సింహాద్రి నాగశిరీష
9866689326
'నవల' అనే మూడక్షరాల సాహిత్య ప్రక్రియ పరిచయం లేని వారు ఉండరు అని అనటంలో అతిశయోక్తి లేదు. ఆంగ్ల భాషా ప్రభావంలో ఈ ప్రక్రియ మరింత ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ, అంతకు పూర్వమే పద్యాత్మకమైన, గద్యాత్మకమైన నవలలు వచ్చాయనేది వాస్తవం. ఏదేమైనప్పటికీ కథలు, కథానికలు, జీవితచరిత్రలు అంటూ ఎన్నో ప్రక్రియలు మానవ జీవితంలో సమాజాన్ని, దాని పోకడను ఎంతో సమగ్రంగా ప్రతిబింబింపజేస్తాయి. ఆలోచింపజేస్తాయి, ఆచరింపజేస్తాయి, అన్వేషింపజేస్తాయి. అటువంటి కోవకు చెందినదే డా|| పి. శ్రీదేవి రచించిన ''కాలాతీత వ్యక్తులు'' నవల. ఇందులో పాత్రలు, ఇందిర, కళ్యాణి, ప్రకాశం, కృష్ణమూర్తి, వసుంధర, డా|| చక్రవర్తి అయితే ఇంకా కొన్ని పాత్రలు పలకరింపు కూడా ఉంది. ఇక్కడ ప్రస్తావించవలసిన అతి ముఖ్యమైన వ్యక్తి ఇందిర. ఈమే ఈ నవలా 'నాయకుడు' అనటంలో ఎలాంటి సందేహం లేదు. పరికించి చూస్తే కొన్ని సందర్భాల్లో ఈమే ప్రతినాయకగా కన్పిస్తుంది. కళ్యాణికి దగ్గరవుతున్న ప్రకాశాన్ని తనవైపు తిప్పుకోవటం, తన దారికి అడ్డొస్తున్న కళ్యాణిని నిర్దాక్షిణ్యంగా ప్రక్కకు నెట్టేయటం, ప్రకాశం మామ శేషావతారమందు కృష్ణమూర్తిని, కళ్యాణిని తప్పుడు మనుషులుగా నిలబెట్టడం ఇలా ఆమె పాత్ర పాఠకుడికి చాలా కోపాన్ని తెప్పిస్తుంది. స్వతహాగా ఇందిర చెడ్డది కాదు. అలాగని మంచిదీ కాదు. తను ఎవరికోసమూ బ్రతకదు. ఎవరి దయా దాక్షిణ్యాలకై ఎదురుచూడదు. ఎంతో మొండిగా, ధైర్యంగా బ్రతుకుతుంది. మగవాడికి ధీటుగా బ్రతుకుతుంది. కష్టాలు ఎదురెనప్పుడు కన్నీరు కార్చేవారంటే ఆమెకు అసహ్యం. ఆమెలోనూ తనకంటూ ఓ తోడు, సంసారం కావాలని, అందరు ఆడపిల్లల్లా హాయిగా బ్రతకాలనీ కోరిక లేదనుకుంటే పొరపాటే. కానీ తన జీవితం అందరిని ఆడపిల్లల్లా లేదే. తల్లిదండ్రుల నీడలో ఆడుతూ పాడుతూ గడవాల్సిన బాల్యం కాదు ఆమెది. రోగిష్టి తల్లిపై ప్రేమాభిమానాలు పెంచుకోలేకపోయింది. తండ్రికి అవలక్షణాలు లేవు. అలాంటి తండ్రి నిద్రపోయేటప్పుడు కన్న కూతురిని గుండెలపై పెట్టుకునేవాడు. కానీ ఆయన పెద్దవుల్లు ఘాటైన ద్రావణాల వాసనలు వెదజల్లేవి. పసితనం నుంచే అలాంటి ఘాటైన అనుభవాల వల్ల మనసు, శరీరం గట్టి పడ్డాయి. ఇలాంటి అనుభవాల మధ్య ఎలాగో కాలేజీ దాకా ఎగబాకింది. తర్వాత తండ్రి జైల్లో పడటం, తల్లి మరణం ఆమెను మరింత గట్టిపరిచాయి. టైపు, షార్ట్‌హ్యాండ్ నేర్చుకొని ఉద్యోగం సంపాదించుకుంది. తండ్రి