పాఠకుడిగా నా స్పందన

- డా. హనుమంతరాజు, 9441130264సాహిత్య ప్రస్థానం ఏప్రిల్‌ సంచిక చూసిన తరువాత ఒక బాధ్యత గల్గిన పాఠకుడిగా నా స్పందనను తెలియజేయకుండా ఉండడం తప్పని ఈ లేఖని వ్రాస్తున్నాను. అయోమయంగా, భయంగా, జుగుప్సగా ఉన్నటువంటి మన వాతావరణాన్ని (రజకీయ, సామాన్య, ఆర్థిక) కొంతవరకు మర్చిపోవటానికి మంచి సాహిత్య పఠనం కొంచెం హాయినిస్తుంది కదా అటువంటి కథలు, వ్యాసాలు, ప్రచురిస్తున్న ఈ పత్రికకు సలాము చేస్తూ, ఒక పాఠకుడిగా నా స్పందనను తెలియజేస్తున్నాను. ఇది వ్రాస్తున్న సమయంలో ఒక ప్రక్క ఒక కార్పొరేటు సినిమా ఆడియో, వీడియో రిలీజ్‌, మరొక వైపు అంగాంగ ప్రదర్శన చేస్తున్న నటుల యొక్క శరీర ఊపులతో మొదలవుతున్న ఐపిల్‌ క్రికెట్‌ ప్రారంభం జరగుతున్నది. ఆ కార్పొరేటు సినిమా (మహేష్‌బాబు) కమ్యూనిస్టు సినిమా అని, బాగుంటుందని, స్వయంగా నా పిల్లలు కూడా అంటూంటే నాకు నవ్వు వచ్చింది. కమ్యూనిష్టు, పూలే అంబేద్కర్‌, థెరిస్సా లాంటి వాళ్ళ ఫొటోలు, పాటలు కూడా ఫక్తు సినిమా రాజకీయానికి, వ్యాపారానికి వాడుకుంటూ చివరికి నకిలీకి, అసలికి తేడా లేకుండా చేస్తున్నారు. కులాన్ని వివాహానికి, ఓటుకు కాకుండా హీరో కుల సంఘాలకు, సరదాగా, సినిమా చూడటానికి కూడా గజ్జిగా వాడుకుంటున్న సమాజానికి మంచి సాహితయం అవసరమని, అట్లాంటి సాహిత్యాన్ని తెస్తున్న ఇట్లాంటి పత్రికలలోకి ఇంకా, ఇంకా వెళ్ళి యువ పాఠకులకు చేరాలని నా ఆకాంక్ష. కాని ఈ కోరిక తీరదని, దీనికి ఎవరో వస్తారని కాకుండా, మనమే నడుం కట్టాలని సహపాఠకుని సమాజాన్ని వేడుకుంటున్నాను.ఇకపోతే ఈ సంచికలో అన్ని వ్యాసాలు, కథలు చాలా బాగున్నాయి. నేను దాదాపు 5-6 సం.ల నుండి రెగ్యులర్‌గా ఈ పత్రికను చదువుతున్నాను. మొదటిగా ఈ సంచికలో సుబ్రహ్మణ్య భారతి గురించి వ్రాసిన 'రాధాకృష్ణ శర్మగారు' 'సుబ్రహ్మణ్య భారతి ప్రతి రచనలో దేశాభిమానం, మానవతాదృష్టి కనిపిస్తాయని, ఆయన మామూలు కవులవలె ఊహా ప్రపంచంలో విహరించకుండా, యదార్థ ప్రపంచాన్ని గుర్తించాడని, ఆయన దేశాన్ని, బానిసల నుంచి రక్షించడానికి ఎన్నో రచనలు చేశాడని'' వ్రాశారు. ఇంకా ఆనాటి కాలంలో ప్రపంచంలో ఏమూల ఏ దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఎంతో ఆనందించాడని పేర్కొన్నారు.రెండవదిగా మా గుంటూరువాసి డా. కడియాల రామమోహన్‌రాయ్‌ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. వారి నాన్ననగారు హేతువాది, నాస్తికులని, ఆయన ద్వారా మార్క్సిజం చదివి చిన్నతనంలో కమ్యూనిష్టు వైపు మోగ్గానని వ్రాశారు. ప్రస్తుతం ఉన్న విమర్శకులలో పాపినేని శివశంకర్‌, రాయ్‌గారు, తెలకపల్లి రవిగారు కాకుండా అస్తమించిన కొడవటిగంటి కుటుంబరావు గారు, అద్దేపల్లిరావు మొదలగు ఉత్తమ విమర్శకులలో ఈయన ఒక్కడు కదా. ఆయన చివరిగా ''రచయితలు, రచనలు ఏ మంచికి హాని చేస్తాయో, ఏ చెడ్డకు సాయం పడతాయో'' పరిశీలించుకుని రచనలు చెయ్యాలని సూచించారు.ఇంకొక వ్యాసంలో డా.