కరోనా కలకలం దృశ్యరూపం...

- ఇనాయతుల్లా

9849367922

2007లో ఒకసారి, 2009లో మరోసారి కర్నూలు జిల్లాను వరద చుట్టుముట్టి జన జీవితాన్ని అతలాకుతలం చేసింది. జిల్లాలో సాధారణ జన జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. 2009 అక్టోబర్‌ 2 రాత్రి టీవీ ఛానళ్లు ఉదయం నిద్ర లేచేటప్పటికి ఆంధ్రప్రదేశ్‌ చిత్రపటం నుండి కర్నూలు మాయమవుతుందేమోననే సందేహాత్మక, సంచలనాత్మక వార్తలు ప్రసారం చేసి ఈ జిల్లా జనాన్ని భయాందోళనలకు గురి చేశాయి. సగం కర్నూలు నగరం శివారులో ఉండే జగన్నాథగట్టు ఎక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు అప్పుడు కర్నూలు వైపే చూశారు. సరిగ్గా ఇదే పరిస్థితిని గుర్తు చేసిన మరో సందర్భం 2020 ఏప్రిల్‌, మేలో కర్నూలులో సంభవించింది. అదే వాట్సప్‌లో, ఫేస్‌బుక్‌లలో వైరల్‌ అయిన వైరస్‌ వార్త. కర్నూలులో కరోనా సృష్టించిన కల్లోలం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ ఎల్లలు దాటి భారతదేశమంతా ప్రాకింది. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన జిల్లాగా భారతదేశంలోనే అత్యంత వేగవంతంగా కరోనా వ్యాపిస్తూ విజృంభిస్తున్న జిల్లాగా కర్నూలు నమోదైంది. ఈ కల్లోలాన్ని, కలవరాన్ని, కాఠిన్యాన్ని, కారుణ్యాన్ని తన కలంలోనికి ఒంపి కల్లోలం పేరుతో పద్య శతకాన్ని జనం ముందుకు తెచ్చారు తెలుగు పద్య ప్రేమికులు పత్తి ఓబులయ్య గారు. కర్నూలు పౌరాణిక నాటక రంగాన్ని వేలుపట్టి నడిపించి రంగస్థలాన్ని రంగులమయం చేసి పద్య నాటకానికి పెద్ద పీట వేసి ఆంధ్రప్రదేశ్‌ నాటక రంగంలో కర్నూలు జిల్లాకొక ప్రత్యేకతను సంతరింపజేసిన పత్తి ఓబులయ్య ఓ నడిచే నాటక సమాజం. నిత్యం గలగల పారే పద్యనాటక నయాగారా. కర్నూలు జిల్లాను మార్చి 22 అనంతరం చుట్టిముట్టిన కరోనా వరద కెరటాల ఉధృతి దృశ్యాన్ని పత్తి ఓబులయ్య గారు 'కల్లోలం' శతకంలో హృదయ విదాకరంగా ఆవిష్కరించారు.

పొద్దుపొడుపులో సూర్యుని లేలేత కిరణాలు నేలను ముద్దాడుతున్న వేళ 'వాకింగ్‌ పేరుతో వరసలు వరసలుగా నడక సాగించే సమూహాలను మాయం చేసిన కరోనా కల్లోలం.. రెండు గ్లాసులను వడివడిగా తిప్పుతూ వేడి వేడి చాయ్‌ను నోటికందించే కాకా హోటళ్లను కబళించిన కరోనా కల్లోలం.. వీధి చివరల్లో వేడి వేడి పెనంపై పలుచటి సలాకితో ఆటు ఇటు తిరుగుతూ నోరూరించే దోశెలను, పొంగనాలను, పునుగులను బంధించి వేసిన కరోనా కల్లోలం.. మాయామేయ జిలుగులతో, తళుకులతో అందరినీ పిలిచి పిలిచి ఆకర్షించే షాపింగ్‌ మాల్స్‌ను, రెస్టారెంట్లను, థియేటర్లనూ, ఒక్కటేమిటి గుడిమెట్ల కాడ చిల్లర చప్పుళ్లు చేసే బచ్చెల బిచ్చగాళ్లను, ఫుట్‌పాత్‌పై మళ్లీ మళ్లీ మూలిగే మూడుకాళ్ల ముసలమ్మలను ఏకబిగిన ఎన్‌కౌంటర్‌ చేసిన కరోనా కాఠిన్య కల్లోలాన్ని ఓబులయ్య కళ్లకు కట్టినట్లు ఈ శతకంలోని ప్రతీ పద్యంలో చిత్రించారు.

