నిర్మలంగా ప్రవహించే మనిషి కోసం...

- డా|| పి.సి.వెంకటేశ్వర్లు 9490164963

మనిషికోసం వెదుకులాడటం ఇరవై ఒకటవ శతాబ్దపు అభ్యుదయకవులు చేస్తున్న ప్రయత్నం. ఒక శతాబ్దం కిందట గురజాడ మట్టికంటే మనిషి గురించి ఆలోచించమని, మానవత్వాన్ని గురించి చర్చ మొదలుపెట్టాడు. అయితే నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషికంటే మార్కెట్‌కీ, వస్తుసంస్కృతికీ విలువ ఎక్కువైన సందర్భం. సమాజంలో అడుగంటిపోతున్న మానవతత్త్వాన్ని బ్రతికించడం కోసం శక్తివంచన లేకుండా మేధావులు కృషిచేస్తున్నారు. పెట్టుబడిదారీ సమాజంలో మనిషి మరమనిషిగా మారి, కంప్యూటర్‌ ముందు కూర్చోవడం ప్రారంభమైన నాటినుండి అభ్యుదయకవులు ఈ విషయంపై మాట్లాడుతూనే ఉన్నారు. పాలిచ్చి పెంచే తల్లులు పలకబారిన యంత్రాలుగా మారుతున్నప్పుడు స్పందించారు. వృద్ధాశ్రమాలు రెట్టింపు సంఖ్యలో పెరుగుతున్నప్పుడు మాట్లాడారు. పల్లెలు శ్మశానవైరాగ్యంతో బక్కచిక్కి పోయినప్పుడూ మాట్లాడుతున్నారు. మనిషిని కవిత్వ రూపంలో, కథల రూపంలో, నాటకాల రూపంలో వెదుకులాడుతూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇటీవల డా|| ఎన్‌. ఈశ్వర్‌రెడ్డి రాసిన కవితా సంపుటి 'నాకొక మనిషికావాలి'. మట్టివాసన తెలిసిన వ్యక్తిగా, మనిషితత్త్వాన్ని అర్థం చేసుకున్న ఆచార్యుడిగా, మానవత్వాన్ని ఆకలింపు చేసుకున్న కవిగా అనేక ఖండికల్లో మాయమైపోతున్న మనిషికోసం తన కవిత్వపు లేజర్‌ కళ్ళతో వెదికాడు.
ప్రాంతీయ అస్తిత్వంపై రెండు కవితా సంపుటాలు వెలువరించిన ఈశ్వరరెడ్డి, ఈ కవితా సంపుటిలో మనిషిని కేంద్రబిందువుగా చేసుకున్నాడు. అందుకే కులమతాల ముళ్ళకంపలు ఏపుగా పెరుగుతున్న రోజుల్లో దళితులను చుట్టాలుగా చేసుకొన్న తనతల్లి లక్ష్మమ్మ మానవత్వపు గుబాళింపుకు ఈ సంపుటాన్ని అంకితం ఇచ్చాడు. ప్రశ్నించడం నేర్పినందుకు తన గ్రంథాన్ని తండ్రికి అంకితమిస్తున్నానని అంటాడు గోపీచంద్‌. అలాగే రచయిత కూడా తల్లి నేర్పిన సమసమాజదృష్టికి గుర్తుగా తన రచనను అంకితమిస్తున్నానని అంటాడు.
