దేశం నాదే

అడిగోపుల వెంకటరత్నమ్‌
9848252946


శ్రమకు జ్వలించిన రక్తం
ఘర్మజలంగా మారింది
కడవల్తో కొలిచి
త్రాసుల్తో తూచి
ఒక నాణెం మజూరి విసిరి
వందనాణేలు జవిరి
అందలమెక్కి వూరేగుతూ ఒకడు
శరీరం నాదే
నా స్వేదం నాది కాదు !
మతం మత్తు మందంటూ
సాగిన నా ప్రచారం
మానవాళి మస్తిష్కాల్లో
చిరుదీపం వెలిగించాక
పెనుదీపమై
ప్రమాదముందని మూఢులు
నా పై దండయాత్ర
ప్రచారం నాదే
నాది దుష్ప్రచారం కాదు !
ఎటిని ఎగ్గట్టి
కలుజుల్ని కట్టడిచేసి
పంటకాలువ పూడికతీసి
రోహిణీలో ఎండి
మేఘాలకు పహరా కాశాను
వంధ్య విత్తనాలపై
కల్తీయూరియా పై దండెత్తి
పొలం మోయలేని దిగుబడి
పండించాను
బురిడీ కుంచాల్తో
కల్లంలో కొలిచిన దళారి
గిట్టుబాటు ధరంటూ
గిట్టుబడి కాని రొక్కమిచ్చాడు
పొలం నాదే
నా పంట నాది కాదు !
ఇవ్వాల్సింది దేశానికిచ్చి
రావాల్సిన దాన్ని అడుగుదామని
అంబరానికి నిచ్చెనలు వేసి
ఉరకలు వేసే యౌవ్వనంలో
పిడుగుల్ని బంధించాలని
యువతిగా ఆశయాలు
నా యౌవ్వనానికి మాటువేసి
ఎసరుపెట్టి కూర్చున్నాడు ఒకడు
ఒళ్ళునాదే
నా యౌవ్వనం నాది కాదు !
దేశం నాదే
నా దేశానికి నేనేం కాదు !