సంరక్షణలో బ్రతకాల్సిన పిల్ల, తండ్రిని సంరక్షించాల్సి వచ్చింది. అలాంటి ఇందిరకు సెంటిమెంట్లు లేవు. ఎన్నో సందర్భాలలో తన ప్రవర్తన తప్పు అని తన అంతర్మాతకు తెలిసినా, తను బ్రతకాలంటే ఇవన్నీ తప్పవు. ఇదంతా మనుగడ కోసం పోరాటమే అని అంతరాత్మ నోరు నొక్కేసింది. ''నీకే భయం లేదు నీకు అండగా నేనున్నాను'' అని నిలబడగల ఒక్క మగాడికోసం ఎదురుచూసింది. అలాంటి ఆలోచనల మధ్య ప్రకాశంతో స్నేహం ఏర్పడింది. అతనిపై అధికారం సంపాదించింది. కానీ అతడు కళ్యాణికి దగ్గర అవుతున్నాడని తెలిసి, తనదైన పంథాలో తనవైపు మరల్చుకుంది. ప్రకాశంలో తాను కోరుకునే లక్షణాలు ఏ కోశానా లేవని ఆమెకు తెలుసు. కానీ తను అతనికిచ్చే అనుభవాలతోనైనా గట్టిపడతాడు అనుకుంది. కళ్యాణికి తను చెప్పలేని అన్యాయం చేస్తున్నానని తెలుసు. కానీ ''నేను ఇల్లు కట్టుకుంటుంటే ప్రక్కగా నడిచి వెళ్లేవారి నెత్తిపై ఇటుకలు పడ్డాయంటే నేనేం చేయను? ఎవరి మటుకు వారు చూసి నడిచివెళ్ళాలి' అని ఆమె అన్నప్పుడు బ్రతకనేర్చిన, ఆడ పిల్ల అన్పించకమానదు. పాఠకుడిలో ఆలోచన మొదలు కాకమానదు. ప్రకాశంతో అంతదూరం వెళ్ళినప్పటికీ, అతడు ధైర్యంగా నిలబడి మేనమామతో తాడోపేడో తేల్చుకోలేక, పిరికిగా పారిపోయి ఆమె దగ్గరికి వస్తే అతడిని అసహ్యించుకుంది. ఇన్నాళ్ళూ నా తండ్రికి గార్డియన్‌గా ఉన్నాను, బ్రతికున్నన్నాళ్ళూ నీకూ గార్డియన్‌గా నేనెలా చచ్చేది. నీకూ నాకూ ఇక కుదరదు అని ఒక్కమాటలో తేల్చిపారేసినప్పుడు ఆమెలో ఎంతో ఎత్తుగా ఎదిగిన వ్యక్తిత్వాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పాఠకుడు చూస్తాడు. కానీ ఇందిర చేసిన తప్పులను మందలించటానికి వచ్చిన కృష్ణమూర్తికి తన జీవిత విశ్వరూపం చూపిన ఆమె ఆత్మస్థైర్యాన్ని నిబ్బరాన్ని పాఠకుడు అభినందించే సమయంలో సరిగా అప్పుడు కేవలం ఓ స్నేహితుడిగానే తప్ప తనకు తోడుగా నిలబడతాడనే ఆలోచన వేకోశానా లేని అతనితో కూడా నాలుగడుగులు చొరవగా వేసెయ్యటం, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బహుశా కృష్ణమూర్తిలో ఎక్కడో నక్కిఉన్న ఔన్నత్వాన్ని బయటికి లాగాలనే ఉద్దేశ్యంతో ఇందిర పాత్రకు కూడా ఒక మంచి ముగింపు ఇవ్వాలనే ఆలోచనతో రచయిత్రి ఆ రాత్రిని అలా చిత్రించి ఉండవచ్చు. ఏదేమైనా పాత్రకున్న తెగువకు, అంత స్వేచ్ఛా మరియు జీవితంలో కూడా అనాలోచితంగా పావుకదపని అద్భుతమైన పాత్ర చిత్రణకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేడు పాఠకుడు.
