పరిమళభరితమైన జలంధర 'పున్నాగపూలు'

-డా.అలూరి విజయలక్ష్మి
9849022441

      ప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి, శ్రీమతి, జలంధర నవల 'పున్నాగపూల పరిమళం పాఠకుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, మెదడుని చిలికి జీవిత సారపు వెన్నముద్దను చేతిలో పెడుతుంది, జీవనవికాస శిక్షణనిస్తుంది, బ్రతుకు బోధిస్తుంది, పిరికితనంతో లొంగిపోతూ, రక్షణవలయంలో ఒదిగిపోతూ, భ్రమాత్మక మంచితనాలతో ముడుచుకునిపోతూ బ్రతకడంకాదు, ధైర్యంగా హక్కుల్ని సాధించుకుని అనుభవించమని, బాధ్యతల భుజాలమీద హక్కులు నిలబడతాయని మరవొద్దని ఉద్భోదిస్తుంది. లోకాన్ని అర్థం చేసుకునేముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో, ఇతరుల నుండి గౌరవం కోసం ఎదురు చూసేముందు నిన్ను నువ్వు గౌరవించుకో, నీ సామర్ధ్యాల మీద, ముందు నవ్వు నమ్మకం పెట్టుకో అని హితం చెప్తుంది. మనుషుల్లోని హిపోక్రసీని, దుర్మార్గాన్ని, కపటత్వాన్ని, దురాశను ఎండగడుతూ, వీటిని ఒదిలించుకుంటేనే మనిషికి విముక్తి అని ప్రకటిస్తుంది.
సంఘం స్త్రీలను, పురుషులను భిన్నమైన నమూనాల్లో ఎలా తయారు చేస్తూందో చెప్తూ కొంత మంది స్త్రీలు భయంకరమైన అత్తగార్లుగా, స్నేహాన్ని, ప్రేమను ఇవ్వలేని తల్లులుగా మారడానికి కారణం సంఘం వారిని విక్టిమైజ్‌ చెయ్యడం అంటారు జలంధర. మంచి పేరు తెచ్చుకోవాలని, మంచిగా ఉండాలని ప్రయత్నించే అమ్మాయిల్లో కొంతమంది  సినిక్స్‌గా మారే క్రమంలో సహజసిద్ధమైన సౌందర్యాలు, సౌకుమార్యాలు, ఆలోచనలు, ప్రకృతి నేర్పించే పాఠాలు, అంతఃచేతన జీవితం గురించి చేసే సూచనలకు ఎలా దూరమైపోతారో విళ్లేషిస్తారు జలంధర. ఇలా విక్టిమైజ్‌ అయినవారివల్ల సమాజంలో అనేక ఘోరాలు గురించి చేసే సూచనలకు ఎలా దూరమైపోతారో విశ్లేషిస్తారు జలంధర. ఇలా విక్టిమైజ్‌ అయినవారివల్ల సమాజంలో అనేక ఘోరాలు జరుగుతున్నాయంటారామె.
స్త్రీలు అనుభవించే వివక్షలు, అణచివేతలు, పీడనలు, హింసలు వారినెంత దుఃఖపెడుతున్నాయో, ఎంతగా వారిని జడులుగా, మూర్ఖులుగా, మానసిక రోగపీడితులుగా మారుస్తున్యాయో, వారి జీవితాల్లో జరిగే విధ్యంసాల ప్రభావం వారిపైనే కాక వారి కుటుంబాలపైన, మొత్తం సమాజంపైన ఎలా పడుతూందో వివిధ కోణాల్లో, వివిధ పాత్రల ద్వారా సమర్ధవంతంగా వెల్లడి చేస్తారు జలంధర, వేగంగా మారుతున్న సమాజంలో ఆధునిక శాస్త్ర విజ్ఞాన ఉపకరణాలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇంటర్నెట్‌ అజ్ఞానపు పరదాల్ని చించేసి నిజమైన జీవితపు నగ్న స్వరూపాన్ని కళ్లెదుట పెడుతున్న వాస్తవాన్ని ప్రస్తావించారామె.