ఆర్వీయస్‌ సుందరం, రాచపాళెం, శిఖామణి, వినోదిని వంటి వారి ముందుమాటలు పుస్తకంలోని కవిత్వతత్వాన్ని కొంతవరకు వివరించారు. రచయిత వివిధ ఖండికల్లో వ్యవస్థపై సూటి ప్రశ్నలను సంధించాడు. కవిత్వం ఒక జీవరసం, రండి బాబూ రండి... మా భూములిచ్చేస్తాం, మా చెవులు ఖాళీగానే ఉన్నాయి, మతమౌఢ్యరేఖ, నాకొక మనిషికావాలి, పుష్కరపుణ్యం మాక్కూడా కావాలి, ప్రేమనౌక, పల్లె పండగ, ఓటు వేస్తేనే బతికున్నట్టు లెక్క, ద్వై విధ్యం, ఓటు వజ్రాయుధం, టమోటాలు కిలో రెండ్రూపాయలే, కడప ఉక్కు - రాయలసీమ హక్కు, ఖాళీ జేబు - నిండు జేబు, ది స్టేట్స్‌మేన్‌, 'జ్ఞాన'మద్ది, ప్లెమింగో! నువ్వు మాకొక ప్రేమపాఠం, ఓట్ల సంత, అది బుద్ధభూమికాదు, అప్పుడే కొత్త సంవత్సరమా?, అమానవీయశాస్త్రం, అవును! అది దేవతలు దిగబడ్డ బూమే, దినసరి బతుకు, నా ఎద్దులబండి ఏమైంది, మమ్మల్ని
దేవుళ్ళు చేయకండి, కాస్టింగ్‌ కౌచ్‌, కాలని శవాలు, ఏ రాకాసి మింగిందో?, చీడపురుగులు, జలశ్మశానం, భోగి(గ)సౌభాగ్యం, మోసపు మబ్బులు, నిప్పులపొది, ఈ కార్పోరేట్‌ రాజధాని మాకొద్దు, కొనడం అమ్మడమే రాజకీయం, మనిషిగా మిగలవా?, ఈ సినిమా మాకొద్దు, ఎడారి దు:ఖం, తెగిపోతున్న మానవపోగు, మట్టింటికి అమ్మపక్షి, ప్రేమ జీవ ప్రవాహం అమ్మ, సాధిద్దాం, నిరాశ పడకు నేస్తమా... అనే 43 కవితా ఖండికల్లోని వస్తువు వర్తమాన సమాజంలోని పరిస్థితులను రూపుకట్టించింది. కవిత్వంలో కన్పించే భావచిత్రాలతో పాటు, అభ్యుదయం, మార్క్సిజం, అల్యూజం, మిథోపోయి వంటి అంశాలు చోటుచేసుకొని ఉన్నాయి.
''కవిత్వం ఒక గొప్ప మహాత్యం/ నా జీవితాన్ని మార్చిన నవనీతం'' అంటూ మొదటి ఖండికను పూర్తిచేయడంలోనే కవి అభ్యుదయ దృక్పథం స్పష్టమవుతుంది. మహత్తు అక్షరంలో ఉందని. మనిషిని మార్చే గొప్పదనం కవిత్వంలోనే ఉందని, రాళ్ళూరప్పల్లో, రంగురాళ్ళ ఉంగరాల్లో, నుదుటన రంగరించుకునే నామాల్లో, అంతామాయని అని చెప్పే స్వాముల మెట్ట వేదాంతాల్లో లేదని చెప్పడం కవి ఉద్దేశం. తన జీవితాన్ని భౌతికవాదంలో కలిపి కవితాఖండికలన్నిటిలో విస్తరింపజేశాడు రచయిత. ఈ కవితా సంపుటిలో వస్తువు ఎన్నికలు, రాజకీయం, సీమఅస్తిత్వం, వ్యవసాయం, వ్యక్తిత్వవికాసం, సంస్కృతి, మానవత్వం, మొదలైన అంశాలతో విస్తరించబడింది.
రచయిత అభ్యుదయవాది అయినప్పటికీ, ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకమున్న వ్యక్తిగా కనిపిస్తాడు. అందుకే ఓటువేసి మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ఖండికల్లో చెప్పుకొచ్చాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్న దారుణాలకు కారణం వ్యక్తులు తీసుకునే నిర్ణయాలేనంటాడు రచయిత. రాజ్యాంగం అందరికీ ప్రాథమిక హక్కులను ప్రసాదించిందని, ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించినంత మాత్రాన రచయితలను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదంటాడు. ప్రజాస్వామ్యవాదిగా 'ఓటు వేస్తేనే బ్రతుకున్నట్లు లెక్క' అంటాడు. అయితే పనికిమాలినవాళ్ళు, స్వార్థపరులు ప్రజాప్రతినిధులుగా నిలబడ్డప్పుడు వారికి ఓటు వేసేందుకు ఇష్టంలేకపోతే 'తిరస్కరణ' ఓటు వేసి ఆ నాయకులను పరోక్షంగా చెంప పగలగొట్టమంటాడు. ఓట్లద్వారా అందలమెక్కి, తెల్లరాబందుల్లా ప్రజాధనాన్ని మింగుతున్న వారిని 'వజ్రాయుధం' వంటి ఓటుతో మట్టుబెట్టమంటాడు. సామాజిక రచయితగా ఈరోజు ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో తెలియని వ్యక్తికాదు ఈశ్వర్‌రెడ్డి. భారతదేశంలో ఎన్నికలు 'ఓట్ల సంత' లా మారాయనడం వెనుక ఉద్దేశం అదే. ఇంతపెద్ద ప్రజాస్వామ్యదేశంలో ప్రజల అభీష్టాలకు తావులేకుండా పోవడానికి కారణం ఓట్లను అమ్ముకోవడమేనంటాడు రచయిత. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలను ఓట్లు వెయ్యనీయకుండా దౌర్జన్యం చేస్తూ ఓటర్ల మునివేళ్ళను, అవసరమైతే గొంతుకలను కత్తిరించి ఓట్లేసుకునే రాజకీయవేటగాళ్ళు కూడా ఈదేశంలో ఉన్నారని ధైర్యంగా విమర్శిస్తాడు. సంతలో పశువులను కొన్నట్లు బేరంచేసి ఓటర్లను కొంటున్నారని, బేరంతో ప్రజల్ని పడేసే వ్యవస్థ అడుగడుగునా ఉందని వివరిస్తాడు.