ఇక కళ్యాణి విషయానికొస్తే ఆత్మాభిమానం గల ఓ తెలుగింటి ఆడపడుచుగా, సున్నిత మనస్కురాలైన ఓ ముగ్ధగా అందరికీ సుపరిచితమైన పాత్రే. సాధారణంగా ఇలాంటి పాత్రను నవలానాయికగా పాఠకుడు ఊహించుకున్నప్పటికీ, ఆ మార్కులు మాత్రం ఇందిరకే దక్కుతాయి. తండ్రిచాటుబిడ్డగా పెరిగిన కళ్యాణి, చదువు నిమిత్తం పుట్టిన వూరు విడిచిరావడం, ఇందిర, ప్రకాశాలు తనపై చూపుతున్న అభిమానానికి పొంగిపోతుంది. వారి స్నేహం కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ క్రమంలో ప్రకాశానికి కూడా తనలాంటి కష్టాలే ఉన్నాయని తెలుసుకుని బాధపడుతుంది. తనకు ఎప్పుడూ తోడుంటానని వాగ్ధానం చేసిన ప్రకాశాన్ని నమ్ముతుంది. కానీ ఇంతలోనే తండ్రి మరణం, తాను అంతగా నమ్మిన ఇందిర, ప్రకాశం చేసిన అన్యాయానికి క్రుంగిపోతుంది. లోకాన్ని తలచుకుని వణికిపోతుంది. కానీ అదే లోకంలో తనకేమీ కాకున్నా, నిస్వార్థంగా అండగా నిలబడిన వసుంధర, కృష్ణమూర్తి, డా|| చక్రవర్తి అందిస్తున్న గౌరవాభిమానాలకు ఈ లోకంలో మంచితనం ఇంకా బ్రతికే ఉందనే నమ్ముతుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకుంటూనే తన కాళ్ళపై తాను నిలబడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. చిన్ననాటి నుండి పూర్తిగా సుఖమయమైన వాతావరణంలో పెరగకపోయినా, తండ్రి చాటుబిడ్డగా వుంటూ లోకాన్ని నేరుగా తన కళ్ళతో ఎప్పుడూ చూడలేదు కళ్యాణి. ఒకేసారి తట్టుకోలేనన్ని ఎదురుదెబ్బలు తగిలితే కొంతవరకు భీరువుగా మారింది మాత్రం వాస్తవం. అలాగని తన కర్మ ఇంతే అని సరిపుచ్చుకోలేదు. ఒక పక్క కృష్ణమూర్తి ఆమె చదువుకోసం స్నేహధర్మంగా డబ్బు సర్దుతానన్నప్పుడు, దొరికిందే అవకాశంగా వినియోగించుకోనూలేదు. అతని మాటను సున్నితంగా తిరస్కరిస్తూనే, తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ఆరంభించిన కళ్యాణిని చూస్తాం.
ప్రకాశం - కృష్ణమూర్తి పాత్రలను ఒకసారి పరిశీలిస్తే, నవల ఆరంభంలో ప్రకాశం ఒక వ్యక్తిత్వం ఉన్నవాడిలా, స్నేహశీలిలా, కథానాయకుడిగానూ, కృష్ణమూర్తి ఒక జల్సారాయుడిలా, ప్రత్యేకించి ఒక వ్యక్తిత్వం లేకున్నా కాస్తో కూస్తో మంచితనం ఉన్న వ్యక్తిలా కన్పిస్తాడు. ప్రకాశానికి మొదటి నుంచీ ఇందిరపై ప్రత్యేకమైన అభిప్రాయం ఉండదు కానీ, తనపై అధికారం చలాయించే ఆమె పద్ధతికి ఇబ్బంది పడతాడు. భయపడతాడు కూడా. కళ్యాణి వ్యక్తిత్వానికి ఆకర్షితుడౌతాడు. ఆమెకు అనారోగ్యం అని తెలిసి విలవిలలాడుతాడు. ఆమె కష్టాలకు చలించిపోతాడు. నీకు నేనున్నానంటూ అభయమిస్తాడు. కానీ చేతల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం నెమ్మదిగా నిష్క్రమిస్తాడు. ఇందిర వ్యామోహంలో పడతాడు. మేనమామ శేషావతారానికి భయపడి, ఎదురు చెప్పలేక అతను కుదిర్చిన వివాహానికి సమ్మతిస్తాడు. అదును చూసుకుని ఇందిర దగ్గరకు పారిపోయి వస్తాడు. అతని పిరికితనాన్ని ఇందిర అసహ్యించుకుని ఛీ అంటుంది. కళ్యాణికి చేసిన అన్యాయం ఫలితమే ఇదనుకుంటాడు. కాదు ఇందిర ఒక వన్నెల విసనకర్ర తనను బొమ్మను చేసి ఆడించిందని, ఇందిరను నీతి నియమాలు లేని వ్యక్తిగా ద్వేషిస్తాడు. అసలు ఇదంతా తన మంచికే జరిగిందని, ఇదంతా ఓ వ్యామోహం దీని నుంచి బయటపడి కనిపెంచిన తల్లిని సుఖపెట్టి తనను ఉద్దరించిన మేనమామ తెచ్చిన సంబంధం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. తనకంటూ ఒక ఆలోచనలేక, సమయానికి తగ్గట్టు మొగ్గుతూ పాఠకుడి మస్తిష్కంలో ప్రకాశం కనీసం ఓ మనిషిగా కూడా మిగలడు.
