మనిషి, పెండ్లి, పుట్టుక

కవిత

- డాక్టర్‌ కత్తి పద్మారావు - 9948748812

మానవ సంబంధాల్లో వైరుధ్యాలు

హింసా ప్రవృత్తి పరిఢవిల్లుతోంది

ప్రేమ ఎలా నేరమౌతుంది ?

తండ్రే కసాయి వాడైతే ఎవర్ని నమ్మాలి

కత్తితో అల్లుణ్ణే వధిస్తే

సామాజిక ధర్మమేముంది ?

హిందూ ధర్మమంటే వధించడమేనా!

రావణుణ్ని వధించారు!

నరకుణ్ణి చంపారు!

శంబూకుడి తల తీశారు!

అయినా మనిషిని మనిషి పెండ్లాడడం ఎలా నేరం

మరి వశిష్టుడు అరుంధతిని చేసుకొన్నాడు

అరుంధతిని ఎందుకు పూజిస్తున్నారు?

అరుంధతి నక్షత్రమెలా అయ్యింది?

శక్తి అదృశ్యంతిని చేసుకొన్నాడు

వారికి పరాశరుడు ఎలా పుట్టాడు?

పరాశర స్మృతిని ఎలా అనుసరిస్తున్నారు?

పరాశరునికి బెస్తకన్యకు వ్యాసుడెలా పుట్టాడు?

సంకరంగా పుట్టిన వ్యాసుని చేత

పురాణలెలా వ్రాయించుకొన్నారు.

అసలు| ఆర్య రాజ్యానికి మూలమైన

కౌరవ వంశం కథేంటి?

వ్యాసునికి, అంబికా,అంబాలికకు

పుట్టిన ధృతరాష్ట్రునికి పాండురాజుల పుట్టుకేమిటి?

ధృతరాష్ట్రునికి వంద మంది కొడుకులు ఎలాపుడతారు?

వివేచన లేదా! ప్రశ్నలేదా!

సొంత కొడిక్కి

దుర్యోధనుడు

'దుష్టంగా యుద్ధం చేయువాడు' అని అర్ధం

కూతురుకి

దుస్సల 'చెడ్డగా మాట్లాడునది'

అని పేర్లు ఎలా పెట్టుకొంటారు

ఆలోచన లేదా!

పుక్కిట పురాణాలకు బుర్రలు తాకట్టుపెట్టిన

మీరు, మనుష్యులను మనుష్యులుగా

ఎందుకు చూడలేరు

పాండు రాజుకు పిల్లలు కలగలేదు

యముడికి ధర్మరాజు

వాయు దేవునికి భీముడు

ఇంద్రుడుకి అర్జునుడు

అశ్వనీ దేవతలకు

నకుల సహదేవులు ఎలా కలిగారు

వీరిదే వర్ణం? వీరిదే కులం?

వర్ణం సృష్టించబడింది

అసలు దేవుడే సృష్టించబడ్డాడు

దేవుణ్ణి మానవుడే సృష్టించాడు

మానవుడు లేనిచోట దేవుడు లేడు

మానవుడు సృష్టించిన దేవునికి

మానవుణ్నే బలివ్వడం ఎంత నేరం

అవును| నీవు నీ కూతుర్ని కన్నావు

ఆమె ఎవర్నీ ప్రేమించ గూడదా!

కులం మూలం నీకు తెలుసా?

అల్లుణ్ణి చంపి హంతకుడివయ్యావు

నీవు రాజ్యాంగేతర శక్తివయ్యావు

ఇప్పుడు కూతురు భర్త లేనిదయ్యింది

మీ ఋషులందరూ వర్ణాంతరాలే కదా!

పరిశీలిస్తే నీవూ వర్ణాంతరుడివే

నీవూ ఒకరికి బానిసవే

క్రతువుల్లో నీవెందుకు

బ్రాహ్మణునికాళ్ళు పట్టుకొంటున్నావు

నీవు ఎవరి శ్రమతో ధనవంతునివయ్యావు

మా శ్రమను దోచుకొనే హక్కు నీకుంటే

మీ పిల్లలను చేసుకొనే హక్కు మాకులేదా?

వర్ణాంతరం వెలుగు

వర్ణాంతరమే జీవనసాఫల్యం

సమాజం మూలం తెలుసుకోండి|

మానవాభ్యుదయానికి మూలం ప్రేమ

ప్రేమ వర్ణాంతరానికి వారధి

మనిషిని మనిషి వెలిగించే

సామాజిక విప్లవమే మార్గం

(అమృతను కులాంతర వివాహం చేసుకున్నందుకు 14-9-2018న 23 యేండ్లకే మామ మారుతీరావు (వైశ్య) ద్వారా హత్యకు గురైన దళిత యువకుడు ప్రణయ్‌ కుమార్‌కు అంకితం)