''ఎంతటి వాణ్ణయినా ఏదో ఒక సున్నా దగ్గర
పడేయగలమనే వాడి ఆర్థికజ్ఞానం
అర్ధాకలితో ఉన్న మా అజ్ఞానాన్ని సొమ్ముచేసుకోవాలని
నిత్యం తహతహలాడుతూ ఉంటుంది'' అనడంలో
ఉద్దేశం అదే. అంతేకాదు, సంతలో వ్యాపారం ఎలా జరుగుతుందో ఎన్నికలప్పుడు కూడా వ్యాపారం అలాగే జరుగుతుందని, రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికీ ఉండే సంత సంప్రదాయాన్ని
''పశువులు వేలానికొచ్చినట్లు
పదవులు వేలానికొస్తాయి
మా ఊరి చావిట్లో రాత్రిపూట వేసే
సోలాపూర్‌ దుప్పట్ల వేలం గుర్తుకొస్తుంది'' అనే వాక్యాల్లో ప్రతిబింబింపజేశాడు. అంతేకాదు మత్తెక్కించే తీర్థాలు, మనసును ఊరించే ప్రసాదాలుపెట్టి ప్రజల్ని దేవుళ్ళును చేయడాన్ని ఖండించాడు. ఇక్కడ ఎన్నికలప్పుడు ప్రలోభపెట్టే మద్యం, బిర్యానీలను గురించి ప్రస్తావించినట్లు పైకి కనిపిస్తున్నా, మతం మత్తును, కులం ప్రసాదాన్ని ఎరగా వేసి ఓట్లను దండుకునే రాజకీయపార్టీల ఎత్తుగడల్లో పడొద్దని రచయిత నర్మగర్భంగా తెలియజేస్తాడు.
రచయిత సమాజంలో భాగమే కాబట్టి, నేటి రాజకీయ వ్యవస్థ గురించి కూడా కవితాపరమైన వ్యాఖ్యలు చేస్తాడు. గొంగడిలో కూర్చోని తింటూ వెంట్రుకలు భోజనంలో పడుతున్నాయని అనుకుంటే పొరబాటేకదా! అన్నది రచయిత అభిప్రాయం. రాజకీయం గురించి కవి మాట్లాడకుంటే ఇంకెవరు మాట్లాడాలి అన్నది రచయిత వేసే సూటిప్రశ్న. అయితే వర్తమాన ప్రభుత్వాలపై, అవి సాగిస్తున్న పాలనపై రచయితకు స్పష్టమైన అవగాహన ఉంది. అలాంటి ఆలోచనలు లేకుంటే 'మానవత్వం' వంటి శీర్షికలు పెట్టేవాడు కాదేమో. ప్రభుత్వాలు లౌకిక రాజ్యాంగస్ఫూర్తిని వదిలేసి ఉన్మాదంతో మానవ కేంద్రకాన్ని వదిలి పరిభ్రమిస్తున్నాయని అంటాడు.
''భూగోళం తిరుగుతోంది దారితప్పి
హింస కేంద్రకం చుట్టూ
భూమధ్యరేఖను తోసిరాజని
మతమౌఢ్యరేఖ పొడసూపుతోంది'' అనడంలో రచయిత ధైర్యం, అభ్యుదయ భావన, సంకుచిత తత్వాన్ని నిలదీసే తత్వం అర్థమవుతాయి. అంతేకాదు రచయితలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే సాకుతో కల్బుర్గి, గౌరీలంకేష్‌ వంటి రచయితలను చంపించిన దృశ్యాలు మనకందరికీ తెలుసు. కంటిముందు ఇలాంటి విధ్వంసాలు చూసిన ఏ అభ్యుదయ రచయితా మౌనంగా ఉండలేడు. అందుకే ఈశ్వర్‌రెడ్డి
''భావస్వేచ్ఛల గొంతులను నులిమే
కాషాయ అధికార చీకట్లు'' అని ధైర్యంగానే ప్రశ్నిస్తాడు. ఉన్మాదం ఏ మతంలో ఉన్నా తప్పేనంటాడు రచయిత. సిరియాలో ఐ.యస్‌.లో పనిచేయొద్దని హితువు చెప్పిన తల్లి 'లీనా'ను నిర్దాక్షిణ్యంగా చంపిన 'అలిసకర్‌' క్రూరత్వాన్ని కూడా ప్రశ్నిస్తాడు. మతంతో రాజకీయం చేయవద్దని పిరికిపందల్లా అర్ధరాత్రి దొంగదెబ్బలు తీయొద్దని చీడపురుగుల్లాంటి
ఉన్మాదులను హెచ్చరించాడు.
రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వాన్ని సాహిత్యంలో చర్చించడం చాలా సంవత్సరాల ముందు నుండే ఆరంభమైంది. కరువు, ఫ్యాక్షనిజం, వర్షాభావం వంటి అంశాలపై రచయితలు సాహిత్య సృజన చేస్తున్నారు. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా రాయలసీమ అస్తిత్వంలో భాగంగా కొత్త కొత్త సమస్యలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్రవిభజనలో, కర్మాగార స్థాపనలో, రాజధాని విషయంలో సీమకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పడం రచయిత ఎంచుకున్న కొత్త వస్తువు. సినిమాలు, దూరదర్శన్‌లు సీమప్రాంత సంస్కృతిపై చేసే అసత్య ప్రచారాలను కూడా ఈశ్వర్‌రెడ్డి తిరస్కరించాడు. స్వాతంత్య్రం వచ్చాక ఏడు దశాబ్దాలుగా నాయకుల మోసపు వాగ్దానాలతో సీమ నలిగిపోయిందని బాధపడ్డాడు. అలాంటి నాయకుల్లాగా మేఘాలుకూడా వర్షాన్నివ్వకుండా మోసం చేస్తున్నాయని 'మోసపు మబ్బుల్ని' నిలదీశాడు. కాళిదాసులాగా, పుట్టపర్తిలాగా ప్రేమ సందేశానికి మేఘాన్ని వాడుకోకుండా, మేఘం చేస్తున్న వంచనను గుర్తు చేసుకుంటూ పాలకులను
''మా సీమ కూడా
ఈ దేశంలో భాగమే అయితే
ఈ దేశంలో పారేనదులు
మా ఊర్లను తాకవెందుకు'' అని ప్రశ్నిస్తాడు. దేశమంతా ఒకే చట్టం, ఒకే న్యాయం అని ఊదరగొడుతున్న ప్రభుత్వాలు దేశంలోని అన్నిప్రాంతాలకు నీటిని సమానంగా పంచాలనే కనీస ధర్మాన్ని ఎందుకు పాటించడంలేదని నిలదీస్తాడు. అలాగే సీమకు రావాల్సిన ఉక్కుఫ్యాక్టరీలు వంటి వాటిని కూడా రానీకుండా చేయడం వెనుక జరిగే కుట్రను రచయిత 'కడప ఉక్కు-రాయలసీమ హక్కు' ఖండికలో తెలియజేశాడు. సీమప్రజల మనస్తత్వానికి క్రూరత్వపు ముద్రవేసి తెరపై చూపించడాన్ని రచయిత విమర్శించాడు. అయిదు రూపాయలకోసం, అరకట్ట బీడీలకోసం హత్యలు చేసేవారని నమ్మిస్తున్నారని ఆవేదన చెందాడు.
''చిల్లర పైసల కోసం
సీమ ఆత్మను
సినిమా తెరపై వేలాడదీస్తున్న'' వారిని తిరస్కరించాడు. అలాంటి సినిమాలు తీస్తే రీళ్ళను తగలబెడతానని హెచ్చరించాడు.
రాయలసీమ ప్రాంతంలో రైతు పడే నరకయాతనను అక్షరీకరించాడు రచయిత. రాయలసీమ ప్రాంతం నుండి ఎక్కువగా పండించే టమోటా పంట అతివృష్టి, అనావృష్టివల్ల రైతును కడగండ్లపాలు జేస్తుందనేది నగసత్యం. రాయలసీమ రైతు టమోటాలు పండించడానికి పడుతున్న కష్టాన్ని చెప్తూ
''ఇంటిల్లపాది
పొలంలో రక్తాన్ని పిండేకుంటే
తోటంతా ఎర్రటి టమోటా'' అంటాడు. అయితే ఇంత కష్టపడి పండించిన టమోటా తగిన ధరలేకపోతే, రైతు పడే బాధనూ వివరించాడు. ఎప్పుడు రైతు తన పంటకు ధర నిర్ణయించగలుగుతాడో అప్పుడే వ్యవసాయం బాగుపడుతుందని అంటాడు రచయిత. ఈ రోజు మంచినీళ్ళకు మాయలేబుళ్ళు తగిలించి పాలకన్నా ఎక్కువ ధరకు అమ్మే బహుళజాతి కంపెనీలు ఒకవైపు, గుండుసూదికి కూడా యం.ఆర్‌.పి. నిర్ణయించే సంస్థలు మరొకవైపు నడుస్తున్న వ్యవస్థలో, నెత్తురు-కన్నీరు కలిపి గింజల్ని తయారు చేసే రైతు కష్టానికి ఖరీదుకట్టే వాడెవడని ప్రశ్నిస్తాడు రచయిత.
నేటి వ్యవస్థ మొత్తం ఈ విధంగా మారిపోవడానికి ప్రధానకారణం ప్రపంచీకరణగా ఈశ్వర్‌రెడ్డి నిర్ధారించాడు. వ్యవసాయం, గ్రామీణవృత్తులు వంటి వాటిని చావుదెబ్బ తీసిన ప్రపంచీకరణ, జనాభాతో కిటకిటలాడుతున్న భారతదేశంలో మనిషి ఒంటరితనంతో మిగిలిపోవడానికి, కుమిలిపోవడానికి కారణమైందంటాడు. మానవపోగు తెగిపోవడానికి కారణం ప్రపంచీకరణేనని తెగేసి చెప్పాడు. ఈ రోజు కోరిన ప్రపంచాన్ని కళ్ళముందుంచే టీవీలు, అరచేతిలో ఒయ్యారాలు పోతున్న సెల్‌ఫోనులు ప్రపంచీకరణ ప్రతిఫలంగా మనిషిచేతిలో చేరి, అతణ్ణి రూపాయల చుట్టూ అంగప్రదక్షిణ చేయిస్తున్నా యంటాడు.
''ఇప్పుడు
బంధుత్వ నాడీ వ్యవస్థలో
రూపాయల సంస్కృతి ప్రవహిస్తుంది'' అనడం వెనుక రక్తసంబంధం రూపాయి సంబంధంగా రూపాంతరం చెందిందని సూటిగా చెప్పడమే.
సమాజంలో త్వరగా వ్యాపిస్తున్న ఇలాంటి ప్రపంచీకరణ విషసంస్కృతుల నుండి బయట పడాలంటే వ్యక్తి మానసికంగా ఎదగాలాంటాడు రచయిత. అధికారం, హౌదా, డబ్బు అనే వాటిలో చిక్కుకున్న మనిషి సంకుచితుడైపోతున్న వాస్తవాన్ని 'కాలని శవాలు' ఖండికలో ఎండగట్టాడు. అనవసరమైన ఆడంబరాలతో వ్యక్తిత్వపు వెన్నుపూసను తానే విరుచుకుంటే, వానపాములా ముడుచుకుపోయి నడవాల్సి వస్తుందంటాడు. అందుకే మనిషిని నిగ్రహంగా, వినయంగా, స్వార్థరాహిత్యంగా నడవమని కోరుకున్నాడు. ఒక్కొక్కసారి నిరాశా నిస్పృహలు ఆవహించినా, దృఢ చిత్తసంస్కారంతో ముందుకు నడవమంటాడు.