ఆడ పిల్లలతో షికారులు, జల్సాలు వంటి వాటిలో ఆనందం చవిచూసే కృష్ణమూర్తి, కళ్యాణి పట్ల ఎంతో గౌరవాభిమానాలు చూపిస్తాడు. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు మనిషిగా జాలిపడ్డాడు. స్నేహితుడిగా సాయం చేశాడు. ఆమెపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన వారిని అసహ్యించుకున్నాడు. ఇవన్నీ చేసిన కృష్ణమూర్తి ఒక మంచి మనిషిగా మనసున్న వాడిగా పాఠకుడి దృష్టికి కన్పిస్తాడు. వసుంధర తనకు దగ్గర కావాలనుకున్నప్పుడు, ఆమెను ప్రలోభపెట్టే అవకాశం ఉన్నాకూడా. తను ఆమెకు సరికాదని తన అంతరాత్మకు తానే సర్ధిచెప్పుకుని ఇంకొన్ని మార్కులు కొట్టేస్తాడు. అనుకోకుండా ఇందిరతో ఒక రాత్రి కలిగిన అనుభవంతో పూర్తిగా మారిపోయి, పర్యావసనాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆలోచించకుండా ఇందిరను వివాహం చేసుకోవాలని గట్టిగా పట్టుపడతాడు. ఇక్కడ కృష్ణమూర్తి ఒక విశిష్ట వ్యక్తిగా గోచరిస్తాడు.
ఇంకా ఈ నవలలో రామినాయుడు, ఆనందరావు, అచ్యుతరామయ్య, డా|| చక్రవర్తి, వసుంధర, వైదేహి ఇలా ఎన్నో పాత్రలు ఉన్నాయి. డా|| చక్రవర్తి పాత్ర బహుశా కళ్యాణికి ఓ ముగింపు ఇవ్వటానికి సృష్టించిన పాత్ర అయి ఉండవచ్చు. ఈ పాత్రలో పెద్దగా కొత్తదనం కన్పించదు. ఒక సాధారణ పాత్ర అన్పిస్తుంది. ఇలాంటిదే వసుంధర పాత్ర కూడా. అలాగని ప్రాధాన్యం లేని పాత్రలు అనటానికి లేదు. కళ్యాణికి చేయూత అందించడం దగ్గర నుంచి ఆమె జీవితానికి ఓ దారి చూపించాలనే తపన ఈ పాత్రల్లో చూడవచ్చు. ఇవి లోకంలో మిగిలి ఉన్న మంచితనాన్ని సూచించే పాత్రలు. డా|| చక్రవర్తి చదువుకోసం పడిన ఇబ్బందులు, జీవన పోరాటం ఇవన్నీ కూడా బహుశా కళ్యాణి జీవితానికి దగ్గరగా, అంటే అన్ని కష్టాలు చవిచూసిన తర్వాతే ప్రశాంత జీవనం సాగిస్తూ కన్పిస్తాడు. కేవలం కళ్యాణిని తన సహ విద్యార్థిగా మాత్రమే ఎరిగిన వసుంధర, ఆమెకు సాయం చేసిన తీరు, సుఖాలు తప్ప కష్టం అంటే ఏమిటో ఎరగని ఆమె, ఎంతో గడ్డు సమయంలో కూడా స్నేహితురాలికి అండగా నిలబడటం, అన్నీ వదులుకొమ్మని పిన్నిగారి సలహాలూ, దెప్పిపొడుపులూ లెక్కచేయకుండా నిలబడ్డ వసుందరలో ఒక మానవతావాదిని చూస్తాము. ఇవే కాకుండా అలా ఎండాకాలంలో వానల్లాగా అడపాదడపా కన్పిస్తూ, పాఠకుల్ని పలకరించి వెళ్ళేపాత్రలు ఉన్నాయి. ఆనందరావు పాత్ర మనకు ఎక్కువసేపే కన్పించినా భూమికి భారంగా ఏ దిక్కూ తెన్నూ లేకుండా ఏదో పుట్టినందుకు బ్రతుకుతూ కన్పిస్తాడు. లేని దురలవాట్లు లేవు. ఇంటి వరుసకు తండ్రి అన్న మాటే గానీ, తండ్రిగా ఎక్కడా పాఠకుడి దృష్టిలో నిలువలేడు. అతన్ని పరిచయం చేస్తూ రచయిత్రి 'తనమీద పిడుగుపడుతోంటే చేతికందిన వాడిని ఆస్థానంలో నుంచో బెట్టి పారిపోగల ధీశాలి' అని చెప్పారు. అలా ఎందుకు చెప్పారో నవల చదివితే అక్షరాలా నిజమే అన్పిస్తుంది.
