మాతృభాషా మాధ్యమాన్ని కొనసాగించాలి

- విఠపు బాలసుబ్రహ్మణ్యం

రాష్ట్రప్రభుత్వం ఉన్నట్టుండి మొదట 1-6 తరగతుల్లో, ఆ తర్వాత క్రమంగా అన్ని తరగతుల్లో మాతృభాషా మాధ్యమాలకు చెల్లుచీటీ ఇచ్చింది. ఇది వాస్తవానికి నిర్బంధ ఆంగ్ల మాధ్యమం. ప్రపంచంలో ఎక్కడా లేని విధానం.

ఉపాధి కోసం, వివక్ష తొలగింపు కోసం, కార్పొరేట్ల కట్టడి కోసం, బడుగుల భవిష్యత్తు కోసం ఈ ఆంగ్ల మాధ్యమాన్ని తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీని పర్యవసానాలను ప్రశ్నిస్తున్న వారిపై బలహీనవర్గాల వ్యతిరేకులుగా ముద్రవేసి దాడి చేస్తోంది.

వాస్తవానికి, ఆంగ్లమాధ్యమాన్ని మొత్తంగా వ్యతిరేకించడం లేదు. సమస్యంతా దీన్ని ఏ స్థాయిలో, ఏ మెలకువలతో ప్రవేశపెట్టాలన్నదే. ప్రాథమిక విద్యలో వీలుంటే శిశువిద్యలోనే ఆంగ్లాన్ని భాషగానే గాక మీడియంగా కూడా పెడితే తప్ప ఆంగ్లం ఒంటపట్టదని ప్రభుత్వ వాదన. అలాగే తెలుగు నీడ పడితే ఆంగ్లం పట్టుబడదనే వాదన కూడా ఇందులో అంతర్భాగం. కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఇంతకాలం ప్రజల్ని నమ్మించింది ఈ వాదనలతోనే.అమ్మభాషలోనే చదువులు ప్రారంభంగావాలని, అప్పుడే పిల్లలకు మనోవికాసంతో పాటు విషయ పరిజ్ఞానం సహజంగా అబ్బుతుందని విద్యాహక్కు చట్టం నుంచి జాతీయ విద్యావిధానం దాకా, గాంధీజీ నుంచి అంబేద్కర్‌ దాకా, మన రాజ్యాంగం నుండి యునెస్కో దాకా చెపుతున్న అభ్యసన సిద్ధాంతం. పసిపిల్లలు పరాయి భాషలో పాఠాలు ప్రారంభిస్తే పరాయీకరణ చెంది భయపడి, బడి మానెయ్యడమో, కంఠోపాఠం చదువులో చిక్కుకుని వెనకబడిపోవడమో జరుగుతుందనేది అంతా అంగీకరిస్తున్న సత్యం. పేద గ్రామీణ పిల్లల విషయంలో ఈ ప్రమాదం మరీ ఎక్కువ. విద్యారంగంలో ముందున్న దేశాలన్నీ, మన రాష్ట్రాలన్నీ మాతృభాషలోనే బోధిస్తున్నాయి. ఆంగ్లాన్ని ఒక భాషగా నేర్పి అది పట్టుబడ్డాక సెకండరీ స్థాయిలో మాధ్యమాన్ని మార్చడం శాస్త్రీయమని చెప్పడానికి పెద్ద పాండిత్యమేమీ అక్కర్లేదు. అలాగే ఒక భాషగా శక్తివంతంగా ఆంగ్లాన్ని నేర్పడం దీనికి సరైన పరిష్కారం.

ఈ అకడమిక్‌ అంశాన్ని అభ్యసన సూత్రాన్ని వదిలేసి చర్చను పక్కదారి పట్టించడం, దీనికి మతం రంగూ, రాజకీయ రంగూ పులమడం అన్యాయం. విద్యారంగంలో వివక్షను తెచ్చింది, అసమానతల్ని పెంచిందీ వ్రైవేటు కార్పొరేట్‌ విద్యారంగం. అందరికీ సమానమైన విద్యావకాశాలను అందించే కామన్‌ స్కూల్‌ విధానం లేకపోవడం, అత్యంత బలహీనమైన ప్రభుత్వ పాఠశాలల్లో మన బడుగుల పిల్లలు చదువుకోవాల్సి రావడం దీనికి మూలకారణం. పాతికవేలకు పై ప్రాథమిక పాఠశాలలు ఒకరిద్దరు టీచర్లతో, ఒకటి రెండు గదులతో కునారిల్లుతుంటే పేదలకు గొప్ప విద్య ఎలా వస్తుంది? కేవలం మాధ్యమం మార్చినంత మాత్రాన ఏం ఒరుగుతుంది? ఎందుకు మనం అందరు పిల్లలు ఒకేచోట చదువుకొనే కామన్‌స్కూలును నిర్మించుకోలేకపొయ్యాం? ఇదే అసలు సమస్య.

తెలుగుతోపాటు ఉర్దూ, తమిళం, ఒరియా, కన్నడ మాధ్యమాలు కూడా కనుమరుగవుతున్నాయి. ఈ  చర్య ప్రభావం పొరుగు రాష్ట్రాలలోని తెలుగు మాధ్యమం స్కూళ్ళపైబడి వాటిని ఆ రాష్ట్రాలు రద్దుచేసే ప్రమాదం ఉంది. ఇందువల్ల మైనారిటీ భాషలకున్న రాజ్యాంగ రక్షణ కూడా చెల్లనికాసుగా మారుతుంది.

ఇకపై మాతృభాషా మాధ్యమంలో చదవాలంటే వెతుక్కోవాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడుతుంది. ఇక ఆంగ్ల భాషా ప్రావీణ్యం వున్న వారే టీచర్లవుతారు. మాతృభాషలు చదివిన లక్షలాది మంది వీధిన బడతారు. హైస్కూళ్ళలో వేలాది మంది టీచర్లు మిగులు తేలుతారు.  శాస్త్రజ్ఞానానికి దూరమైన మాతృభాషలు మృతభాషలు కావడానికి ఎంతోకాలం పట్టదు. మీడియంగా నేర్పకపోతే భాషా వినియోగం దిగజారిపోతుంది.

ప్రభుత్వ నిర్ణయంపై ఎప్పుడూ లేనంత చర్చ మన చదువుల్ని గురించి, మాధ్యమాన్ని గురించి, భాషల గురించి బడుగుల పిల్లల గురించీ జరగడం అద్భుతమైన విషయం. దీన్ని ఆహ్వానిద్దాం. కొనసాగిద్దాం. దీంతోపాటు పెద్దఎత్తున తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ విద్యార్థి భాషా సాంస్కృతిక సంఘాలు, నిపుణులూ ఒక బాట మీదికి రావాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక సాంస్క ృతిక వెల్లువకిది దారితీయాలి. ఒకరికొకరం తోడుగా మన పిల్లల భవితవ్యాన్ని, మాతృభాషను కాపాడుకొందాం.

1.   జి.వో. నెం. 81, 85 లను రద్దు చేయాలి. మాతృభాషా మాధ్యమాన్ని కొనసాగించాలి.

2.   ప్రభుత్వ, వ్రైవేటు పాఠశాలలన్నింటిలో ప్రాథమిక విద్యను మాతృభాషా మాధ్యమంలో బోధించాలి.

3.  ప్రాథమిక విద్యాస్థాయి నుండే ఇంగ్లీషును సమర్థవంతంగా నేర్పాలి. అందుకు తగిన నిపుణత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలి.

4  నాణ్యతతో కూడిన, సమానమైన విద్యనందించే కామన్‌ స్కూల్‌ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలి.