- డా యర్రదొడ్డి సుభాషిణ
కుటుంబంలో పిల్లలు పాడైపోయినా లేదా అభివృద్ధి మార్గంలో పయనించినా దానికి కారణం తల్లిదండ్రులే, అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులు, కొన్ని సంఘటనలు బాల్యంలో ప్రధాన కేంద్రమైన మనసుపై పడే ప్రభావాన్ని మార్చడం సాధ్యం కాదని 'మానిని - మనసు' 'మనసు కథ' నవలలు నిరూపిస్తున్నాయి.
మానవుడి జీవితం చాలా అందమైంది , విలువైంది , బాల్యం మరీ విలువైంది. మనిషి హృదయంలో ఒక మందిరం లాంటి జ్ఞాపకం, ఒక స్వర్గం లాంటి కానుక బాల్యం. అతిసున్నితమైన ఈ బాల్యం అమాయకత్వానికి , మంచితనానికి మారుపేరు లాంటిది. ఇలాంటి బాల్యం కుటుంబంలో ఒక భాగం. కుటుంబ ప్రభావం బాల్యం ప్రవర్తనలో కనిపించకుండా అంతర్గతంగా నిలిచిపోయే ఆలోచనలు బాల్యాన్ని తీర్చిదిద్దుతాయి. ఒకే కుటుంబంలో వ్యక్తులు రకరకాలుగా ప్రవర్తిస్తారు, ఎక్కువ తక్కువ, బీదగొప్ప, సమర్థ అసమర్థులుగానూ ఉంటారు. ఇవన్నీ బాల్యం పై అమితమైన ప్రభావాన్ని చూపి పిల్లల మనసుపై గాఢమైన ముద్రవేస్తాయి . పాత్రల పరస్పర సంబంధములను వ్యక్తమొనర్చునట్టి సూక్ష్మతత్వము వాతావరణము . పాత్ర పోషణము ప్రభావవంతముగా జీవవంతముగా నొనర్చుటకు వాతావరణ నిర్మాణమావశ్యకము. సంక్షేపమున వాతావరణము నిశ్చిత స్థాన సమయములిందు సంఘటించు కథాగతి నాటకీయ సంఘటనల యొక్క ఉద్రిక్త గుణాభివ్యక్తి వాతావరణము (ఊనీలి జుజీశి బిదీఖి లీతిరీరిదీలిరీరీ ళితీ రీశిళిజీగి గీజీరిశిరిదీవీ ఇ.ఔ.ఆరిశిదిరిదీ ఆవీ: 139-194) ఒకరికొకరికున్న సంబంధాన్ని తెలిపేదే వాతావరణం. తమచుట్టూ ఉన్న పరిస్థితులు బాల్యం పై చూపేదే వాతావరణం. ఇలా కుటుంబ వాతావరణం బాల్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో వాసిరెడ్డి సీతాదేవి నవలల్లో పరిశీలిద్దాం .
బాల్యంలో ఎదురయ్యే సంఘటనలు :కుటుంబంలో పిల్లలు పాడైపోయినా లేదా అభివృద్ధి మార్గంలో పయనించినా దానికి కారణం తల్లిదండ్రులే , అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులు , కొన్ని సంఘటనలు బాల్యంలో ప్రధాన కేంద్రమైన మనసుపై పడే ప్రభావాన్ని మార్చడం సాధ్యం కాదని 'మానిని - మనసు' 'మనసు కథ' నవలలు నిరూపిస్తున్నాయి.
