'ఆధునిక సాహిత్య పరిణామ క్రమం' పుస్తకావిష్కరణ

కడపలో సి.పి. బ్రౌన్‌ గ్రంథాలయంలో సెప్టెంబర్‌ 22న జరిగిన 'ఆధునిక సాహిత్య పరిణామక్రమం' పుస్తకావిష్కరణ సభలో ప్రసంగిస్తున్న కేతు విశ్వనాథ రెడ్డి. చిత్రంలో పిళ్ళా కుమారస్వామి, మూల మల్లిఖార్జున రెడ్డి, ఎ. రఘునాథరెడ్డి.పిల్లా కుమారస్వామి రచించిన 'ఆధునిక సాహిత్య పరిణామ క్రమం', 'రాయలసీమ ఆధునిక సాహిత్య పరిణామ క్రమం' పుస్తకావిష్కరణ సభ కడపలోని సి.పి. బ్రౌన్‌ గ్రంథాయలయంలో సెప్టెంబర్‌ 22న జరిగింది. ఈ  సభలో ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి ముఖ్య అతిగా పాల్గొని మాట్లాడారు. గురజాడ సాహిత్యంతో తెలుగుభాషలో సాహితీ పునరుజ్జీవన ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. వైవియు లలిత కళల విభాగం ఆచార్యులు డాక్టర్‌ మూల మల్లికార్జున రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ రాయలసీమలో మొట్టమొదట ప్రబంధం వచ్చిందని అన్నారు. నవలల్లో కూడా రాయలసీమ వెనుకబడిలేదని అన్నారు. పిల్లా కుమారస్వామి మాట్లాడుతూ దళితుల్ని, స్త్రీలను, పిల్లలను సమదృష్టితో చూసే సాహిత్యమే ఆధునిక సాహిత్యమని అన్నారు. సాహిత్యంలో వచ్చిన వివిధ ధోరణుల కారణంగా ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్య సృజనలో సాహిత్యకారులు ఐక్యంగా పనిచేయడంలోనే సమాజ ప్రగతికి వారు చోదక శక్తులుగా నిలుస్తారని అన్నారు. సాహితీస్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.రఘునాథ్‌ రెడ్డి సభకు అధ్యక్షత వహించారు. జిల్లా కమిటీ సభ్యులు వైఎల్‌ నరసింహులు స్వాగతం పలికారు.