కొత్తదారులు కావాలి

కవిత 
- కొండా శిరీష6300396530


అవును
వాళ్ళకి ఇప్పుడు కొత్తదారులు కావాలి
కళ్ళ పొలంలో ఎన్నో కలల విత్తనాలను నాటుకుని
గుండెలపై గుదిబండను మోసుకుతిరుగుతున్న
ఆ పాదాలకు ఇప్పుడొక కొత్తదారులు కావాలి
రేయి పగలును ఒకటిగా చేసి
బద్ధకంగా కదులుతున్న దూరాల్ని పాదాలకు వదిలి
బాధల్ని పంటి బిగువున పాతిపెట్టి
పేగులు చేస్తున్న కీచురాళ్ల ధ్వనిని భరిస్తూ
అనునిత్యం అంతరాయాల ముళ్ల కంచెలు
వీపుకు రాచుకుంటున్నా
గాజుపెంకులై విలవిలమంటున్న
ఆశల మోసులపై కాలు మోపుతూ
దిగులు సంచుల్ని నెత్తికెత్తుకుని
ముందుకు సాగుతున్న ఆ ఎముకలగూళ్లకు
ఇప్పుడొక కొత్తదారులు కావాలి
దారి పొడవునా రోడ్లన్నీ
అగ్గిజ్వాలలతోటి కాళ్ళను కడుగుతున్నా
శ్వాసలన్నీ మరణం అంచున వేలాడుతున్నా
పాతదారులతో పోరాడి
ఆకలితో అస్తమిస్తూ
విశ్రమించకుండా ఉదయిస్తున్న
ఆ కర్షక సూర్యులందరికి
ఇప్పుడొక కొత్తదారులు కావాలి

అలుపెరుగక చేస్తున్న ఆ తెరువరుల పాదయాత్రలో
ప్రవహిస్తున్న కన్నీళ్ల కొలనులో
ఆకలి అలలు వెంబడిస్తున్నా
వలస నావపై ఇంటి తీరాన్ని చేరాలని తపిస్తున్న
ఆ ఊపిరున్న శవాలకు ఇప్పుడొక కొత్తదారులు కావాలి

ఆకలనే చిరునామా లేని దిక్కుకు దారిచూపి
నోరు తెరచి రక్తం కక్కుతున్న ఆ పాదాల బీళ్ళకిప్పుడు
ఆకుపచ్చని తివాచీని పరిచే కొత్తదారులు కావాలి