''మానిని - మనసు'' నవలను ఆమె కథగా కె. రాఘవేంద్రరావు గారు సినిమా తీశారు . ఈ కథ ఎంతో వైవిధ్యభరితం కావడంతో అప్పట్లో బాగా జనాదరణను పొందింది . ఈనవలలో సావిత్రి బాల్యంలో జరిగిన ఒక సంఘటన తనని , మానసిక రోగిగా మార్చివేస్తుంది . ఆమె బాల్యంలో తన అత్తను మామయ్య ఎప్పుడూ కొట్టడం , గొంతుపట్టుకొని హింసిస్తూ ఉండడం చూసిన ఆమె తన మనసులో , మగాడంటే ఇలానే ఉంటాడు అనుకొని ప్రతి మగాణ్ణి అనుమానించేది. అనుమానం పెనుభూతమన్నట్లు ఆ అనుమానం తన స్నేహితురాలి జీవితాన్ని కూడా పాడుచేస్తుంది. తెలిసీ తెలియని లేత వయసులో ఎదురైన సంఘటనలు వాళ్ళ జీవితాన్నే కాకుండా పక్కవారి జీవితాలని బలిగొంటున్నాయి. 'వాతావరణము పాత్రల మనోవ్యాపారములకు సంబంధించినదై యుండును. సాధారణ పాఠకుడు కాని , క్రొంగొత్త రచయిత కాని పరిసరమునే వాతావరణమని తలచును. కాని ఇది వారి భ్రాంతి మూలకము. వాస్తవమరసి చూచిన వాతావరణము
పరిసర చిత్రణ జనితమగు ప్రభావము'' అన్న పిట్కెన్ గారి మాటలు సావిత్రిలో స్పష్టపరుస్తున్నాయి. ఆ వాతావరణం పాత్రల మనసుపై గాఢమైన ముద్ర వేస్తోంది. ''మనసు కథ'' నవల కూడా ప్రజాదరణ పొందిందే. ఈ నవల కూడా దాదాపు మానిని - మనసు లాంటిదే. ఇందులో సుజాత బాల్యంలో తండ్రి మరొక స్త్రీ తో సంబంధం పెట్టుకోవడం, తల్లిని నిర్లక్ష్యం చేయడం, ఆమెను హింసిస్తూ చివరికి చంపేయడం వంటి సంఘటనలన్నీ చూసి తన తల్లి దూరం కావడానికి తండ్రే కారణమయ్యాడని కృంగిపోతుంది. చివరికి మానసిక వ్యాధిగ్రస్తురాలవుతుంది. ''శైశవ థలో కలిగిన అనుభవాలు, అనుభూతులుగా జ్ఞాపకంలో నిక్షిప్తమవుతాయి. పసితనంలో ఆత్మాభిమానం దెబ్బతింటే అది నయమవని గాయంగా జీవితాంతం బాధపెడుతూ ఉంటుంది. అట్టి మచ్చలు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తాయి.'' (అట్లూరి వెంకటేశ్వర రావు. పుట :5 : 2003) అది అక్షరాలా సత్యమన్నది ఈ రెండు నవలలు స్పష్టం చేస్తున్నాయి. ఏ రచయిత అయినా, రచయిత్రి అయినా వాస్తవాన్ని గాలికి వదిలి ఊహా జగత్తులో విహరించకూడదు. నిత్య జీవితంలో జరిగే సంఘటనల్ని, సమాజాన్ని నేపథ్యంగా తీసుకొని వ్యక్తుల జీవితాన్ని వారి మానసిక వేదనల్ని , ఆవేదనల్ని చిత్రించాలి. అప్పుడు అది సమగ్రరచన అవుతుంది. సమాజానికి ఉపయోగపడుతుందంటారు ఎ. రజాహుస్సేన్ (సాహిత్య వ్యాసాలు - పుట. 90 : 2006) అలాంటి రచనే వాసిరెడ్డి సీతాదేవి గారిది.
మనస్తత్వ శాస్త్రాన్ని విశ్లేషించడానికి ప్రధానంగా చెప్పదగిన వాడు సిగ్మండ్ ప్రాయిడ్ . మానవుడిలోని అతార్కిక ఆలోచనను ఫ్రాయిడ్ 'లిబిడో' అన్నాడు. 'లిబిడో' లో తల్లిదండ్రుల పట్ల ఏర్పడే స్థిరమైన భావం వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది. ఈ లక్షణం ప్రధానంగా సుజాత పాత్రలో కనిపిస్తుంది. సుజాత తల్లి దూరం కావడంతో తనకు నచ్చిన వస్తువులు తనే పడేసి ఎవరో కావాలని పడేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసేది. ఒక రకమైన మానసిక అశాంతితో తన జీవితాన్ని సాగిస్తూ బ్రతుకుతుంది.
మానవ జీవితమంతా కేంద్రీకృతమయ్యేది ఆకలి దగ్గరే. ఆకలి మనిషి జీవితాన్ని నిర్దేశిస్తుంది, చేయాల్సింది శాసిస్తుంది. పరిధి నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్కరూ తమపరిధిలో తిండి కోసం ప్రయత్నిస్తారు. పేదరికంతో ఈ ఆకలి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తుంది. దాని బారి నుండి తప్పించుకోలేక ఆ ఆకలి తీర్చుకోలేక సతమతమయ్యే పేదరికం బాలలపై నిగూఢ ప్రభావాన్ని చూపిస్తుంది. గురజాడ సృష్టించిన పాత్రల్లో పూర్ణమ్మ చిరస్మరణీయమైంది. సామాజిక సమస్యల కొలను నుంచి పుట్టుకొచ్చిన పాత్ర పూర్ణమ్మ. ఆనాడు పేదరికం కారణంగా పూర్ణమ్మను కన్యాశుల్కానికి ఆశపడి తల్లిదండ్రులు అమ్ముకున్నారని గురజాడ చెప్తే...