సమాజంలో, మనుషుల్లో జరుగుతున్న ఈ విధ్వంసాన్ని ఆపడానికి, మనిషి మనిషిగా మిగిలేందుకు దోహదపడడానికి అవసరమైన ప్రయత్నాల్ని ప్రతిపాదించడానికి ఒక అద్భుతమైన సెట్టింగ్‌ని ఎంపిక చేసుకున్నారు జలంధర. ఒక మోడల్‌ హాస్పటల్‌, జి.కె. హాస్పటల్‌, అందులో డాక్టర్లు, సిబ్బంది వ్యాపార దృష్టితోకాక రోగిపట్ల అనుతాపంతో సమగ్ర చికిత్స చెయ్యడం, రోగం యొక్క మూలకారణాల్ని శోధించడానికి అనేక పద్ధతుల్ని అవలంబించడం, కౌన్సిలింగ్‌ ద్వారా రోగుల వైఖరుల్ని మార్చడానికి ప్రయత్నించడం, వారి జీవితాల్లోని పీడకలల్ని మరచిపోయేలా చేసి వారికి జీవితం పట్ల ఆసక్తి, అనురక్తి కలిగించడం ఈ హాస్పటల్‌ విశేషాలు. డా.గోకులకృష్ణ, నమ్మి, ఆచరించి, బోధించిన ఉన్నతాదర్శాల మేరకు అన్ని సౌకర్యాలతో నడపబడుతున్న డా.జి.కె.హాస్పటల్లో సంపన్నులకు ఎంత నాణ్యమైన వైద్యం లభిస్తుందో పేదలకు కూడా అంతే నాణ్యమైన వైద్యం లభిస్తుంది. సౌకర్యాలలో మాత్రమే కొంత తేడా. ధనిక, పేద వత్యాసం లేకుండా రోగులందర్నీ గౌరవంగా, సహానుభూతితో చేర్పించడంతో చూచే సిబ్బంది అక్కడి ప్రత్యేకత. డా.జి.కె.తమ్ముడి కూతురు రాధ భర్త రాజారావును లివర్‌ వ్యాధికి చికిత్సకోసం జి.కె.హాస్పటల్లో చేర్పించడంతో నవల ప్రాంభమవుతుంది. విపరీతంగా తాగుతూ, ఛండాలంగా ప్రవర్తించే భర్తను నోరు మెదపకుండా భరించే రాధ జీవితం మీద తల్లి, తండ్రి, భర్త, అత్తింటివారు తలొక రకంగా ప్రతికూల ప్రభావం చూపారు. అందగత్తెననే అహంతో విర్రవీగుతూ అందం, డబ్బు, హోదా, అర్భాటం తప్ప మనుషుల్ని మనుషులుగా గుర్తించని రాధ తల్లి లావణ్య. తనను ప్రేమించిన డా.జి.కె.కు, తను హద్దుమీరి ప్రవర్తించి గర్భవతి అయినప్పుడు తనను పెళ్ళిచేసుకుని సంఘంలో తన పరువును నిలిపిన భర్తకు, చివరకు తను నవమాసాలు మోసి కన్న కూతురుకు కూడా ప్రేమను పంచక అమ్మగా కాక అందాలబొమ్మగా మిగిలిపోయింది. తన అన్న డా.జి.