పూనమ్‌

ఆంగ్ల మూలం :  రాజీవ్‌ త్యాగి

తెలుగు : కె. సత్యరంజన్‌

పూనమ్‌ది వానా కాలపు చదువు. గంతకు తగ్గ బొంత అని ఒక సంబంధం కుదిర్చి పెళ్ళి చేసేసారు రెక్కల కష్టం మీద బతికే ఆమె తల్లిదండ్రులు. అతగాడా పచ్చి తాగుబోతు. ఆ తాగుడు అలవాటు మూలంగా ఏ పనిలోనూ నిలదొక్కుకోలేకపోయాడు. తన చాతకానితనాన్ని అంతా భార్యని చావచితక కొట్టడం ద్వారా వదిలించుకుంటూ ఉండేవాడు. ఇద్దరు ఆడపిల్లలకి తల్లి అయిన పూనమ్‌ సంసారం నడిపించే బాధ్యత అంతా తన నెత్తిన వేసుకుంది. ఒళ్ళు మర్దనా చెయ్యడం నేర్చుకుని ఇంటింటికి తిరిగి ఆయమ్మ ఈయమ్మ ఒళ్ళు పట్టి నాలుగు డబ్బులు సంపాదించుకు వచ్చి ఇల్లు నెట్టుకొస్తా ఉండేది. అనోటా ఈనోటా పూనమ్‌  పనితనం ఊరంతా పాకి మొత్తానికి తను సంపాదనతో ఒక స్కూటర్‌ కొనుక్కుని దీనిమీద కాస్త దురాబారాలు కూడా వెళ్ళి ఒళ్ళు మర్దనా చేసి వచ్చేదాకా పెరిగింది. ఇంటి బాధ్యత లేకపోడంతో మొగుడుకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. పగలూ, రాత్రి తాగుడుతోనే సావాసం. ఆ సావాసం కోసం పూనమ్‌ కష్టపడి సంపాదించి ఇంట్లో దాచిపెట్టుకున్న సొమ్ముని దొంగతనం చేసయినా తీసుకుపోయే స్థాయికి దిగజారిపోయాడు. చేతికి డబ్బు దొరకకుండా చేసిన రోజున పూనమ్‌ని తన్ని మరీ తన తాగుడుకు కావాల్సిన డబ్బు గుంజుకు పోయేవాడు. తన వృత్తిలో భాగంగా చాలా పెద్ద కుటుంబాల ఆడవాళ్ళతో పూనమ్‌కి పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ ఊరి మేజిస్ట్రేటు గారి భార్యకూడా పూనమ్‌కి అలానే పరిచయం అయింది. పూనమ్‌ సంసారం గురించి తెలుసుకున్న ఆవిడ ''అలాంటి తాగుబోతు వెధవని ఇంకా భరించేది దేనికి, ఏ నీకాళ్ళ మీద నువ్‌ నిలబడలా ఇన్నాళ్ళు . అయ్యగారితో మాట్లాడి ఆ పాపిష్టోడితో నీకు విడాకులు అయ్యేలా చూస్తాలే'' అని సముదాయించింది.

విడాకులు అనేసరికి ఇద్దరు ఆడపిల్లలని ఇంటికి మగదిక్కయి ఇన్నాళ్ళుగా సాకుతూ వచ్చిన పూనమ్‌ ముందు చాలా గుంజాటన పడింది. లోకం ఏమనుకుంటుంది అని పరిపరివిధాలా ఆలోచించింది. తన ఇద్దరు బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం తాను మొగుడ్ని వదిలేసిన ఆడది అన్నమాట పడడం పెద్ద విషయం కాదు'' అని నిర్ణయం చేసుకుంది. ఆ పళానే మేజిస్ట్రేటుగారి భార్య సాయంతో కోర్టులో విడాకులు తీసుకుని తాగుబోతు మొగుడి పీడ వదిలించుకుంది. ఇద్దరు ఆడపిల్లలకి తల్లీదండ్రీ తానే అయి చదివించింది. హైస్కూలు చదువులు పూర్తికాగానే  పెద్ద కూతురికి బ్యూటీషియన్‌ కోర్స్‌ నేర్పించి స్వంతంగా ఒక పార్లర్‌ పెట్టించింది. కొద్ది రోజుల్లోనే పార్లర్‌కి మంచి పేరొచ్చింది. పూనమ్‌ కుటుంబానికి మంచి సంపాదన తెచ్చిపెట్టింది.