ప్రారంభంలో కర్నూలు ప్రాభవం..

పత్తి ఓబులయ్య కలోల్లం శతక ప్రారంభంలోని పద్యాలలో కర్నూలు ప్రాభవాన్ని చాటి చెప్పారు. శ్రీశైలం, అహోబిలం, మంత్రాలయం, కాల్వబుగ్గ, యాగంటి, మహానంది, కొండారెడ్డి బురుజు ఘనకీర్తులను, అవి సాధించిన రాష్ట్ర వ్యాప్త యశస్సును పత్తి ఓబులయ్య గారు గుర్తు చేశారు.

''వాసి తెలుగువారి మొదటి రాజధాని

జనము జేజేలు పల్కిన రాజధాని

వసుధ సోనా మసూరికి రాజధాని

రాష్ట్రమందు నేడు కరోనా రాజధాని''

అంటూ పత్తిఓబులయ్య గారు గతంలో తెలుగు వారి తొలి రాజధానిగా ఘనత వహించిన కర్నూలు నేడు కరోనా మహమ్మారి వ్యాప్తికి రాజధానిగా మారిన విషాదాన్ని ఈ పద్యంలో వివరించారు. భారతదేశంలో సోనామసూరి బియ్యానికి పుట్టినిల్లుగా గుర్తింపు పొందిన కర్నూలు నేడు కరోనా వ్యాధి వ్యాప్తితో అగ్రస్థానంలో ఉండడం దురదృష్టం.

ఎప్పుడు పుట్టెనో... ఎక్కడ వీచెనో... దేశాలు దాటెను.. దిశలు మారె... రూపము లేదు.. విరూపియై భయపెట్టి.. అంటూ కవి ఒక సీస పద్యంలో కరోనా వైరస్‌ విజృంభణను సవివరంగా చిత్రించారు. చైనాలోని వూహాన్‌లో పుట్టి దేశాలు దాటి దిశలు మారి లక్షలాది ప్రాణాలను బలిగొన్న కరోనాకు ఒక రూపం లేదు. ప్రపంచానికి శాపంలా పరిణమించిందని ఆయన తెలియజేశారు. ఏ రూపమూ లేని కరోనా ప్రపంచంలో ఎన్నో ప్రాణాలను నామరూపాలు లేకుండా చేసింది. ఓబులయ్య కరోనా సృష్టించిన కల్లోలంలో అత్యంత హృదయ విదారకరమైన ఘటన వలస కార్మికులదని తన పద్యాలలో వివరించారు. కార్మికులాకలిన్‌ వలసకై జని.... దుర్భర జీవితమ్ములన్‌.. ఘర్మజలంబు చిందగను.. కాలము సాగదు భారమై వెతల్‌ ఖర్మ... అంటూ ఆయన వేలకు వేల మైళ్ల దూరాలను వాళ్ల దేహాలతో కొలుస్తూ, రైలు పట్టాలనే  పాన్పులుగా భావించి కనిపించిన చెట్టు పుట్టను విడిదిగా భావించి తమ ఇళ్లకు చేరుకోవడానికి నానా యాతన పడిన దృశ్యాన్ని ఈ పద్యాలలో గుర్తు చేశారు.

కరోనా ధనిక దేశాలను, దేశాల రాజులను మొదలుకొని రోడ్డుపైని సాదాసీదా మనుషులను కొండ చిలువలా చుట్టుముట్టి ఊపిరాడకుండా చేసి తుదకు ప్రాణాలను గాలిలో కలిపేసింది. మనిషి తన వికృత చేష్టలతో గాలిని, వాతావరణాన్ని లుషితం చేయడంతో తత్ఫలితంగా ఉద్భవించిన కరోనా వైరస్‌ మనిషి ప్రాణాలను గాలిలో కలిపేస్తోందన్న నిజాన్ని గ్రహించాల్సిన ఆవశ్యకతను ఈ కల్లోలం శతకం గుర్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచమంతా స్మశాన వైరాగ్యం పర్చుకుందని, రహదారులు నిర్మానుష్యమై గుండెలు పిండే హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయని ఆయన ఈ పద్యంలో ఎంత చక్కగా వివరించారో చూడవచ్చు. స్ఫూర్తి కొండారెడ్డి బురుజు పౌరుషమును గుర్తుకు తెచ్చెను కోట నేడు... రహదారులెల్లను రాకపోకలు లేక వెలవెలపోయెను వెతలనిండి.. తుంగభద్ర తరంగ తోయము తీయని మాలిక లేకను మలినమయ్యే... అంటూ ఈయన రాసిన ఈ పద్యం నిర్భంధంలో చిక్కుకున్న మనిషి దైనందిన జీవిత దృశ్యాన్ని చిత్రిస్తోంది.

