కర్నూలు జిల్లాలో గురజాడ వేంకట అప్పారావు శతవర్ధంతి సభలు

సంఘ సంస్కర్త గురజాడవేంకట అప్పారావు శతవర్ధంతి సభలు కర్నూలు జిల్లాలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగాయి. సాహితీస్రవంతి జిల్లా కమిటీ పిలుపు మేరకు కార్యక్రమాలు జరిగాయి. 2014 నవంబర్‌ 30 నుండి ఏడాదిపాటు జిల్లాలలోని అన్ని ప్రధాన పట్టణాల్లో నిర్వహించడం. గురజాడ అప్పారావు రచనలు సామాన్య ప్రజానీకం వరకు చేరువ చేయాలని, గురజాడ రాసిన దేశభక్తి గేయం ప్రపంచగేయంగా ఐ.రా.స తీర్మానించాలని ఆ కేంద్ర ప్రభుత్వం ఆదిశగా కృషి చేయాలని సభల్లో పాల్గొన్న వక్తలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు.నంద్యాలలో...సాహితీస్రవంతి నంద్యాల డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో రావూస్‌ బాలుర హాస్టల్లో డివిజన్‌ అధ్యక్షులు శ్రీనివాసమూర్తి సభాధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్ఛేసిన సాహితీస్రవంతి రాష్ట్రకార్యదర్శి జంధ్యాలరఘుబాబు మాట్లాడుతూ ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌ అంటూ ప్రజలభాషలో రచన చేసిన గురజాడ మహానీయుడున్నారు. దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అంటూ ప్రజల్లో దేశభక్తిని ప్రబోధించారని అన్నారు. దైవంకన్నా దేశం ముఖ్యమని చాటిచెప్పిన సందేశాత్మక సంఘసంస్కర్త గురజాడ అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ప్రధాన కార్యదర్శి మాదాలశ్రీనివాసులు, ఉపాధ్యక్షులు అల్ఫోన్స్‌, కరీముద్దీన్‌, సమ్మద్‌, అవాజ్‌ రాష్ట్రకార్యదర్శి ముర్తుజాలు పాల్గొన్నారు.కర్నూల్లో...నగరంలో సాహితీస్రవంతి ` జనవిజ్ఞానవేదిక సంయుక్తంగా కార్మికకర్షక భవన్‌లో జెవివి జిల్లా ప్రధానకార్యదర్శి బిడి సుధీర్‌రాజు సభాధ్యక్షతన గురజాడ వేంకట అప్పారావు శతవర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సభలో సాహితీస్రవంతి జిల్లా సహాయకార్యదర్శి పులిచేరి మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ గురజాడ రచనలు సమాజాన్ని ప్రభావితం చేశాయన్నారు. సంఘశ్రేయస్సే గురజాడ సాహిత్య వస్తువన్నారు. సుధీర్‌రాజు మాట్లాడుతూ సామాజికచైతన్యానికి పర్యాయపదం గురజాడ అన్నారు. గురజాడ రచనలు నేటికీ ఆచరించదగ్గవన్నారు. ఈ కార్యక్రమంలో షరీఫ్‌, సత్యనారాయణరెడ్డి, మునిస్వామి పాల్గొన్నారు.ప్రజాశక్తి ఆధ్వర్యంలో...ప్రజాశక్తి కర్నూలు ఎడిషన్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన గురజాడ అప్పారావు శతవర్ధంతి ప్రారంభసభలో ముఖ్యఅతిథిగా ప్రజాశక్తి సంపాదకులు పాటూరిరామయ్య గురజాడ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ వ్యవహారిక భాషను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి గురజాడ వేసిన అడుగుజాడను అత్యధిక తెలుగుప్రజలు అనుసరించారన్నారు. వైదిక మనుధర్మవాదాన్ని పటాపంచలు చేసిన సామాజిక చైతన్యమూర్తి అన్నారు. కన్యాశుల్కం నాటకం ద్వారా సాంఘిక దురాచారాలను ఎండగట్టాడన్నారు. ఎడిషన్‌ ఇంచార్జ్‌ పానుగంటిచంద్రయ్య అధ్యక్షతన జరిగిన సభలో సిజియం ప్రభాకర్‌, జియం హరికిషోర్‌ సిపియం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్‌, ఎడిషన్‌ కమిటీ సభ్యులు మురళి, ఎం. మంగయ్య, నరసింహులు, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. పిఎన్‌యం నాయకులు బసవరాజు, ఆర్‌ఏ వాసులు ఆలపించిన అభ్యుదయ గేయాలు అలరించాయి.