కె., లావణ్య ప్రేమికులని తెలిసికూడ అన్నగారు పైచదువులకోసం విదేశాలలో ఉండగా విధివశాత్తు తన దోసిలిలో వాలిన ఆ అందాలరాశిని తన జీవితంలో నిలుపుకున్న  రాధ తండ్రి భార్య ముందు నోరు లేనివాడిగా బ్రతుకుతూ కూతురిపై భార్య ధాష్టీకాన్ని ఆపలేకపోయాడు. విదేశాల నుండి మానసికంగా ఉన్నతీకరింపబడి, జీవిత లక్ష్యాలగురించి నమూలంగా మారిన అభిప్రాయాలతో స్వదేశానికి తిరిగి వచ్చి అవివాహితుడిగా మిగిలిపోయాడు డా.జి.కె. తనతమ్ముడికి, ఒకప్పటి తన ప్రేమికురాలికి పుట్టిన వెన్నులతునక, రాధను ఎంతో ప్రేమించి 'బంగారుతల్లి' అంటూ ముద్దుగా పిలుచుకునే డా.జి.కె. కూడా రాధను ఆమె తల్లి కంట్రోలు నుండి తప్పించలేకపోయాడు. సంపన్నుల ఇంటి బిడ్డ అయిన్పటికి ఆ సంపదను, కుటుంబహోదాను ఒదులుకుని, తన ఆదర్శాలను పంచుకుంటూ, తన ఆరాధకుడిగా, తను స్థాపించిన హాస్పటల్‌లో డాక్టరుగా పనిచేస్తున్న డా.కృష్ణ రాధను ఇష్టపడుతున్నాడని తెలిసికూడా అటు రాధ తల్లి లావణ్యను, ఇటు డా.కృష్ణ తల్లి ప్రభావతిని ఒప్పించలేకపోయాడు డా.జి.కె.రాధ వివాహం రాజారావుతో జరుగుతున్నప్పుడు అది రాధకు దుఃఖహేతువే అవుతుందని ముందుగా గ్రహించి కూడా ఆపడానికి ఆశక్తుడయాడు. ఈ ఆవేదన ఆయనను క్రుంగదీసింది.
ప్రకృతి ఒడిలో ప్రతిష్టతమై, తన లోపలికి ప్రవేశించినవారికి ప్రశాంతతను, హాయిని, వికాసాన్ని కలిగిస్తూ, 'శరీరం, మనసు, ఆత్మ' పరస్పరం అనుసంధాన మయినప్పుడే, సమన్వయంతో పని చేసినప్పుడే మనిషి లోపల, బయటశాంతిని అనుభవిస్తూ శారీరక, మానసిక వ్యాధుల్ని నివారించుకోగలగుతాడనే తాత్త్విక భూమికతో, డా.జి.కె.ను అనుక్షణం స్మరిస్తూ, ఆయన పేరుమీద నడపబడుతున్న ఆ అందమైన, ప్రశాంతమైన ప్రదేశంలో ప్రవేశించాక రాధ క్రమేపీ ఆలోచించడం మొదలు పెడుతుంది. అలా అలోచించడానికి ఆమె మరిది, డా.జి.కె. శిష్యుడు, ఆరాధకుడు అయిన రఘు, డా.కృష్ణ ప్రారంభ కుదుపు ఇచ్చినప్పటికి, ఆ తరువాత అక్కడ ఆమెకు పరిచయమైన వ్యక్తులు, జరిగిన సంఘటనల పరంపర, ఆమె తన గురించి తాను విశ్లేషించుకోవడానికి, తానేవిధంగా తన జీవితం మీద అదుపు కోల్పోయిందో గుర్తించడానికి తోడ్పడినాయి.