అన్నదమ్ముళ్ల మైత్రికి యడ్డునిలిచె.. అక్కచెల్లెళ్ల యనుబంధ మాగిపోయే.. తండ్రి కొడుకుల బంధుము దైన్యమొందె.. రోధనలు మిగిలెనట కరోన తోడ... అనే ఈ పద్యంలో పత్తిఓబులయ్య కరోనా సృష్టించిన కల్లోలంలో కుటుంబాల మధ్య మనుషుల మధ్య ఏర్పడ్డ అగాధాలను గురించి తెలిపారు. అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెళ్లు, తల్లిదండ్రులు మధ్య ఉండాల్సిన ఆత్మీయ బంధాలు కూడా కరోనా సృష్టించిన భౌతిక దూరంతో కరువైపోయాయని తెలియజేశారు. కరోనాతో బాధితులైతే రక్తబంధాలను సైతం దూరంగా ఉంచడం, కరోనాతో మృతి చెందితే అంత్యక్రియలకు సైతం చేయకుండా రక్తసంబంధీకులే దూరం పాటించే ఒక అమానుష పరిస్థితి నెలకొనడం చాలా శోచనీయమని ఈ పద్యం తెలియజేస్తోంది.

కర్నూలు కారుణ్యమూర్తి డా|| ఇస్మాయిల్‌కు పద్య నివాళి..

కర్నూలు జిల్లాలో డా|| ఇస్మాయిల్‌ పేరు వినని వారు ఉండరు. పేదల డాక్టర్‌గా ఈ జిల్లా వాసుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న డా|| ఇస్మాయిల్‌ కరోనా బారిన పడి పరమపదించడంతో కర్నూలు నేలతల్లి కన్నీరు కార్చింది. ఆయన అసాధారణ వైద్య సేవలను కొనియాడుతూ కవి ఈ కల్లోలం శతకాన్ని ఆయనకు అంకితం ఇవ్వడం అభినందనీయం. నడిరేయి దాటినా నవ్వుచు వైద్యము పేదలకందించు పెన్నిధియన.. రెండు రూకలసగ రెండేళ్లు వరుసగా వైద్యమందించు వైద్యుడతడు.. కర్నూలు నగరాన కల్పవృక్షము... నిరుపేదల కుటుంబాల వెలుగతుండ.. అంటూ పత్తిఓబులయ్య గారు ఈ శతకం ఆరంభంలోనే ఆయనకు పద్య నివాళి అర్పించారు. నగరంలోని వన్‌టౌన్‌లో 1970 దశకం నుండి రెండు రూపాయల డాక్టర్‌గా పేరొందిన ఇస్మాయిల్‌ గారు నగర వాసులకు ఆరాధ్య వైద్యుడయ్యారు. టోకెన్‌  తీసుకొని గంటలు గంటలు నిరీక్షించి డాక్టర్‌ దర్శనం పొందే విధానానికి ఆయన వ్యతిరేకి. బయట బెంచీలపై కూర్చున్న రోగుల వద్దకు తానే వచ్చి వైద్యం అందించి ప్రాణభయం పోగొట్టిన కర్నూలు ఇంటి వైద్యుడు డా|| ఇస్మాయిల్‌. కల్లోలం శతకంలో పత్తిఓబులయ్య గారు సీసం, తేటగీతి, కందం, ఉత్పలమాల, ఆటవెలదులతో మనోరంజిత పద్యరచన చేశారు. ఏకబిగిన చదివించే లక్షణం    ఉన్న ఈ శతకం పదికాలాల పాటు నిల్చిపోతుందని ఆకాంక్షిద్దాం.!