నేడు నవయుగ రచయిత్రి మహజబీన్ '' స్ట్రీట్ చిల్డ్రన్ '' కవితలో పాలు తాగే పసి వయసులో పాల కవర్ల వేట'' అంటూ పేదరికాన్ని పేర్కొంటే ......
వాసిరెడ్డి సీతాదేవి తన నవలల్లో అదే పేదరికంతో పిల్లల ఆకలి బాధ తీర్చలేక ఏమి చేయాలో తోచక వారిని కొట్టి నిద్రపుచ్చడాన్ని చిత్రీకరించారు. అది మృగతృష్ణ నవలలో స్పష్టంగా ఉంది.
'మృగతృష్ణ' నవలలో సునంద బాల్యంలో తల్లిదండ్రులు రోజూ గొడవ పడటం , నాన్న వస్తే బియ్యం తెస్తాడు . అమ్మ వండి పెడుతుందనే ఆశతో ఎదురు చూసి , చివరకు తండ్రి రాకపోవడంతో తల్లి పిల్లలందరినీ కొట్టి పడుకోబెట్టేది. పిల్లలు ఆకలితో ఏడ్చిఏడ్చి నిద్రపోయేవారు. పండుగకు స్నేహితులంతా పట్టులంగాలు వేసుకొంటుంటే తల్లిదగ్గర ఏడ్చి మరీ తెచ్చుకున్న మాములు లంగా టైలర్ కుట్టివ్వక పోవడంతో నిరాశే మిగులుతుంది . ఇవన్నీ చూసిన సునంద మనసుపై గాఢమైన ముద్రవేశాయి కుటుంబ పరిస్థితులు. తను ప్రేమించిన వ్యక్తిని చేసుకుంటే ఇదే పరిస్థితి తను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని, తనకిష్టం లేకపోయిన డబ్బుందన్న ఒకే ఒక కారణంతో తన బాస్ ను చేసుకోవడానికి సిధ్ధపడుతుంది. 'మనం నమ్మకాల పరిధిలో పనిచేస్తుంటాం . పిల్లలు కూడా అంతే. చిన్నప్పుడు చీకట్లో దయ్యం ఉందని నమ్మేవారు పెద్దయ్యాక ఆ నమ్మకం తప్పు అని తెలుసుకొని చీకట్లో నిర్భయంగా వెళ్ళగలుగుతాం. మన శక్తిని నిరూపయోగం చేస్తాయి. దీనిని మనం మార్పుచేసుకోవాలి' (డా నల్లూరి రాఘవరావు). సునంద విషయంలోనూ అదే జరిగింది . తన చిన్నతనంలో తల్లి పడిన కష్టాలు, కడగండ్లూ తను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే భయంతో తనని తాను మార్చుకోవాలనుకొంటుంది.
పిల్లలకు పేదరికం ఆకలి తీర్చుకోలేక వారిని శాసిస్తే, ధనవంతులను అతిగారాబం సతమతం చేస్తోంది. పిల్లలకు స్వేచ్ఛ ఇస్తూనే అవసరమనిపించినప్పుడువాళ్ళను మందలిస్తుండాలి. అలా కాకుండా వాళ్ళను అతిగారాబం చేస్తే మొండిగా తయారవుతారు. ఇలా చేయటం వల్ల తాము మాత్రమే కాకుండా చుట్టూ వున్న వారి జీవితాలు నాశనం అయ్యే ప్రమాదం ఉంది. కనుక తమకు ఎంత ఆస్తిపాస్తులున్నప్పటికీ పిల్లల్ల్ని మాత్రం హద్దులు మీరనివ్వకూడదు.(డా. యర్రదొడ్డి సుగుణ, పుట :85 :2014) అతి ఎప్పుడూ అనర్థదాయకమే.ఈ విషయాన్ని 'మరీచిక 'నవల స్పష్టం చేసింది.
