‘చూపు’ నవల ఆవిష్కరణ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాట చరిత్రకు సంబంధించిన సూక్ష్మ విషయ పరిజ్ఞానమే ఈ నవల సారాంశమని ‘చూపు నవల’ రచయిత డా.బి.ఎస్‌.రాములు అన్నారు. హైదరాబాద్‌లో డిసెంబరు 22న ఇందిరాపార్కు వద్దగల ఎన్టీఆర్‌ స్టేడియంలో బుక్‌ఫెయిర్‌ ఆధ్వర్యంలో ‘చూపు’ నవల పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పత్రికా సంపాదకులు టంకశాల అశోక్‌ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నవల రచయిత బి.ఎస్‌. రాములు మాట్లాడుతూ... ఈ నవలలో 15 పాత్రలు ఉన్నాయని, ప్రొ.లక్ష్మీపతి పాత్ర, ప్రొ.జయశంకర్‌ జీవితాన్ని పోలి ఉంటుందని ఆయన తెలిపారు. ఉద్యోగాలు దొరకక, బయటికి పోలేక ఉస్మానియా యూనివర్శిటీలోనే రెండు, మూడు పీజీలు చేస్తున్న విద్యార్థుల పరిస్థితులను నవలలో పొందుపర్చానన్నారు. సమస్త వర్ణ, వర్గ, కుల, మత, లింగాల అంశాలు, పరిణామాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్త్రీ ఆవేదన, రోదన, గొప్పతనం ఈ నవలలో చిత్రించానని చెప్పారు. బి.ఎస్‌. రాములు రచనలు అద్భుతంగా ఉంటాయనీ, చదివే వారికి తన శైలీ ఆలోచింపజేసేవిధంగా ఉంటుందని గోరటి వెంకన్న అన్నారు. రచయితలు కె.బి.గోపాలం, బైస దేవదాస్‌, డా.వింజమూరి ప్రకాష్‌, హిప్నో కమలాకర్‌, జూలూరి గౌరీశంకర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.