పెద్ద కూతురుకి పంతొమ్మిదో ఏడు నిండేసరికి పూనమ్‌ ఆ పిల్లకి పెళ్ళికొడుకుని వెతకడంలో పడింది. ఎట్టకేలకి ఒక ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో సేల్స్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఓ కుర్రాడిని చూసి ఈడుజోడుగా ఉంటారని సంబంధం ఖాయం చేసుకుంది. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు.

కొన్ని వారాలు గడిచాక పూనమ్‌ వియ్యాలవాళ్ళ ఇంటికి వెళ్ళింది. పెళ్ళి ముహూర్తం నిర్ణయించుకుని పెళ్ళిలో పాటించాల్సిన పద్ధతులూ అవీ మాట్లాడుకు వద్దామని. పిల్లాడి తల్లిదండ్రులు మాత్రం పూనమ్‌ వాళ్ళ ఇరుగుపొరుగు వాళ్ళ కులాలు ఏమిటని ఆరాలు తీస్తూ మీ ఇరుగూ పొరుగులో తురకోళ్ళు లేరు కదా అనడిగారు. 'లేకేం భేషుగ్గా ఉన్నారు. వాళ్ళిళ్ళకి మా ఇంటికి రాకపోకలు బాగానే సాగుతుంటాయి. నాకూ, నా కూతురికి కూడా చాలమంది సాయిబు స్నేహితురాళ్ళు ఉన్నారు' అని బదులిచ్చింది పూనమ్‌. పిల్లాడి తల్లిదండ్రులు మొహాలు చీదరగా పెట్టి ''ఆ స్నేహాలు మా ఇంటిదాకా తీసుకురాబాకండి. ఆఖరికి పెళ్ళికి కూడా 'వాళ్ళ'ని పిలవకూడదు, సరా'' అని చెప్పారు.

పూనమ్‌ కోబోయే అల్లుడికేసి చూసి 'నీదీ మీ అమ్మానాన్నా మాటేనా' అనడిగింది. కుర్రాడు జనకుడి మాట జవదాటని రాముడిలా తలూపాడు. అంతే పూనమ్‌ దిగ్గునలేచి 'ఏం మనుషులర్రా మీరూ, ఇంత మతం తలకెక్కేసి ఉన్నారు. ఇరుగూ పొరుగులో కులాలు, మతాలు లెక్కలేసే మీబోటి వాళ్ళ కొంపకి నా కూతుర్ని కోడలిగా పంపనుగాక పంపను' అని ఖరాఖండిగా చెప్పేసి వచ్చేసింది.

ఆ మరుసటి రోజు మా ఇంటికి వచ్చింది. మనిషి మనిషిగా లేదు. మా ఆవిడ దగ్గరికి వచ్చి 'అమ్మా మీతో నా బాధ చెప్పుకోవచ్చా' అనడిగి మరీ పూసగుచ్చినట్లు తన కూతురు పెళ్ళి వ్యవహారం అంతా విడమర్చి చెప్పింది. ఏదైనా తప్పు చేసానా అన్న దిగులు ఆమె మొహంలో కనిపిస్తుంది. మా ఆవిడ 'శభాష్‌ పూనం మంచి పన్జేసావ్‌' అంటూ మనస్ఫూర్తిగా మెచ్చుకోగానే పూనమ్‌ మొహంలో దిగులు మబ్చు తొలగిపోయింది. 'మరేం చెయ్‌మంటారు అమ్మగోరూ. మనుషులని చూడాల్సిన చోట మతాల్ని చూస్తున్న ఆ మరుగుజ్జు బుర్రల్తో నా కూతురు ఎలా వేగుకొస్తుందీ అనిపించి ఈ సంబంధం కాలదన్నేసాను అమ్మగోరు' అని చెప్పింది కొండంత తృప్తితో.

ఇదంతా వింటున్న నాకు అనిపించింది - ''ఈ జాతిని పూనమ్‌ లాంటి వందల వేల తల్లులు నిర్మిస్తారు తప్ప, దేశ ప్రధానులు మాత్రం కాదని''. మీకేం అనిపిస్తుందీ..?

('ఎ క్రాకర్‌జాక్‌ లైఫ్‌' కథాసంకలనం నుండి. రచయిత ఫేస్‌బుక్‌ ఐడి =aజీఱఙ్‌ుూ+I. పుస్తకం అమెజాన్‌.ఇన్‌లో లభిస్తుంది)