గన్‌ - సితార్‌

వెంకటేష్‌ పువ్వాడ
72047 09732

బుజ్కాషి చిత్రంలో
ప్రాణాలు కోల్పోయిన స్నేహితుడి కోసం
పదీ పన్నెండేళ్ల రఫీ
శిధిల భవనమెక్కి అహ్మద్‌.. అహ్మద్‌... అంటూ
ఆఫ్ఘాన్‌ గగనతలం ప్రతిధ్వనించేలా పిలుస్తాడు
బహుశా ఇప్పుడు విమానం రెక్కల పైనుంచి
జారిపడుతున్న మిత్రులంతా
ఆ అహ్మద్‌లే అనుకుంటాను!
గ్రనేడ్లకి దారం కట్టి గాలిపటాలు ఎగరేశారు
పక్షి రెక్క చప్పుల్లో కూడా ట్రిగ్గర్‌ నొక్కిన శబ్దాన్నే విన్నారు
కలల కాసారంలో
సామ్రాజ్యవాదం మొసళ్ల కోరలకి చిక్కిన
ఆ లేత పాదాలనిండా నిత్యం రక్తస్రావమే!
ఒకరికొకరు కన్నీళ్లు అరువిచ్చుకొని
నెత్తుటి మరకల అడుగుల అడుగుల్లో నడిచారు

ఆకలికి సితార్‌ సంగీతం నేర్పారు
పేగులకు జోల పాడారు
రాతిరి జావళిలో
మొండి మేడపై వెల్లకిలా పడుకొని
తోక తెగిన అమెరికన్‌ రాకెట్‌ లాంచర్ల రవ్వల వెలుగులో
భవిష్యత్‌ బంగారు ఆఫ్ఘన్‌ని ఊహించుకున్నారు
ఏమైందో ఏమో
కాలాన్ని కళ్లు మోసం చేసాయో
లేక కాలమే కళ్లని మోసం చేసిందో తెలీదు
ప్రజాస్వామ్యాన్ని కళేబరం చేసి
బుజ్కాషి ఆడుకుంటున్నారు తాలిబన్లు

అక్కడ సముద్రం లేదు కానీ
రక్త సముద్రమొకటి తీరం దాటింది
ఉగ్గుపాలు కూడా విషమే కాబోతున్నాయి
స్వేచ్ఛకు బహిరంగ మానభంగం సహజాతి సహజం

ఇప్పుడు అహ్మద్లు, రఫీలు లాంటి వాళ్లు
శవాల పక్కనుంచి ఎయిర్పోర్ట్‌ కి నడుస్తున్నారు
విమానాలెక్కి వెళ్లిపోతున్నారు
''నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే
గోల్డ్‌ స్మిత్‌గానే మిగిలిపోతావ్‌!'
అహ్మద్‌ బతికుండగా, రఫీతో చెప్పిన మాట ఇది!

రఫీ అలాగే మిగిలి పోయాడు
ఇంటికి తిరిగి వెళ్లి
కన్నీళ్లతో స్వప్నాలన్నీ రాల్చేసి
కొలిమిలో కాల్చేసి - ఎర్రగా కాలిన ఇనుముని
బయటకు తీసి దిక్కులు పిక్కటిల్లేలా
సమ్మెటతో మోదాడు
అతడు ఓడిపోయాడు
కాదు; ఓడించేసాం!
ఇప్పుడు ఆఫ్ఘన్‌ పౌర సమాజమంతా
నేల పైనుండి ఆకాశం వైపే చూస్తోంది
రాలి పడబోతున్న స్నేహితుల్ని ఒడిసి పట్టుకోవడానికి!

మనమేమి భద్రంగా లేము
ప్రస్తుతానికి తుపాకీ వెనుకాతల ఉన్నాం
కత్తికి పిడి పక్క నిల్చున్నాం
ఈ క్షణానికి మనం సచ్ఛీలురమే!
విద్వేషపు కత్తికి భారతావని కూడా ముక్కలైంది
కొన్నాళ్లు మాంసం ముద్దయింది
ఊచకోతకి ఉచ్ఛం నీచం తెలీదు
శ్మశాన శాంతే దానికి కావాలి
ఆధిపత్య అరాచకపు హౌమంలో
కులం, మతం, ప్రాంతం అన్నీ ఆజ్యం పోసేవే!

ఇకనైనా కరుడు కట్టిన మతం మసిని కడిగేసి
సర్వమత సమానత్వం రంగులనద్ది
ప్రేమ అత్తర్లను జల్లుకొని
కొత్త మానవతకు తలుపులు తీద్దాం!
లేకుంటే మనం కూడా చింతనిప్పుల్లా మండే కళ్లతో
ఆకాశం కేసి చూడాలి!