కవితావేశానికి ప్రతీక 'కాలం ఒడిలో ...'

వికెఎం లక్ష్మణరావు
94417 49192

కాలం ప్రవాహానికి సూచిక. ఒడి ఓ దశకి సంకేతం. ఈ రెండింటి కలియకేరెడ్డి శంకర్రావు కవిత్వం. నడుస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు ఎదురుపడతాయి. సరికొత్త సమస్యలను సృష్టిస్తాయి. అనుక్షణం సవాళ్లు విసురుతాయి. మందుకు మున్ముందుకు సాగే ప్రయాణాన్ని జటిలం చేస్తాయి. ఆ క్లిష్ట దశలను దాటుకుని గమ్యానికి చేరువవుతున్న కొద్దీ మనసు తేలిక పడుతుంది. ఊపిరి పీల్చుకునే స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిని కల్పించుకునేందుకు తగిన ప్రయత్నమే కీలకం. అందుకు గమనమే ఆధారం, ముఖ్యం. అలా వచ్చిన అనుభవ సారమే... అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రాతిపదిక. ఏ ప్రాతిపదికన వస్తువు స్వీకరణ ఉంటుందో, ఆ స్వీకరణకి తగ్గట్లుగానే నిర్మాణమూ ఉంటుంది. నడక సాగుతుంది. పడతూ లేవడాలూ ఉంటాయి. తప్పులూ ఒప్పులూ చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలోనే మన దృక్కోణం బయటకి వస్తుంది. మనం ఏ కళ్లద్దాల్లోంచి చూస్తున్నామో కూడా తెలుస్తుంది. ఆ చూపులోంచే విషయ పరిశీలన జరుగుతుంది. అందులోంచే మన ఆలోచన ఏమిటో ఆవిష్క ృతమవుతుంది. అలా రూపుదాల్చిందే ఈ కవితా సంకలనం. వివిధ సందర్భాల్లో, వివిధ సంఘటనల్లో తనని ఉద్వేగపరిచినవి, తాను ఉద్వేగపడినవే ఈ కవితలు. 88 కవితల కూర్పు ఇది. అగ్రస్థానం రైతుదే. ఆ తరువాత భాగం కరోనా విలయానికి. మిగిలినది మిత్రుల కోసం, కుటుంబీకుల కోసం, ఉద్యమ సహచరుల కోసం రచించినవి.
రైతుకి అత్యధిక సమయం, అత్యధిక స్థలం కేటాయించడం వెనుక కారణం కవిది గ్రామీణ నేపథ్యం కావడం. నోస్టాలజీగా అనిపించినా, గ్రామంతో, నేలతో, అందునా వ్యవసాయంతో ముడిపడిన జీవితం మరిచిపోలేనిది. కులాలకూ, తరతమ భేదాలకూ ప్రాంగణమే అయినా, 'ఆత్మగౌరవం' కాదనలేని పరిస్థితి. ఆ ఆత్మగౌరవం 'ఆస్తి' భావనతో ముడిపడి ఉండవచ్చు. ఎంతగా అంటే ఎంతటి కష్టకాలం దాపురించినా కూడా తననీ, తన ఆస్తినీ వదులుకోలేని తనం ఎక్కడో సలుపుతూనే ఉంటుంది. అంతగా గ్రామీణ జీవనం కవి మీద ప్రభావం చూపింది.
