గురజాడ తెలుగు సాహిత్యానికి అడుగుజాడ వంటివాడని ప్రధానవక్త డా॥పి.సుబ్బారావుగారన్నారు. బి.వి.కె.గ్రంథాలయంలో నవంబరు 30న సాహితీ స్రవంతి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో గురజాడ శతవర్థంతి కార్యక్రమం జరిగింది. ఖమ్మం పట్టణంలోని ఈ సభకు కపిల రాంకుమార్ అధ్యక్షత వహించగా అతిథులుగా సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు కన్నెగంటి వెంకటయ్య, కార్యదర్శి రౌతు రవి, పట్టణ అధ్యక్షుడు సంపటం దుర్గా ప్రసాదరావు, కార్యదర్శి కంచర్ల శ్రీనివాస్, సాహితీస్రవంతి రాష్ట్ర బాధ్యులు ఆనందచారి, కవితా డిగ్రీ కళాశాల ఉప ప్రధానాచార్యులు డా.ఆంజనేయులు పాల్గొని సందేశాలిచ్చారు. తొలుత బి.వి.కె. విద్యార్థి ఆసుప్రసాద్ ‘‘దేశమును ప్రేమించుమన్న’’ గురజాడ గీతాలాపనతో సభ ప్రారంభమైంది. కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ మన విశాల భావాలకు ప్రేరణగా విశ్వజనీనమైన కవి గురజాడ అన్నారు.అగ్రహారీకుల ఆచార వ్యవహారాలలోని లోటుపాట్లను, ఛాందస భావాలను, మూఢనమ్మకాలను కన్యాశుల్కం ఎత్తిచూపిందన్నారు. అటువంటి సాంఘిక నాటకం మరొకటి ఇప్పటికి వరకు రాలేదన్నారు. మధురవాణి పాత్ర, గిరీశం, లుబ్దావధానులు బుచ్చమ్మ, సౌజన్యారావు పంతులు లాంటి పాత్రలద్వారా సమాజాన్ని కళ్లకు కనిపించేలా చేయటంలో కృతకృత్యుడై ఉన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర బాధ్యులు ఆనందాచారి మాట్లాడుతూ ఓ కొత్త ఒరవడికి, నూతన సాహిత్య ఆవిష్కరణకు రూపకర్తగాను, సాహిత్యంలో సంస్కరణలకు పూనుకున్న వ్యక్తి గురజాడ అన్నారు. గిడుగు, గురజాడలు మన తెలుగుకు వెలుగులని, జీవిత పర్యంతం భాషలో మార్పుకై పోరాడారని కొంత మందికి దూరమైనా తమ మార్గాన్ని విడువలేదన్నారు. నేటి తరం కవులు గురజాడలా తీవ్ర స్వరంతో రచనలు చేయాలని అభిప్రాయపడ్డారు. గొప్ప మానవతా వాదిగా, ప్రజా ప్రేమికుడిగా, దూరదృష్టిగల రచయితగా నేటి కాలపు దుష్ప్రభావాలను నాడే గుర్తించి కలం సంధించి విప్లకవి గురజాడ అని రాష్ట్ర గిరిజనసంఘం బాధ్యులు బండారు రవికుమార్ పేర్కొన్నారు. గురజాడ కవితా ఖండికలను కొన్ని చదివి వినిపించారు. కపిల రాంకుమార్ మాట్లాడుతూ విజయనగర సంస్థానంలో పనిచేస్తూ ఫ్యూడల్ వ్యవస్థలో పనిచేస్తూనే, నాటి సాంఘిక సామాజిక రుగ్మతలపై నగారా మోగించడమంటే మామూలు విషయం కాదని. ఆ తిరుగుబాటు స్థిర చిత్తుడైతే తప్ప వేరొక సామాన్యుడు చేయలేడని అన్నారు. తదుపరి డా.పి.సుబ్బారావు మాట్లాడుతూ కవిగానే కాకుండా చక్కటి చిత్రకళా విమర్శకుడిగా గురజాడను చూడాలని, ‘‘ప్రీమియర్ ఆఫ్ స్కల్‌ప్చర్’’ అనే రవివర్మ చిత్రాలను నిశితంగా పరిశీలించి అంతగా నచ్చలేదని చెప్పటంలో వారి పాఠవం అవగతమవుతుందని అన్నారు. విలియం వర్డ్స్ వర్త్, షేక్స్పియర్, మొదలగు పాశ్చాత్య కవులనెందరినో చదివాడు కాబట్టే పటిష్ఠమైన సాహిత్యాన్ని, గురజాడ భావితరాల కుపయోగపడే విధంగా సృజన చేసాడని అన్నారు. రౌతు రవి మాట్లాడుతూ విద్యార్థులు దేశమును ప్రేమించుమన్నా త్వరగా అర్థంచేసుకుని నేర్చుకొనటంలో ఆసక్తి చూపుతున్నారని, సామూహికంగా గురజాడ గేయాన్ని చదివిస్తున్నామని అంటూ కార్యక్రమాన్ని ఇంతమంది హాజరై చక్కటి సందేశాలిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పి వందన సమర్పణ చేశారు.` కపిల రాంకుమార్