''చుక్కలు ఆసరాగా నిలుస్తాయి
చిమ్మచీకట్లు కమ్మినపుడు'' అనడం ఆశావాద దృక్పథంతో మనిషిని ముందుకు నడవమని చెప్పడమే.
రచయిత దృష్టిలో భారతీయ సంస్కృతి అంటే ఈరోజు కాషాయ పరివారం చెబుతున్న సంస్కృతి కాదు. మన సంస్కృతి గ్రామీణజీవనంలో అడుగడుగునా కనిపిస్తుంది. పండుగలు, పబ్బాలు, పనిముట్లు, ఆహారపు అలవాట్లు వంటివి మన సంస్కృతి. వాటిని పోగొట్టుకోవడం దురదృష్టకరమంటాడు రచయిత. కొత్తగా వస్తున్న తలిదండ్రుల దినోత్సవాలు, ప్రేమికుల దినోత్సవాలు వంటివి మన సంస్కృతి కాదని సున్నితంగా చెప్పాడు. ఈ రోజు సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న రకరకాల అంశాలు మన సంస్కృతిలో భాగం కాదని వివరించాడు.
'ప్రేమంటే రాత్రింబవళ్ళు ఏమార్చుకునేందుకు పంపుకునే తియ్యటి మెసేజ్‌లు కాదు, రెండు మనసుల మధ్య పరిమళించే ఆత్మగంధం లాంటి అమ్మనాన్నల ప్రేమ' ని నిర్వచించాడు. పల్లె జీవనానికి నాడి వంటి ఎద్దులబండి మాయమైపోయిందని, సంక్రాంతి పండుగ జవసత్వాలు కోల్పోయి కళతప్పి పోతుందని రచయిత మన సంస్కృతి తెరమరగైపోతున్న సాంస్కృతిక విషయాలపై ఆవేదన చెందాడు.
కవితాసంపుటిలో ఎక్కువ ఖండికలు మానవత్వాన్ని తట్టిలేపుతాయి. మనిషి వాసనను గుబాళింపజేస్తాయి. ఆలూరి బైరాగి 'నాక్కొంచెం నమ్మకమివ్వు' అని అడిగినట్లే ఈశ్వర్‌రెడ్డి కూడా 'నాకొక మనిషికావాలి' అని అడుగుతున్నాడు. ఆ మనిషి ఎలాంటి వాడై ఉండాలో కూడా వివరంగా చెప్పాడు. నిర్మలంగా ప్రవహించే మనిషి కావాలని, మనిషిని అంగడి సరుకుగా చేస్తున్న ఆలోచనను తన్నే మనిషి కావాలని, సంక్షేమం పేరుతో దోచుకు తింటున్న వారి తలపగలగొట్టే మనిషి కావాలని, సమానత్వపదాన్ని వల్లెవేస్తూ ప్రజలను నిరుపేదలుగా మార్చేవారి నాలుకచీల్చే మనిషి కావాలని, చివరిగా
''మనిషిని మనిషిగా బతకనివ్వని
ఈ యాంత్రిక కుతంత్ర సమాజాన్ని
మానవీకరించే మనిషి కావాలి'' అంటూ తన కావ్యంలోని కవిత్వ భూమికను వివరించాడు. అయితే ఈ ఖండికల్లో అంతర్లీనంగా రెండు ప్రపంచాలను చూపించాడు. రైలుపట్టాల్లా ఎప్పటికీ కలవని రెండు సమాజాల స్థానంలో సరికొత్త సమాజం రావాలని కవి ఆకాంక్షించాడు. 'స్వీయ జీవిత సంఘర్షణను సామాజిక జీవిత సంఘర్షణగా వర్తింపజేసుకున్న రచయితగా ఈ కావ్యం రాశాడు.' అని రాచపాళెంగారు కవికి కితాబిచ్చినా, ఈశ్వర్‌రెడ్డి మాత్రం మనిషి పరిపూర్ణ మానవత్వపు లక్షణాలను పునరుద్ధరించుకుని ముందుకు సాగాలని కోరుకున్నట్లు అర్థమౌతుంది. ఆ ఆకాంక్ష ప్రతి ఖండికలోను స్పష్టంగా కన్పిస్తుంది.