ఎడారులన్నీ ఒకటి కాదు

కవిత

- అడిగోపుల వెంకటరత్నం - 9848252946

నేలను ఆక్రమించి
ఇసుక పరుపులు పరిచి పండుకున్న
ఎడారుల్ని వీక్షించటానికి...
రేణువుపై రేణువు నిలిచి
గాలిగోపురాలైన
ఇసుకమేటల్ని చూడ్డానికి
ఏ అబుధాబీనో
అరబ్‌ దేశానికో వెళ్ళక్కరలేదు

బిందువైన మనిషి చుట్టూ
వలయాలైన ఎడారులు
అన్ని ఎడారులు ఒకటి కాదు!

పుట్టింటి సంపద మోసుకొచ్చిన నదులు
అత్తింటి సముద్రానికి అర్పిస్తే
అప్పనంగా ఆకాశానికి అప్పగించింది
ఆవిరి మేఘాలుగా మారి
ఆకాశానికి వెండి తాపటాలై
చినుకు రాల్చని ఎడారులైనాయి!
మాగాణి పుణ్యభూమిపై
రైతు వరుణ జపం చేస్తుంటే
అర్ధాంగి శునాదేవి సమేతుడై
చినుకు ప్రసాదించని వరుణుడు
పుణ్యక్షేత్రాలకు పరుగులు!
ఎడారి మాగాణిని
కన్నీటితో తడుపుదామన్నా
కనురెప్పలు దాటని నీరు
కనుగుంటల్లో యింకాయి!
భవతీ భిక్షాందేహియన్న
ఎండిన డొక్కల ఏడ్పువిని
ఎంతకూ ప్రతిస్పందించని
ఇంటి హృదయం నిండా
నిర్దయ ఎడారి నిండుతుంది!
సముద్రాన్ని గుప్పిట పట్టిన ఆవర్తిని
నేలపై కక్షగట్టి
మానవాళి క్షయంకోరి
చరాచరాల్ని ధ్వంసిస్తూ
తుపాను ఎడారి కమ్ముకుంది!
మనిషి ఎడారి
ఇసుక రేణువు కావద్దంటూంది
ఎడారికింద దాగిన మాగాణిని
సస్యశ్యామలం చెయ్యమంటుంది!