చదువుకునే రోజుల్లో డా.జి.కె.ను ప్రేమించి, లావణ్యతో పోటీపడలేక తన ప్రేమను ఆరాధనగా మార్చుకుని, విదేశాల్లో ఉన్నత చదువునభ్యసించి డా.జి.కె. అనుయాయిగా డా.జి.కె. హాస్పటల్లో ముఖ్య భూమికను పోషిస్తున్న డా.షీలా, హాస్పటల్లో చికిత్స పొందుతున్న రాణి, ఆమె కొడుకు సుందర్‌, స్వప్న, రామకృష్ణ, ఇంకా ఎంతోమంది రాధ తనను తాను గుర్తించడానికి, తన భవిష్యత్తును నిర్దేశించుకోవటానికి, తన మార్గాన్ని నిర్ణయించుకోవడానికి తోడ్పడ్డారు. రాణి, సుందర్‌, స్వప్పల పట్ల ఆమె వ్యవహరించిన తీరు ఆమెలో ఊపిరి పోసుకుంటున్న చైతన్యానికి చిహ్నాలుగా గుర్తించిన డా.కృష్ణ, రఘు, డా.షీలా ఆమెలో మరింత మార్పుకోసం ఆశతో ఎదురుచూడసాగారు. తనభర్త రాజారావు జీవితంలో తన స్థానం శూన్యమని, అతని జీవితంలో మరొక స్త్రీ, ఆమె కొడుకు జీవితంలో నుండి తప్పుకుని ఆ రెండో  ఆమెకు చట్టపరమైన, గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించటానికి రాజారావుకు విడాకులిచ్చింది. చిత్రంగా అప్పటివరకు ఆమెను తిట్టి, కొట్టి, హేళన చేసి, అవమానపరిచిన రాజారావు రాధను వదులుకోలేని స్థితికి రావడం మరో మలుపు.
ఆత్మగౌరవంతో, చైతన్యవంతంగా బ్రతకడం గురించి అర్థం చేసుకుంటున్న రాధ తనింతవరకు గుర్తించలేకపోయిన పెదనాన్న ఔన్నత్యాన్ని, ఆయనకు తన మీదున్న ప్రేమను, తనమీద ఆయన పెట్టుకున్న ఆశలను గుర్తుచేసుకుంటూ తన భవిష్యత్తు కర్తవ్యాన్ని నిర్ణయించుకుంటుంది. ఆయన ఆదర్శాల పొదరిల్లు అయిన డా.జి.కె. హాస్పటల్‌లో తను ప్రభావశీలమైన భాగస్వామి కావాలంటే తన జ్ఞానాన్ని, నైపుణ్యాల్ని పెంచుకోవాలనే లక్ష్యంతో, తనను అపురూపంగా తన జీవితంలోకి ఆహ్వానించడానికి డా.కృష్ణ సిద్ధంగా ఉన్నాడని  తెలిసికూడా ఉన్నత విద్య, శిక్షణల కోసం విదేశాలకు వెళ్ళడంతో నవల ముగుస్తుంది.
జీవితం గురించి పాఠాలు నేర్చుకోవాలనుకునేవారికి నవల పొడుగుతా అనేక విలువైన విషయాల్ని సందర్భానుసారం, సమయోచితంగా పొందుపరచారు జలంధర. సేఫ్టీ జోన్‌లో నిష్పూచీగా బ్రతికేస్తూ, తమ చుట్టూ ఎన్నో విధ్వంసాల్ని ఎదుర్కొం  టున్న అనేక మంది స్త్రీల దయనీయతను  పట్టించుకోని మహిళల స్పందనారాహిత్యాన్ని తీవ్రంగా నిరసించారామె.
