అనంతపురంలోని ఆర్టీటి ఎకాలజీ సెంటర్‌లో జనవరి 4న శాంతినారాయణ కథా సంపుటాలు ‘పల్లేరు ముళ్ళు, కొండచిలువ కోరల్లో’ ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభలో రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, గోరేటి వెంకన్న, సింగమనేని నారాయణ, బండి నారాయణస్వామి, అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్ డి.చమన్‌సాబ్, ఖాదర్ మొహిద్దీన్, వేదగిరి రాంబాబు, చిలుకూరి దేవపుత్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సంపుటాలలోని కథలన్నీ సమకాలీన సమాజానికి దర్పణం పడతాయని ప్రాంతీయ అస్తిత్వ అవసరాన్ని చాటుతాయని వక్తలు అన్నారు. విమలాశాంతి సాహిత్య సాంఘిక సేవా సమితి వారు నిర్వహించిన కవితల పోటీల్లో గెలుపొందిన యువరచయితలకు అతిథులు జ్ఞాపికలు అందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డిని ఈ వేదికపై సత్కరించారు. ఈ సభలో జూపల్లి ప్రేమ్‌చంద్, ఆకుల రఘురామయ్య, డా. వి.ఆర్. రాసాని, నాయిని కృష్ణమూర్తి, పాలగిరి విశ్వప్రసాద్, వేంపల్లి షరీఫ్, ఇనాయతుల్లా, పినాకపాణి, డా॥ రాధేయ, మల్లెల నరసింహమూర్తి, డా॥ రమేష్‌నారాయణ, కెరె జగదీష్, సడ్లపల్లి చిదంబర రెడ్డి, డా॥ షమీవుల్లా, అప్పిరెడ్డి హరినాథరావు, కోగిరి జయచంద్ర, తోట నాగరాజు, యస్. గిరిప్రసాద్‌రాయ్ తదితరులు పాల్గొన్నారు.