గ్రామం కూడా ఒకనాటి 'వలస' అనీ, 'వలస' ఓ మెరుగు అనీ అంగీకరించేందుకు, ఆమోదించేందుకు ఎందుకనో తెలుగు కవిత్వం ఇష్టపడడం లేదు. ఆ ప్రయాణంలోని కొత్త కష్టాలను (మెజార్టీ) ఎందుకనో చూడ నిరాకరిస్తోంది. ఆ ఆలోచన ధారా ప్రవాహం ఎక్కడ మొదలయ్యిందో, ఎవరు మొదలుపెట్టారో తెలియదు గాని, ఆ ప్రభావం నుంచి నేటికీ తెలుగు కవులూ, కవిత్వమూ బయటపడడం లేదు. కొత్త దృష్టి కోణాన్ని అందుకోవడం లేదు. అందువలనే కొన్ని వేల పేజీలు గ్రామం వలస మీద దు:ఖించాయి. ఇప్పటికీ దు:ఖిస్తూనే ఉన్నాయి. ఆ పేజీలకి చేర్పే 'ఊరు వలస వెళ్లింది' కవిత. ఇక గ్రామంలో మిగిలి ఉన్న రైతుల్లో సేద్యం చేసిన వారు పడుతున్న అవస్థలు, అగచాట్లు, అరుగాలం కష్టానికి అప్పే తినాల్సిన దుర్భర, దైనీయ పరిస్థితులే వర్తమానంలో కొనసాగుతున్న ఆందోళనల వెనుక గల ముఖ్య కారణం. వీటికి తోడు ఫ్రీ మార్కెట్‌ విధానానికి కేంద్రం తలుపు తెరవడం పంజాబీ రైతుల పోరుకు ప్రేరణ. ఈ రెండింటి ఫలితమే మహారాష్ట్రలో రైతుల పాదయాత్ర, హస్తినలో నడిరోడ్డు మీద పంజాబీ రైతుల నిరసన. ఈ సందర్భాలు కవిని నిలవనీయలేదు. ఆందోళనలు, నిరసనలు, వ్యతిరేకతలు అత్యంత సహజంగానే ఈ లెఫ్టిస్టు కవిని ఆకర్షిస్తాయి. ఆకర్షించడమే కాదు; 'తన వంతు' అన్న ఆలోచనకి గురిచేశాయి. ఆ ఆలోచన భిన్న రూపాల్లో వ్యక్తపరిచేటట్లు ప్రేరేపించాయి. కవి తన కలంతోనే కాదు, కార్యాచరణ వాదిగా కూడా వారికి మద్దతుగా నిలిచేటట్లు చేశాయి. 'రైతు'నే ఎర్రకోటకి 'రాజు' అని అనేటట్లు అందరి తోనూ ఒప్పించే ప్రయత్నం చేయించాయి. నాగలి పట్టిన వాడు తలుచుకుంటే ఆ పీఠం తన పరం చేసుకోవడం ఏమంత కష్టతరం కాదన్న వాణిని వినిపించేటట్లు పురిగొల్పాయి. ఆ నమ్మకానికీ, ఆ విశ్వాసానికీ, ఆ లక్ష్యానికీ ఒకనాడు తాను గడిపిన వ్యవసాయ జీవితమే ఆలంబన అయ్యింది. 'కలుపు'ను తీయడం రైతుకి ఎవరూ నేర్పాల్సిన అవసరం లేదన్న వ్యక్తీకరణకి అక్షర రూపమయ్యింది. వెన్నుదన్నుగా నిలిచింది. కారణాలు ఏమైనా గాని పంజాబీ రైతు ప్రస్తుతానికి విజయం సాధించాడు. ఆ విజయోత్సాహాన్ని మరింత మందిలో నింపేందుకు తన కవిత్వాన్ని ఓ వాహికగా చేసేందుకు కవిని ఉత్సాహపరిచింది.
ఎవరైనా కష్టకాలంలో ఉన్నప్పుడు స్పందించడం మనుషులుగా అందరికీ అనుభవం. కొన్ని సార్లు అసంకల్పితం గానే కనులు చెమ్మగిల్లడమూ అత్యంత సహజం. నిజానికి, అటువంటి నిస్సహాయ స్థితిలో, అటువంటి కష్ట కాలంలో బాధిత కుటుంబానికీ, స్నేహితుడికీ, సహచరులకీ, అనుయాయుడికీ మనోధైర్యాన్ని ఇవ్వడం తక్షణ అవసరం. ఆ అవసరాన్ని కవి గుర్తించారు. ఈ మధ్య కాలంలో అందరినీ ఏకాకులను చేసిన విలయం... కరోనా. ఆ కరోనా కష్టాలను దృశ్యీకరిస్తూనే, ఆ కష్టాల వెనుక కుట్రలన్నాయన్నారు. ఆ కుట్రలను భగం చేసేందుకు పోరుబాటే శరణ్యమని కవితాగ్నిని రగిలించారు. అందుకు అవపరమైన ఆలోచనా బీజాలను నాటేందుకు ప్రయత్నించారు. చివరికి అజేయుడు మానవుడేనన్న భరోసా ఇచ్చేందుకు బాధ్యత వహించారు.