''మనం ఉన్న అనారోగ్యకరమైన సాంఘిక వాతావరణంలో అసూయ, కోపం, ద్వేషం, ఆక్రోశం, భయం, పెరిగి, పెను రక్కసిలా మారే పరిస్థితి ఉంది. దీనిలోనుండి బయట పడాలి, ఈ పరిస్థితిని మార్చుకోవాలి... అణచుకున్న రోషం వల్ల పాసివ్‌ అగ్రెసివ్‌నెస్‌ వస్తుంది. దానివలన ఒక ఏలియనేషన్‌... ఒక పరాయితనం.... సెల్ఫ్‌డిస్ట్రక్టన్‌... నీరూపంలో ఒక మనిషి తిరుగుతూ ఉంటుంది, కానీ.... నువ్వు ఉండవు. ఈ కండిషన్‌కి ట్రీట్‌మెంట్‌ అవసరం... మనిషి తనలో జరగుతున్న విధ్వంసాన్ని గుర్తించాలి. ఒక రోగి బాగుపడడం అంటే అతని కుటుంబ సభ్యుల్లో మార్పు, అతని ఆలోచనాసరళి మారడం. ఇలా అంతర్లీనమైన మార్పులు వస్తే తప్ప శరీరం ఆరోగ్యవంతమయే సజెషన్‌ తీసుకోదు..... రోగుల్లో రెండు రకాలు... మనచేత్లుల్లో ఏమీలేదు, విధికి తలవంచాల్సిందే అనే వారిని 'డినైయర్స్‌' అని, బ్రతుకు విలువ తెలసుకుని పోరాడి బ్రతకాలనుకునేవాళ్ళను 'సర్వైవర్స్‌' అని అంటారు. వీరిలో మరింత గొప్ప కేటగిరీ-ఎక్సెప్షనల్‌ పేషెంట్స్‌... అది జరగాలంటే తన మీద తనకు గౌరవం పెరగడం ముఖ్యం.... 'డినైయర్స్‌' రోగాన్ని అంగీకరించి, చికిత్సకు విముఖంగా ఉంటారు. 'డినైయర్స్‌'ని 'సర్వైవర్స్‌'గా మార్చడమే చికిత్స లక్ష్యం కావాలి. జీవితాన్ని, ఆరోగ్యాన్ని రక్షంచుకోవాలంటే వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి, సాంఘికమైన ఒత్తిడుల నుంచి మనిషిని విడిగా తీసి అతని స్వయం ప్రతిపత్తిని, సహజమైన వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి, సాంఘికమైన ఒత్తిడుల నుంచి మనిషిని విడిగా తీసి అతని స్వయం ప్రతిపత్తిని, సహజమైన వ్యక్తిత్వాన్ని అతనికి చూపించగానే మంత్రం వేసినట్లు మార్పు వస్తుంది. దానికి సమీపబంధువుల సహకారం అవసరం... నేను ఎవరు? నేను ఎందుకు పుట్టాను? నాకేం కావాలి? అని తెలియడం చాలా ముఖ్యం, నీగురించి నువ్వేం అనుకుంటున్నావు? అన్నది ముఖ్యం... మనజీవితంలో మనకు ఏది నిజంగా ఆనందాన్నిస్తుందో తెలయగానే ఈ నటన వదిలేస్తాం, అప్పుడే మనలో ఒక 'సృష్టి'ని గుర్తిస్తాము'' -- ఇలా చాలా, చాలా మనుషుల జీవితాలు మెరుగు పడడానికి అవసరమైన విషయాలు నవల నిండా ఉన్నాయి.
మనుషులు మనిషితనాన్ని కోల్పోవడం పట్ల వేదన, కుటుంబ వ్యవస్థ ఇరుకుదనం పట్ల చిరాకు, బాలికలపై అమలవుతున్న రకరకాల వేధింపులు, అత్యాచారాల పట్ల ఆగ్రహం, స్త్రీలు అనుభవిస్తున్న రకరకాల వివక్షలు, హింసల పట్ల దుఃఖం, మనుషులు ఆరోగ్యంగా, శాంతిగా బ్రతకాలన్న ఆకాంక్ష, మానవ వేదనను తొలగించాలన్న ఆర్తి, అవినీతి సొమ్ము పట్ల రోత, మనుషులు మెరుగైన జీవితాన్ని గడపడానికి అవసరమైన సమాచారాన్ని తెలపాలనే ఆసక్తి నవలలో గొప్పగా వ్యక్తమయాయి. వ్యక్తపరచిన తీరు, చిత్రించిన నేపథ్యం, పాత్రలు నవలను ఎలివేట్‌ చేసి జలంధరగారి పున్నాగపూల పరిమళానికి ఒక ప్రత్యేకతను సమకూర్చాయి