తప్పుడు పైకప్పు

పాయల మురళీకృష్ణ8309468318

దీపంబుడ్డి ఆరిపోకుండా అడ్డుపెట్టిన
చేతుల్లాంటి గుడారం
చీకటి సముద్రాన్ని సుఖంగా ఈది
పగటితీరానికి
రెక్కల్లేని పక్షులతో సహా ఎలా చేరుతుందో
పక్కనే చెట్టుకు కట్టిన జాబిలికి తెలుస్తుంది

కడలి బోర్లించినట్లున్న ఆకాశం క్రింద
అలలపై నడిచే పాదాలకు
పైకప్పు శూన్యమైనంత మాత్రాన కల చెదిరిపోదు
వల గురితప్పదు

హరిత ఛత్రాలైన
వ్రేలాడే ఉద్యానవనాలను
వింతగా భావించే కవ్వింతల్లో
బాబిలోనియా జీవనం
పూరీతీరంలో సైకత శిల్పంలా
ఒకరోజు మెరిసి మాయమైపోతుంది

నిర్విరామంగా పనిచేసి శీతలయంత్రం
నడకలో కాలు బెణికినట్లు ఆగిపోయి
ఊపిరి రూపుతున్నా సరే
తప్పుడు పైకప్పుకింద ఏం తప్పిపోయిందో
తెలుసుకోలేని మెలుకువ కమ్ముకుంటుంది

అలికిన గడపకి నిద్రని కట్టి మరచిపోయి వచ్చిన శరీరం
పింగాణీ మట్టి క్రింద
చలువరాతిపై చేరబడి
కళ్ల చుట్టూ నిశిని పూసుకుంటుంది

రేపటికి ఓ కొత్త సదుపాయమై
త్వరితగతిని రూపాంతరం చెందే
విపణి బందిలదొడ్డిలో కట్టేయబడ్డ మనిషి
రూపాయల కట్టలా రెపరెపలాడకపోతే దినందీరదు

ఇప్పుడు
తప్పనిసరి అనుకున్న తప్పుడు పైకప్పు కింద
కిందకి మరింత కిందకి
దిగజారిపోవడమేంటా అనుకునే ఆలోచనను
తాజా పేపర్లో
''గోప్ప భారతదేశ పండగ''
తన జేబులో వేసుకొని రెండు పేజీల ప్రకటన చేతుల్తో
అలవోకగా తన వెంట లాక్కుపోతుంది