'రాత్రి సూర్యుడు' ఆవిష్కరణ

సామాజిక ప్రయోజనాలతో కూడిన కవిత్వం అన్ని విధాల రాణిస్తుందని, అలాంటి కవితలను రచనలను వెలుగులోకి తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉంటుందని రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖా మంత్రి ధర్మాన ప్రసాద్‌ రావు కోరారు. హైదరాబాదులోని శ్రీ త్యాగరాయ గాన సభావేదికపై మార్చి 13న అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన కెరె జగదీష్‌ రచించిన 'రాత్రి సూర్యుడు' దీర్ఘ కావ్యం పుస్తకం మరియు ఆడియో బుక్‌ ఆవిష్కరణోత్సవ సభ జరిగింది. ఈ సభలో రాత్రి సూర్యుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన ధర్మాన ప్రసాద్‌ రావు తమ ప్రసంగంలో సమాజంలోని అంధుల జీవితాలలోకి పరకాయ ప్రవేశం చేసిన కెరె జగదీష్‌ ఇంతటి గొప్ప కావ్యాన్ని రచించడంలో విజయం సాధించడం అభినందనీయమని అన్నారు. కన్నడ మాతృభాష కలిగిన కుటుంబంలో పుట్టిన కెరె జగదీష్‌ తెలుగు భాషలో ప్రావీణ్యత సాధించి తమ రెండవ పుస్తకంగా రాత్రి సూర్యుడు దీర్ఘకావ్యాన్ని పూర్తి చేయడం హర్షణీయమని అన్నారు. ఈ ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో విశిష్ఠ అతిథిగా పాల్గొన్న ఐ.ఎఫ్‌.ఎస్‌. అధికారి - బుడిగి శ్రీనివాసులు రెడ్డి (న్యూడిల్లీ) మాట్లాడుతూ సృష్టిలో అంధత్వం ఒక శిక్ష అయినప్పటికీ ఆ శిక్షను జీవన సాఫల్యం మరియు జీవన లక్ష్యం సాధించేందుకు శిక్షణగా మార్చుకుని ముందడుగు వేస్తే అంధత్వం అడ్డురాదని తెలిపారు. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉన్నట్టే అంధులకు దృష్టిలోపం ఉంటుందని అంత మాత్రాన అంధులను నిర్లక్ష్యం చేయడం సభ్య సమాజానికి తగదని అన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన సాంస్కృతిక శాఖ సలహాదారులు డా|| కె.వి. రమణాచారి మరియు సాంస్కృతిక శాఖ సంచాలకులు డా|| రాళ్ళ బండి కవితా ప్రసాద్‌లు తమ ప్రసంగాలలో రాత్రి సూర్యుడు దీర్ఘ కావ్యం సాహిత్య రంగంలో ఒక గొప్ప కావ్యంగా మిగిలిపోతుందని, అంధుల జీవితాలను వస్తువుగా తీసుకున్న గొప్ప భావ చిత్రాలతో చక్కని కావ్యాన్ని రచించిన కెరె జగదీష్‌ అభినందనీయుడని తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ సభలో కవి, సీనియర్‌ జర్నలిస్టు బిక్కికృష్ణ రాత్రి సూర్యుడు పుస్తకాన్ని సమీక్షించగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహిత డా|| దీర్ఘాషి విజయభాస్కర్‌, ప్రముఖ కథకుడు డా|| శాంతి నారాయణలతో పాటు చైతన్య ఆర్ట్స్‌ థియేటర్‌ వ్యవస్థాపకులు కె.కె. రాజు తదితరులు ప్రసంగించారు. ఈ సభాకార్యక్రమంలో భాగంగా 'రాత్రి సూర్యుడు| కావ్యకర్త కెరె జగదీష్‌ దంపతులను మంత్రి ధర్మాన ప్రసాద్‌ రావు, కె.వి రమణాచారి, రాళ్ళ బండి కవితా ప్రసాద్‌, దీర్ఘషి విజయభాస్కర్‌, డా|| శాంతినారాయణ తదితరులు గజమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.