నేనెవరు?

-  సింహాద్రి శిరీష

9866689326

ఒక్క ప్రేమ
నా కళ్ళకు మైకం తెప్పిస్తే
ఓ పురుషుడిని మహానుభావుడిగా చూపిస్తే
ఒకే ఒక్క ప్రేమ
ఆదర్శాల వెలివేతలతో
స్త్రీ పురుషుల సమానత్వమే
తన వైఖరి అని నమ్మబలికితే
ఒక్క పెళ్ళి
సమాజానికి మనమే ఆదర్శ ప్రాయమౌతామనే
ప్రమాణాల దగ్గర ఆరంభమైతే...
నిజమేనేమో అనుకున్నా
బహుమతుల పేరుతో
భర్త వేస్తున్న ఎరలలో
చిక్కుకు పోతూ ఉన్నా... నిద్రపోతూనే ఉన్నా
క్రమక్రమంగా నా ఉనికికి
అడ్డుకట్ట పడిపోతున్నా
కనీసంగా గుర్తించలేని స్థితిలో ఉన్నా
నన్ను నన్నుగా పిలిపించుకోలేక
ఆయనగారి భార్యగా బిరుదుపొందా
పేరుకు ఇంటిపేరు నాదే అయినా
అది కాగితాలలో పనికిరాక
ఎక్కడా చెల్లుబాటు కాక
నలిగిన నా హృదయపు మడతల్లో
చిరుగులు పడనీయక దాచుకున్నా
అంతలో ఓ పసి ప్రాణం నా కడుపులో
ఊపిరి పోసుకోవటం చూశా
నా శరీరంలో ఓ భాగం కావటం చూశా
నా ఆత్మలో సంలీనమవటం చూశా
నా రక్తమాంసాలను ఆ ప్రాణికై ఉంచా
నా ఆహారంతో ఆ ప్రాణిలో ఊపిరి నింపా
నెలనెలకీ నాలో పెరుగుతున్న బరువును
బ్రహ్మానందంగా లెక్కలేసుకున్నా
అస్తవ్యస్తంగా మారిన నా శరీరాకృతిని
ఆరాధనగా తడిమి చూసుకున్నా
కానీ ఒక్క మాట ఒకే ఒక్క మాట
అర్థం కాలా...
ఓ పూర్ణ పురుషుడు నా ఉనికిని తుడిచేస్తే
అతని ఒక్క వీర్యకణం
నా కడుపులోని నలుసును
నరావతారం ఎత్తే లోపే...
ఆ కణానికి కూడా ఓ ఉనికిని ఎలా ఇచ్చిందని?
నా ఉనికిని ఎలా చెరపగలిగిందని?
నెలలు నిండి నొప్పులు మొదలైతే బాధగా ఏడవలా...
ఈ సృష్టిలోకి అడుగుపెట్టబోతున్న
నా ప్రతిసృష్టిని నవ్వుతూ ఆహ్వనించా
శరీరం పచ్చిపుండులా అయినా
పసిపాప బోసి నవ్వుల్లో సత్తువ కూడగట్టుకొని
గుండెలకు హత్తుకున్నా
బాధనంతా ఆ స్పర్శతో తుడిచేశా
రక్తాన్ని పాలుగా మార్చి పసి ఆకలి తీర్చా
కానీ ఎదుగుతున్న నా కూతురికి
నాన్నే ఒక హీరో అమ్మ ఉత్త జీరో
అంతలో మరో ప్రాణం...
కొడుకు రూపంలో ఒడి చేరినా
తన చిన్ని చిన్ని పాదాలతో నా ఒడిలో ఆడుకున్నా...
ఏదో తెలియని దిగులు
బంధాన్ని పెంచుకోవాలన్నా ఏదో తెలియని అదురు
ఎందుకంటే ఎందుకూ అంటే...
రెండు సార్లు రెండు జన్మలెత్తినా
ప్రాణాన్ని పాశంగా మార్చినా
కూతురేమో మొగుడి వారసత్వాన్ని
ఇంటిపేరుగా మార్చుకుపోతే..
కొడుకేమో.. తండ్రి వారసత్వాన్ని
తన భార్యకు బంధంగా చొప్పిస్తే
ఇంత కథలో ఎంత వ్యథతో
నేనెక్కడున్నాను? నేనెక్కడున్నాను?
నా ఉనికి ఏంటి?
అసలు నేనెవరిని?