'నిరసన స్వరాలు' ఆవిష్కరణ

విజయవాడలో ఎం.బి. విజ్ఞానకేంద్రంంలో సెప్టెంబర్‌ 9న జరిగిన 'నిరసన స్వరాలు' కవితా సంకలనం ఆవిష్కరణ సభ. చిత్రంలో ఆవిష్కర్త పాటూరు రామయ్య, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, చల్లపల్లి స్వరూపరాణి, ఎం.వి.ఎస్‌. శర్మ, ఆండ్ర మాల్యాద్రి, వొరప్రసాద్‌నిరసన గళాలను సమైక్యంగా వినిపించాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గరగపర్రు, దేవరపల్లి, అగిరిపల్లి, చిత్తూరు జిల్లా మహాభారత సంఘటలన నేపథ్యంలో జులై 24న జాషువా వర్థంతి సభలో చదివిన కవితల సంకలనం 'నిరసన స్వరాలు' ఆవిష్కరణ సభ విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో సెప్టెంబర్‌ 9న జరిగింది. ఈ సభకు ప్రధానవక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఏ సమాజంలోనైనా మార్పు అనివార్యమన్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటలను జాషువా తన కవితల్లో పేర్కొన్నారన్నారు. జాషువా రచనలను సొంతం చేసుకునే పని కవులందరూ మొదలుపెట్టాలన్నారు. సమాజాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. పూర్వ కవుల రచనల్ని చదవడం వల్ల మెరుగ్గా కవితలు రాయొచ్చ న్నారు. దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చి ఉంటే గౌరీ లంకేశ్‌ హత్య లాంటి ఘటనలు జరిగేవి కాదన్నారు. 70 ఏళ్లలో దేశం ఏం మారిందని ప్రశ్నించారు. ఆధునిక తెలుగు కవుల చరిత్రను నిరసనల చరిత్రగానే భావించాలన్నారు. ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నా జరగాల్సిన దారుణాలు జరిగిపోతున్నాయన్నారు. నిరసన స్వరాలులో ప్రచురించిన కవితల గురించి వివరించారు. నిరసన స్వరాలు సంకలనాన్ని ఆవిష్కరించిన ప్రజాశక్తి ఎడిటర్‌ పాటూరు రామయ్య మాట్లా డుతూ విప్లవానికి సాహిత్యం స్ఫూర్తినిస్తుందన్నారు. సాహిత్యం లేకపోతే ప్రజలు చైతన్యవంతులు కాలేరన్నారు. ప్రజా ఉద్యమాలను, పోరాటాలను అధ్యయనం చేసి కవితలు రాయాలని సూచించారు. రచయితల ఉద్వేగం ప్రజలకు అర్థ మయ్యేలా ఉండాలన్నారు. ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ చల్లపల్లి స్వరూప రాణి మాట్లాడుతూ రచయితలు ఎటువైపో తేల్చుకోవాల్సిన పరిస్థితి నేడు ఏర్పడిందన్నారు. పీడితుల పక్షాన అండగా నిలవాలన్నారు. హిందూత్వానికి ప్రతిపక్షంగా నిలబడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాషువా సాంస్క తిక వేదిక చైర్మన్‌ ఎంవిఎస్‌ శర్మ, కన్వీనర్‌ పిఎన్‌ఎం కవి, సాహితీ స్రవంతి అధ్యక్షులు వొరప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి కె. సత్యరంజన్‌, కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, కవులు, రచయితలు, అభ్యుదయవాదులు పాల్గొన్నారు.