వ్యక్తిగతంగా చూస్తే ఈ కరోనా వల్ల కవి తన సహచరులనూ, కుటుంబీకులనూ కోల్పోయిన విషాద సందర్భం. అంతటి ఉద్విగ స్థితిలో కూడా తనని తాను నిలబెట్టుకోవడమే కాకుండా, తన వాళ్లనీ నిలబెట్టేందుకు ఓ కార్యకర్తగా తాను పొందిన చైతన్యాన్ని దన్నుగా నిలబెట్టారు. వారికి కొండంత అండగా నిలిచారు. ఇక, మహిళల కోసమూ, మీడియా మిత్రులు కోసమూ, తెలుగు భాష కోసమూ, గిడుగు కోసమూ, చేగువేరా కోసమూ, సాహిత్య మిత్రులు రామతీర్థ, జగద్ధాత్రి కోసమూ ఆయన కనబరిచిన స్పందనలు ఎంతో ఆలోచనాత్మకంగానూ, ఆర్తితోనూ నిండిఉన్నాయి. వీటన్నింటిలోనూ సాధారణ కవిగానే ఈ కవి మనకి కనిపిస్తారు. వాటిని చదివినప్పుడు అనిపిస్తారు.
అక్కడికే కవి పరిమితం కాలేదు. ఆ పుస్తకాన్నీ పరిమితం చేయలేదు. ప్రభువుల విధానాల మీదకి దృష్టిని కేంద్రీకరించారు. ప్రశ్నించే గొంతులను బంధీలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ ఆగ్రహం చెందారు. రైళ్లను, ఉక్కు కర్మాగారాన్నీ కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతున్నారంటూ కన్నెర్ర జేశారు. ఇక్కడే కవి తనలో ఉన్న రాజకీయ దృక్పథాన్ని ప్రదర్శించారు. ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాల మీద తనదైన వాణిని వినిపించారు. ఈ కవితలన్నింటినీ మదిస్తే కవి శంకర్రావుని వ్యక్తిగతంగా ఎరగని వారికి సైతం ఆయనేమిటో ప్రస్ఫుటమవుతుంది. పట్టి చూపుతుంది.
ముఖచిత్రం, పుస్తక రూపకల్పన ఎంతో బాగా వచ్చింది. అందుకు తగ్గట్లుగా కవితా కూర్పు ఉంటే బాగుండేది అనిపించింది. కొన్ని కవితలు రీ డిజైన్‌ చేయాలనిపించింది. 'శ్రమ సౌందర్యం', 'మట్టి' వంటి కొన్ని పదాలు విరివిగా వాడడం కవితావేశానికి స్పీడ్‌ బ్రేకర్‌ అయ్యిందనిపించింది. కొన్ని పదాల కూర్పు అసందర్భోచితంగా తోచింది. ఇవన్నీ కూడా చిన్నచిన్న లోపాలే. ఆ లోపాలను తగ్గించుకోవడం కాలక్రమంలోనే ఎవరికైనా సాధ్యపడుతుంది. గతంతో పోల్చినప్పుడు కవి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సందర్భంలో స్వతహాగా రాజకీయ కార్యకర్త అయిన కవి ఈ పుస్తకంలో తన కార్య స్థలానికి వెలుపులే ఉండడం వెలితిగా అనిపించింది. 20 ఏళ్లకి పైగానే కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న ఆయన ఆ స్థానం నుంచి తాను చూసిన కొత్త జీవితాలనూ, వాటి వెనుక గల కార్యకారణ సంబంధాల గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతటి అనుభవశాలి, ఆచరణ వాది అయిన కవి వ్యవసాయంలో 'కూలీ'ని, వలస వచ్చి వివిధ పనుల్లో జమ అయిన 'శ్రామికు'ల జీవితాలను తడిమేందుకు వీలు కల్పించుకోకపోవడం ఎందుకనో సముచితం కాదనిపిం చింది. అందరూ నడిచే దారిలోనే సంకలనం రూపకల్సన చేసే స్థితి నుంచి నిర్ధిష్ట అంశాల మీద భిన్న కోణాలను దర్శించే స్థితికి, దర్శింపచేసే స్థితికి ఈ కవి చేరాల్సి ఉందనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న గీతల మధ్యన కాకుండా, ఆ గీతలను అధిగమించేందుకు చేయాల్సిన సాధనా, ప్రయత్నమూ ఇంకా మిగిలే ఉందనేది ఆయన సైతం కాదనరనిపిస్తుంది.