'మరీచిక' నవలలో రుక్మిణి రంగారావుల ఏకైక పుత్రిక శబరి. ఈమె ఏదైనా కోరడం ఆలస్యం క్షణాల్లో ముందుంచేవారు. తల్లి ఎంతసేపూ షాపింగ్ లు పార్టీలు, క్లబ్బులు అంటూ కూతుర్ని చక్కగా ముస్తాబు చేసేది. లేనిపోని గొప్పలు చెప్పేది. కాని కూతురు మాత్రం ఎంతసేపూ ఏదైనా సాహసం చేయాలి,అది అద్భుతంగా ఉండాలనుకొంటూ డ్రగ్స్ కు అలవాటుపడిపోతుంది. అడిగినంత అందించారు. కాని పిల్ల ఏంచేస్తోందో పట్టించుకోలేదు. ఇంట్లోంచి డబ్బు, బంగారంతో బయటకెళ్ళి డ్రగ్స్ కు బానిసవుతుంది. కొంతకాలనికి తప్పు తెలుసుకున్నా ఇంటికెళ్తే తల్లిదండ్రులు ఏమంటారోననే భయంతో బిచ్చగత్తెలా మారి ఆ మత్తులోనే జీవిస్తుంది. గొప్పతనం చెప్పుకొనేదీ చాటుకొనేది కాదు.మన గురించి మనమో, ఇతరులో చెప్పుకొనే దాన్ని మించిన గొప్పతనం ఒకటుంది. మన పనుల ద్వారా ఎంతమందికి చక్కటి ప్రేరణ కల్గించామన్నదే గొప్పతనం. అదే అసలైన గొప్పతనం(డా. బి.వి. పట్టాభిరామ్).
గొప్పలకు పోయి ఒక తియ్యని జ్ఞాపకంలా మిగిలిపోవాల్సిన బాల్యాన్ని అథఃపాతాళానికి కూరుకుపోయేలా చేసేశారు శబరి తల్లిదండ్రులు. అందుకే తల్లిదండ్రుల ఆలోచనా విధానం సక్రమ మార్గంలో ఉండాలి. మంచి ప్రేరణ పిల్లలకు కల్గించాలి. అప్పుడే బాల్యం బంగారుబాట అవుతుంది.
తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం :- పిల్లలకు అన్నీ సమకూర్చకపోయినా, ఆర్థిక స్థోమత లేకపోయినా ఫర్వాలేదు. అన్నింటికంటే విలువైన ప్రేమ అందిస్తే పిల్లలు అభివృద్ధి చెంది తీరుతారు. మంచి పౌరులుగా జీవిస్తారు. 'పిల్లల అభివృద్ధికి మొదటి పునాది కుటుంబ వాతావరణం ద్వారానే ఏర్పడుతుంది'(డా || నల్లూరి రాఘవరావు). పెరిగే వయసులో లోకం పొకడల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అనుసరిస్తారు. కాబట్టి ఈ వయసులో పిల్లలకు సరైన శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కాని తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోక పోవడం వల్ల ఆ ప్రభావం వారిని ఎలాంటి అనర్ధాలకు గురి చేస్తుందో '' అడవి మల్లె '' నవలలో స్పష్టమయింది.
'అడవిమల్లె' నవలలో రంగారావు కాంతమ్మ దంపతుల ఒక్కగానొక్క కూతురు రజని. ఆస్తిపాస్తులు ఎక్కువ. కూతురిని అపురూపంగా పెంచింది కాంతమ్మ. తల్లి క్లబ్బులు, మీటింగులంటూ తిరిగితే, తండ్రి ఆఫీసులో పర్సనల్ అసిస్టెంట్ తోనూ, బాబాయి ఒక అమ్మాయిని ప్రేమించి మరో అమ్మాయితో తిరగడం గమనించిన రజని అవేమీ తప్పు కాదని తాను కూడా అదే చేయాలనుకుంటుంది. 'పిల్లలు అనుకరణ చేయడంలో సిద్ధహస్తులు' (డా|| బి.వి. పట్టాభిరామ్) అన్నది స్పష్టం. మీరు చేయగా లేని తప్పు నేను చేస్తే అవుతుందా? అని ఎదురు ప్రశ్నిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకుండా అసభ్యకరమైన పనులు చేస్తుంటే ఆ ప్రభావం వారిని తప్పుదోవ పట్టిస్తుంది. బాల్యంలో పిల్లలు లోకం పోకడల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అనుసరిస్తారనే సత్యాన్ని చెప్తూ, పిల్లలకు సరైన శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యతను గుర్తుచేస్తుంది ఈ నవల.
ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లంటూ పిల్లలను కట్టుదిట్టం చేయకూడదు. అలా పెంచడం వల్ల వారి భవిష్యత్తు ఎలా చితికిపోయిందో ఆనాడు గురజాడ పూర్ణమ్మలో పేర్కొంటే.... నేడు వాసిరెడ్డి సీతాదేవి అదే కట్టుబాట్లతో పెరిగిన అర్చన, రాధల జీవితం ఎలా ఛిద్రమైందో వర్ణించారు.
'అర్చన' నవలలో తల్లిదండ్రులు అర్చనను సంప్రదాయాలని, సమాజమని, అందులో పద్ధతిగా ఉండాలంటూ కట్టుబాట్లతో పెంచారు. వాటిని పుణికి పుచ్చుకొని పెరిగిన అర్చనకు అత్తగారింట్లో ఎదురయ్యే బాధలను తల్లిదండ్రులకు చెప్పుకోలేక, చెప్పుకుంటే సమాజం ఏమనుకుంటుందోననే భయంతో తన జీవితాన్ని మెట్టినింట్లోనే ఆత్మహత్య చేసుకుంటుంది.
'తొణికిన స్వప్నం' నవలలో రాధ పుట్టిన కొద్ది కాలానికే తండ్రి మరణించడం. దానితో మేనమామ ఇంటికి చేరడం. ఆ ఇంట్లో రాధకు చాలా రకాల ఆంక్షలు విధించడం. తలదించుకొని వెళ్ళాలి, వీధిలోకి వెళ్ళకూడదు, ఇంటి పట్టునే ఉండాలి. ఆడపిల్లకు చదువు అవసరం లేదంటూ రాధను నిర్భంధిస్తారు. ఇవన్నీ రాధ మనసుపై ప్రభావం చూపాయి. దానితో ఆమె మనసుకు ద్వేషం కలిగి చివరికి ప్రేమించిన వ్యక్తి తనకు దక్కడేమోననే బాధతో ఆత్మహత్యాప్రయత్నం చేస్తుంది.
మితిమీరిన కట్టుబాట్లు బాల్యంపై వేసిన ముద్రల వల్ల వారి జీవితాలను ఎలా చిదిమేసిందో ఈ రెండు నవలలూ నిరూపించాయి. పెద్దల ప్రభావం పిల్లల మీద గాఢంగా ఉంటుంది. వాళ్ళు చేసేవి, చెప్పేవీ అన్నీ వారికి మార్గదర్శకం కావాలి గానీ అవే వారి జీవితాలను అంతం చేయకూడదు. వివేకం, చాతుర్యం, నేర్పరితనం, సమయస్ఫూర్తి, విజ్ఞతలను, ఆత్మవిశ్వాసాన్ని అందించి మంచి ప్రవర్తనతో తీర్చిదిద్దుకొనేటట్లుగా చేస్తూ, సమస్యను ఎదుర్కొనేలా పెంచాలి. అలాకాకుండా వారి మీద పెట్టే ఆంక్షలు, వారి జీవితాలను అంతం చేస్తున్నాయి. కనుక పిల్లలపై మితిమీరిన ఆంక్షలు పెట్టరాదని స్పష్టమవుతుంది.
ఒక కుటుంబంలో బాలలు అభివృద్ధి పథంలో నడిచినా లేదా పాడైపోయినా దానికి తల్లి దండ్రులే బాధ్యులవుతారు. అలాంటి తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు మరణించినా, లేదా దీర్ఘకాలికంగా రోగపీడితులైనా, విడాకులు తీసుకున్నా వారిలో విపరీత ప్రవర్తన కనబడుతుంది. అలాంటిదే 'వైతరణి 'రాగహేల' నవలల్లో స్పష్టంగా ఉంది.