కోడుమూర్‌లో...ఆధునిక సాహిత్య క్రాంతిదర్శి గురజాడ వేంకటఅప్పారావు శతవర్ధంతి సభ కోడుమూర్‌ పట్టణంలో శ్రీశ్రీనివాస ఆంగ్లమాధ్యమ పాఠశాల ఆవరణలో సాహితీస్రవంతి కోడుమూర్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. సభాధ్యక్షులుగా నరేంద్రబాబు, ముఖ్యఅతిథిగా విశ్రాంత ఉపాధ్యాయులు కవి అచ్చయ్య పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ తెలుగు సాహితీ వినీలాకాశంలో గురజాడ ధృవతార అన్నారు. సామాజికకోణంలో సాహిత్యరచన కొనసాగించిన మానవతావాది అన్నారు. గురజాడ రచనల్లోని స్త్రీ సామాజికమార్పు దిశగా పయనించిందన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీస్రవంతి నాయకులు మహమ్మద్‌షఫి, నగేష్‌, సురేష్‌, పాల్గొని ప్రసంగించారు.ఎమ్మిగనూర్‌లో...కన్యాశుల్కం నాటకసృష్టికర్త, ఆధునిక సాహిత్యానికి అడుగులు నేర్పిన ప్రసిద్ధ సాహితీవేత్త గురజాడ వేంకట అప్పారావు శతవర్ధంతి సభ ఎమ్మిగనూను పట్టణంలో సాహితీస్రవంతి డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డివిజన్‌ కమిటీ నాయకులు రచయిత్రి నాగమణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి కెంగారమోహన్‌ మాట్లాడుతూ తెలుగుసాహిత్యానికి దిక్సూచి అన్నారు. దిద్దుబాటు, మెట్టిల్డా కథల్లోని స్త్రీ పాత్రలు సామాజిక మార్పుకు స్త్రీ చైతన్యానికి ప్రతిబింబాలన్నారు. కన్యాశుల్కం నాటకానికి 112 సవత్సరాలైందని నేటికి అత్యంత ప్రజాదరణ పొందిన నాటకమన్నారు. తెలుగుజాతికి సాహిత్యచైతన్యం కలిగించిన మహనీయుడన్నారు. దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా గేయం ప్రపంచగేయంగా ఆమోదించాలన్నారు. ఈ దిశగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కృషిచేయాలన్నారు. అలాగే గురజాడ శతవర్ధంతి సభలు అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపియస్‌ నాయకులు దేవసహాయం యుటిఎప్‌ రాష్ట్రనాయకులు శ్రీనివాసులు, రాఘవేంద్ర, నాగరాజులు పాల్గొన్నారు.ఆదోనిలో....ఆదోని డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని బిసి సంక్షేమ వసతి గృహంలో గురజాడ శతవర్ధంతి సభ జరిగింది. ఈ సభలో సాహితీస్రవంతి డివిజన్‌ నాయకులు పరిశోధక విద్యార్థి రాజా జయచంద్రన్‌ మాట్లాడుతూ గురజాడ సాహిత్య సృజన ఆంగ్లభాషతో ప్రారంభమై ఇండియన్‌ లీజర్‌ హవర్‌ పత్రికలో సారంగధర శీర్షికతో పద్యాలు రాశాడన్నారు. గురజాడ ప్రభోధకవిత్వ పితామహుడన్నారు. గురజాడ సాహిత్యాన్ని ప్రతి తరగతిలో పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. వర్ధమాన కవులకు ప్రసిద్ధ కవులకు గురజాడ సాహిత్యం నిఘంటువు లాంటిదన్నారు. ఈ కార్యక్రమానికి డివిజన్‌ అధ్యక్షలు అవుల బసప్ప అధ్యక్షత వహించగా జిల్లానాయకులు కెంగారమోహన్‌, నల్లారెడ్డి, రఘురాం, యుఎన్‌ ప్రేమ్‌కుమార్‌, పాల్గొన్నారు.