పోతగాని
9441083763
వాడి ఆగమనానికి అంగీకార నగారా మోగింది
పచ్చని జీవన పచ్చికలో దుమ్ము సుడులు తిరిగింది
డేగాసురుడి ఆకలి తీర్చేందుకు
ఈ సారి చిల్లర జీవాల వంతొచ్చింది
చమురు సముద్రాలెన్నో మింగిన
అడుగు లేని కడుపు వాడిది
శాంతి నెపంతో స్మశానాలు సృష్టించిన
అడగరాని ఘనత వాడిది
వాడు ఆరేసుకున్న రెక్కల నీడల్ని మోస్తున్న దేహాలన్నీ
అనివార్యంగా బతుకుదెరువును ఆవిరి చేసుకొని
చరిత్ర నూతిలోంచి జ్ఞాకాలను తోడుకుంటూ
కదలలేక కదులుతున్న కళేబరాలు
వాడి అదుపులేని పెత్తనాన్ని సహిస్తున్న మౌనాలన్నీ
సందిగ్ధ సంధ్యల్ని భుజానికెత్తుకొని
చీకటి ఉబిలోకి జారిపోతూ
మిణుగురు వెలుగుల్ని స్వప్నిస్తున్న ఆర్తనాదాలు
దుకాణం తెరిచింది మొదలు
దిక్కులన్నీ పిక్కటిల్లే దిగంబర ప్రకటన
కోరికల్ని గుర్రాలను చేసి బరిలోకి దూకిస్తుంది
కొనడాన్ని కొలబద్ధను చేసి
సరుకులతో మనిషికి వెలకడుతుంది
ప్రచారం డాంబికంగా సాగుతుంది
ప్రభావం డాలర్లై పండుతుంది
లాభాలను శ్వాసించే గ్లోబల్ వ్యాపారికి
ఎర్ర తివాచీలు పరిచే ఏలికల దాష్టీకానికి
అప్యాయంగా ఆదుకున్న పచారీ కొట్లు
చెల్లిపోయిన చిల్లర పైసలై
చిరునామా కోల్పోతుంటే
మనుషులే సరుకులై ప్రాఫిట్ల రాకెట్లలో
ఇంధనాలై మండుతుంటారు
భూమి కూడా సరుకుల చుట్టూ
గిరికీలు కొడుతుంది
ఏ పాపం ఎరుగని కాలం
మూలాలను గుర్తు చేస్తూ
తూర్పు దిక్కుకు ప్రవహిస్తుంది
మార్పు వచ్చేది, రావాల్సిందీ
తూర్పు నుంచే కదా!