'వైతరణి' నవలలో నాగమ్మ కూతురు పార్వతి. ఆమె పుట్టిన కొద్ది కాలానికే తండ్రి మరణించడంతో తల్లితో కలిసి మేనమామ ఇంటికి చేరతారు. అక్కడ సరైన ఆదరణ ఉండదు. తన మామయ్య పిల్లలు వదిలేసిన బట్టలు వేసుకుని వాళ్ళ పుస్తకాలు చదువుకునేది. అలా కూడా పార్వతి చదవడం ఇష్టపడరు. పెన్సిల్, పుస్తకాలు కొనడానికి డబ్బు ఇవ్వరు. పైగా అత్తయ్య కూతురు దాచుకున్న డబ్బుల్లో ఒక రూపాయి కనిపించలేదని పార్వతి తీసిందంటూ తన తల్లిని నిందిస్తారు. నిజానిజాలు తెలుసుకోకుండా పార్వతిని తల్లి చావగొడుతుంది. పార్వతి మీద లేనిపోని నిందలు వేస్తూ కొడుతుంటే కోపం వచ్చిన పార్వతి అత్తకూతురు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కూజాను పగులగొడుతుంది. పార్వతిని నువ్వు తప్ప దీన్నెవ్వరూ పగులగొట్టరు. నువ్వు ఎవరినో లేపుకు పోతావంటూ తిట్టడంతో అదే తప్పు చేయాలని నిర్ణయించుకుంటుంది. వేదనలు, కష్టాలు దుర్భరమై ఇలా ఎంతకాలం బ్రతకాలి అనే తిరుగుబాటు ధోరణి విప్లవం తెస్తుందంటాడు సొదుం రామ్మోహన్. పార్వతి విషయంలో అదే జరిగింది. పసి హృదయం చేయని తప్పుకు నిందలు మోస్తూ దెబ్బలు తింటుంటే తిరగబడటం సహజమనేది వక్కాణించారు రచయిత్రి.
'రాగహేల' నవలలో రవికిరణ్ చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. రవికిరణ్ ను దక్కించుకోవాలని ఒకవైపు నాన్నమ్మ, మరోవైపు తాతయ్య (అమ్మ తండ్రి) ప్రయత్నాలు చేస్తారు. నీ తల్లి చావుకు తండ్రే కారణమంటూ తాతయ్య, మీ నాన్న చావుకు అమ్మే కారణమని నాన్నమ్మ చెబుతారు. నాన్నమ్మ దగ్గర రవిగా, తాతయ్య దగ్గర కిరణ్ గా పిలువబడుతాడు. పెద్దవాళ్ళ మాటలతో అదే ధ్యాసలో ఉండి పసివయస్సులో అది నాటుకుపోయి భిన్నవ్యక్తిత్వాలు గల వ్యక్తిగా మారతాడు. రవిగా ఉన్నప్పుడు తల్లి మీద, కిరణ్ గా ఉన్నప్పుడు తండ్రి మీద కసి పెంచుకుంటూ పెరిగి పెద్దవాడవుతాడు. కుటుంబవిలువలు పటిష్టంగా ఉన్న ఈ సమాజంలో కుటుంబంపై అపారమైన గౌరవం ఉంది. ఎందుకంటే పిల్లల కోసం తల్లిదండ్రులు త్యాగాలు చేస్తారు. వారు పెరిగి పెద్దవారయ్యేంత వరకు వెన్నంటి ఉంటారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడటాన్నీ పిల్లలు తమ బాధ్యతగా భావిస్తారు. అలా కాకుండా నాన్నమ్మ, తాతయ్యల స్వార్థం కోసం పిల్లాడికి లేని పోనివి చెప్తే వాడి మనసు మీద చేదు జ్ఞాపకంగానే తల్లిదండ్రులు నిల్చిపోవాల్సి వస్తుంది. అదే రవికిరణ్ కి జరిగింది.
'నేటి బాలలే రేపటి పౌరులు' అన్నారు. అలాంటి భావిభారత పౌరులుగా మారబోయే పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలి. వారి మేధస్సును పెంచి సహజీవనాన్ని, సహనాన్ని కల్గించాలి. ఎందుకంటే 'మొక్కై వంగనిది మానై వంగదు'. ఈ వాస్తవాన్ని గ్రహించి ప్రభుత్వం బాలలకు ప్రత్యేక సదుపాయాలు, సమానహక్కులు కల్పిస్తూ వీటిని అరికట్టాలని చూసినా ప్రతి కుటుంబంలోని ఈ చిన్ని చిన్ని సమస్యలు బాల్యంపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. వాటికి నిదర్శనమే నేటి పత్రికల వార్తలు, సాహిత్యం మొదలైనవన్నీ! బాలల్లో మానసిక వికాసాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని , ఆత్మ స్థైర్యాన్ని పెంచేటట్లుగా సాహిత్యం ఇంకా రావాల్సి ఉంది. బిందువు బిందువు కలిసి సింధువైనట్లుగా ప్రతి ఒక్కరి ఆలోచనతో బాలల చైతన్యాన్ని ఆశిద్దాం.