నవ్వు

డా. పాతూరి అన్నపూర్ణ
94902 30939

నవ్వితే మర్చిపోయిన బాల్యం కానరావాలి
నవ్వుకెంత శక్తి వుందో!
శిశువు పెదాలపై చిగురించే గోరంత నవ్వు
అమ్మ కళ్ళలో దీపాలు వెలిగిస్తుంది
ఇద్దరి మధ్య మాటల్లేని మౌనం
గోడల్లే పెరిగినప్పుడు
నవ్వు చేసే మంత్రంతో మాయమౌతుంది
ఆకాశం కేసి చూసి చూసి
అలసిన కళ్ళకు ఆహ్లాదంగా
నల్లటి మేఘం కనిపించినప్పుడు
రైతు పెదాలపై విరుస్తుందో నవ్వు
మురిసిపోయి కురిసిన వర్షం
పంటచేను పచ్చటి నవ్వవుతుంది
ఒక అపార్థాన్ని మాయం చేసేందుకు
నవ్వు మందులా మారుతుంది
దూరాన్ని దగ్గర చేసేందుకు
గుండెల్లోంచి నవ్వు మొలకెత్తాలి
యాంత్రికమైన జీవనంలో ఏరుకునేందుకు
కొన్ని క్షణాలు కావాలంటే
అప్పుడప్పుడు పెదాల పైన
నవ్వులు పూసే సమయాలు రావాలి
మనసు అద్దంలో
నవ్వు మసకబారకుండా చూసుకుంటే
బతుకు బాటలో కన్నీరు కూడా
పన్నీరుగా మారుతుంది!