ఇలా చెప్పుకుంటూపోతే చెప్పగలిగినంత. సమస్యలతో సతమతమయ్యే వారికి. వాటిలోంచి ఎలా బయటపడాలనేది ఓ పెద్ద సమస్యలు అసలు సమస్యలు లేకుండా బ్రతికేవారికి సమస్యలు లేకపోవడమే ఓ పెద్ద సమస్య. చూస్తూపోతే ఎవరి జీవితంలో వారు సంతృప్తిపడటంలోనే ఆనందం ఉంది. ఈ నవలలో పాత్ర చిత్రణ మొదలు, కథా గమనం, అక్షరాల్లోని అమరిన సౌందర్యం అంతా వెరసి పాఠకుడిని ఏకబిగిన పుస్తకం చదివిస్తుంది. ప్రతిపాత్ర అంతరాల్లోకి తొంగి చూడగలిగేలా, ప్రతి పాత్ర అవస్థని పాఠకుడు తాను అనుభవించేలా చేయటంలో సఫలీకృతురాలయ్యారు రచయిత్రి. ఈ నవల ద్వారా ఏదేమైనా ఈ నవల ఆద్యంతం పరిశీలిస్తే నిజమైన కాలాతీత వ్యక్తులుగా ఇందిర, కృష్ణమూర్తి కనబడతారు. ఎలాంటి కష్టానికీ తలొగ్గక ఆత్మస్థైర్యంతో సమాజాన్ని సవాలు చేసేలా నిలబడిన ఇందిర ఒకవైపు ఎన్నో నీతి సూక్తులను సూక్తులుగానే వల్లెవేసే మనుషుల మధ్యలో ఎలాంటి బాధ్యతలు లేకుండా షోకిలారాయుడిగా జల్సా చేసే మనస్తత్వం కలవాడైనా తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనే ఆలోచనతో, ఇందిరను వివాహమాడే సాహసం చేసి నిలబడిన కృష్ణమూర్తి మరొకవైపు.
విద్వత్తును చాటటానికి వయసుతో పనిలేదు అనేమాట డా|| పి.శ్రీదేవి (ఎం.బి.బి.యస్)కి వర్తిస్తుంది. అతి తక్కువ వయసులోనే ఒక రచయిత్రిగా సాహితీ ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అనకాపల్లిలో జన్మించిన ఈమె విద్యాభ్యాసం కాకినాడ, విశాఖపట్నంలలో సాగింది. రచయిత్రిగా ఈమె చక్కని శైలి, భాషపై పట్టు పాఠకుడిని కట్టిపడేస్తుంది. అనటం కంటే, మనుషుల మనస్తత్వాలపై ఎక్కువ పట్టు సాధించారు అంటే సరిగ్గా సరిపోతుంది. మధుకలశం, కవితాసుమం, ఉరుములు - మెరుపులు, కలతెచ్చిన రూపాయి కథా సంకలనలు మొదలైనవి వీరు పాఠకులకు అందించిన రచనలు. 1929 సెప్టెంబర్ 21న జన్మించిన శ్రీదేవి 1961లో అంటే ఆమె 33వ యేట ఈ లోకాన్ని వదిలివెళ్ళటం పాఠకలోకానికి బాధ కల్గించే విషయం. అంత పిన్నవయసులోనే 'కాలాతీత వ్యక్తులు' నవల, అందులో పాత్ర చిత్రణ అంత అద్భుతంగా చిత్రించిన వీరు నిజంగా శ్లాఘనీయులు.