విజయ్‌బక్షి గారు వీరేశలింగం గారి గురించి వ్రాస్తూ ఆయన తాను రచనలు చేసేటప్పుడు వాటి శాశ్వతత్వానికంటే, అప్పుటి తాత్కాలిక ప్రయోజనానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని వ్రాశారు. ఇంకా వీరేశలింగం గారి రచనలు, వ్యాసాలు, నాటకాలు, ఏవైనా సంస్కరణ మార్గం వైపుకి దారితీసేవని వ్రాసారు. ఆ సంస్కరణ భాస్కరుని కాలంనాటి మూఢవిశ్వాసాలు, దురాచారాలు, వేశ్యాలోలత్వం, బాల్యవివాహాలు ఇంకా ఇప్పటికీ మనం చూస్తునే ఉన్నాం.విజయలక్ష్మి గారి, బ్రౌన్‌ గారి రచనలు, ఆయన మన తెలుగు, సంస్కృత భాషలకు చేసిన సేవలను ఆమె విశ్లేషణలో పేర్కొన్నారు. బ్రౌన్‌ తెలుగువాడు కాకపోయినా తెలుగుభాష ఉన్నంతవరకు ఆయనను మనం మర్చిపోకూడదని తెలిపారు.రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారు అనంతపుర వాస్తవ్యుడైన జగదీష్‌ గురించి ఎంతో విషయాన్ని చెప్పారు. జగదీష్‌ గారు మానవత్వాన్ని అన్వేషించి, మానవత్వాన్ని కలవరించి, పలవరించారని వ్రాశారు. ఇంకా జాషువాగారి ఏ కవితలోనైనా అస్పృశ్యత దాగియున్నట్లు, జగదీష్‌ కవితలో మానవత్వం ఉంటుంది అని ఉదహరించడం చాలా నిజం. ఇంకోమాటగా రాచపాళెం గారు యువతను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నంతగా, దేశ నిర్మాణంలో వాడుకోలేరని బాధపడ్డారు. ఈ మాటను వినే యువత ఈనాడు మనకు కనపడరు. ఈ విధంగా ఈ ఏప్రియల్‌ సంచికలో వచ్చిన ''దేవుడు తప్పిపోయాడు'' కవిత్వంపై వచ్చిన ప్రశంస బాగుంది. తనచుట్టూ ఉన్న సమస్యలను వ్రాయడంలో విల్సన్‌రావు ధిట్ట అనీ శ్రీ మోహనరావు పేర్కొన్నాడు.జ్వాలాముఖి గారి గురించి వ్యాసంలో ''ఆనాటి నుంచే అన్ని విషయాలకు భయపడుతున్న యువతను, ప్రతి సమస్యను ధైర్యంగా ''లెటజ్‌ ఫేసిట్‌'' అనే వాయిసిచ్చాడని ద్వానాశాస్త్రిగారు వ్రాశారు. ఇంకా బలహీనులకు తెలివి రానంతవరకే బలవంతుల రాజ్యం అని, బలహీనులకు తెలివివస్తే వాళ్ళ ఆటలు సాగవని జ్వాలాముఖి అభిప్రాయంగా పేర్కొన్నారు. కాని ఈనాటికి కూడా అది నిజం కాలేదని మనం తెలుసుకోవాలి.ఈ రకంగా ఈ సంచికలో ఇంకా విజయ్‌గారి కవిత్వం, శ్రీశ్రీపై సింగంపల్లి అశోక్‌కుమార్‌ గారి విశ్లేషణ ఎంతో బాగుంది. చివరిగా ప్రసాద్‌గారు ''ప్రమాదం'' అనే కథలో సమాజంలో ఇప్పుడున్న సమస్యలను బాగా ఎత్తిచూపారు. మనదేశంలో స్వాములు, స్కాములు గురించి కోరికలు తీర్చని దేవుళ్ళకంటే క్రికెట్‌ ఆటగాళ్ళు, సినిమావాళ్ళకు ఉండే క్రేజ్‌ గురించి బాగా వ్రాశారు. టీవి ఛానల్లపై బాగా చురకలు వేశారు. ఏమి తినాలో, ఎలా తినాలో చెప్పేవి కొన్ని, ఊపిరి ఎట్లా తీసుకొని, ఎక్కువ రోజులు ఎట్లా బతకాలో కొన్ని అని రాశారు.ఈ విధంగా ఈ సంచిక గురించి ఎంత వ్రాసినా తక్కువే. కాబట్టి ఉడతాభక్తిగా ఈ వ్యాస కర్తలకు నా నమస్కారాలు తెలుపుతూ ఈ లేఖను వ్రాస్తున్నాను. నేను గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా చేస్తున్నాను. కానీ నా ఆకాంక్ష కొరకు పత్రికలో వచ్చే సాహిత్యాన్ని పూర్తిగా అర్థం కాకపోయినా చదువుతుంటాను.