నిముషాల్లో కీలక భాగాలు చదివేశారు.
ఆయన తీర్పు చదువుతుండగానే అక్కడ జై శ్రీరాం నినాదాలు మార్మొగిపోయాయట. గత నవంబరులో సుప్రీం కోర్టు అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన ఏడాదిలోపే నాటి విధ్వంసం కేసు కూడా కొట్టి వేయబడింది. అదే తీర్పులో సుప్రీం కోర్టు రామమందిర నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేయమని చెప్పడం ఆ ట్రస్టు ఆధ్వర్యంలో మందిర నిర్మాణం భూమిపూజలో ప్రధాని మోడీ పాల్గొనడం కూడా జరిగిపోయాయి. అయితే అదే తీర్పులో సుప్రీం కోర్టు బాబ్రీ విధ్వంసం అత్యంత దుర్మార్గమైన చర్య అని చట్ట ఉల్లంఘన అని విమర్శించింది. విహెచ్‌పిని ముందుంచి సాధు సంతు పిలుపు పై కరసేన అంటూ బిజెపి అగ్రనేతలు అక్కడకు తరలిపోవడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని దేశమంతా భావించింది.
అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఏ చర్యయినా తీసుకోవడానికి ప్రతిపక్షాలు కూడా ఎన్‌ఐసి సమావేశంలో అధికారమిచ్చాయి. అయోధ్య ఫైజాబాద్‌కు ప్రత్యేక దళాలు పెద్ద ఎత్తున తరలించబడ్డాయి. అయినా సరే జరగాల్సింది జరిగిపోయింది. దేశం అట్టుడికిపొవడమే గాక అంతర్జాతీయంగానూ విమర్శలు వచ్చాయి. అద్వానీ వంచించారని పివి అన్నారు గాని ఆయన కావాలనే
ఉపేక్షించారని అప్పటి హౌం మంత్రి ఎస్‌బి చవాన్‌ తమ జ్ఞాపకాలలో రాశారు. కూల్చివేత తర్వాత ఆలస్యంగా కళ్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి ఎన్నికకు వెళితే ప్రజలు ఓడించారు. ఈ విధ్వంసానికి సంబంధించి గుర్తు తెలియని లక్షలాది కరసేవకులపై ఒక కేసు, బిజెపి, ఆరెస్సెస్‌, విహెచ్‌పి హేమాహేమీలపై మరో కేసు సిబిఐ నమోదు చేసింది. తర్వాత వాటిని ఒకటిగా జత చేశారు.
మొత్తం 48 మందిపై అభియోగాలు చేయగా 16 మంది ఈ మధ్యలోనే మరణించారు. తమకు ఇచ్చిన మాట తప్పి కరసేవ శాంతి యుతంగా జరుగుతుందని చేసిన వాగ్దానం భంగపరచిందని యుపి మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌ సింగ్‌కు కోర్టు హాలులోనే అంతకు ముందే ఒకరోజు శిక్ష విధించింది. కాని తర్వాత క్రమేణా బిజెపి పెరుగుదలకు అది కారణమై వాజ్‌పేయి మూడోప్రభుత్వం పాలన కొనసాగించింది. అద్వానీ హౌం మంత్రిగా అదే సిబిఐకి మార్గదర్శి అవడం ఒక చారిత్రిక విచిత్రం. ఆ దశలో ఆయనను మినహాయిస్తూ సిబిఐ ఒక అడుగు వేస్తే మరో మంత్రిగా వున్న మురళీ మనోహర్‌ జోషి రాజీనామా చేస్తానంటూ కలకలం రేపారు.
మరో దశలో కూల్చివేసిన కరసేవలను ఏమీ చేయ లేనప్పుడు ఈ ప్రముఖులకే శిక్ష వేయడం సరికాదని కోర్టు కొట్టి వేస్తే హైకోర్టు కూడా దాన్ని బలపరిస్తే సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని 2017లో వాటిని మళ్లీ పునరుద్ధరించేలా చేసింది. అయోధ్య తీర్పులో కూడా కూల్చివేతలను తీవ్ర పరిభాషలో ఖండించింది. అయితే ఈ తీర్పుతో అదంతా వథా అయిపోయినట్టయింది. కుట్ర జరిగిందనడానికి సిబిఐ బలమైన ఆధారాలు సమర్పించ లేక పోయిందని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి అది దాఖలు చేసిన వీడియోలు స్పష్టంగా లేవని కొట్టి పారేశారు. కూల్చివేతకు తాము గర్వ పడుతున్నామని ఈ నాయకులంతా ప్రకటించిన వాస్తవం కూడా కోర్టు పట్టించు కోలేదు, మీడియా కథనాలపై ఆధారపడలేమన్నారు. మొత్తంపైన గజం మిథ్య పలాయనం మిథ్య అని తేల్చేశారు. దీనిపై తదుపరి అప్పీలుకు వెళ్లే విషయం చెప్పలేనని సిబిఐ న్యాయవాది లిత్‌ కుమార్‌ చెప్పడం యాదచ్చికం కాదు. బహుశా అది సందేహాస్పదమే.
సహజంగానే ఈ తీర్పులను అద్వానీ స్వాగతించారు, జై శ్రీరాం అంటూ తన రామమందిర ఉద్యమం పట్ల తన విశ్వాసాన్ని ఇది బలోపేతం చేసిందన్నారు. ఈ తీర్పు రాగానే న్యాయశాఖామంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆయన నివాసానికి వెళ్లి మరీ అభినందించి వచ్చారు. మోడీ హయాంలో గ్రహణం పట్టిన అద్వానీకి ఇలా మళ్లీ ప్రచార యోగం పట్టిందన్న మాట, ఆరెస్సెస్‌ విహెచ్‌పి వంటి హిందూత్వ సంస్థలన్నీ ఘనంగా స్వాగతించాయి. ఇది సుప్రీం కోర్టు వైఖరికి భిన్నంగా వుంది గనక సిబిఐ ప్రభుత్వం పై కోర్టులో పిటిషన్‌ వేయాని కాంగ్రెస్‌ కోరింది. న్యాయాన్ని వమ్ము చేయడమే గాక భారత దేశ లౌకిక ప్రతిష్టకు భంగకరంగా వుందని సిపిఎం విమర్శించింది.
ముస్లిం సంస్థ నాయకుల్లో ఒకరిద్దరు హర్షం వెలిబుచ్చినా పై కోర్టులో అప్పీలు చేస్తామని ఎక్కువ మంది ప్రకటించారు. ఈ లోగా శాంతి భద్రత పరిరక్షణ కోసం కట్టుదిట్టం చేశారు. గత అనుభవాల రీత్యా రాజకీయపక్షాలు ప్రభుత్వాలు సంయమనం పాటించడం కీలకం. మరీ ముఖ్యంగా మత తత్వ సంస్థలు, ప్రయత్నాలు, కదలికల పట్ట అప్రమత్తంగా వుండాలి. కేసు ఓడిపోయిన సిబిఐ మరింత బలమైన వాదనతో ప్రత్యేక న్యాయస్థానం తీర్పులను సవాలు చేసి న్యాయం కోసం పోరాటం కొనసాగించాలి. ఉన్నత న్యాయవ్యవస్థ కూడా ఈ పరిణామాల మీద దష్టి సారించాలి.