విజయవాడలో సి.వి. సంస్మరణ సభ

ప్రస్తుత సమాజంలో మూఢ నమ్మకాలు వేలం వెర్రిగా మారాయని, వాటికి ప్రస్తుత రాజకీయ వ్యవస్థే అస్తిత్వం ఇస్తోందని, ఈ సమాజానికి సివి (చిత్తజల్లు వరహాలరావు) రచనలు కాగడాలు కావాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సంగమం (లౌకిక, ప్రజాతంత్రవాదుల ఐక్యవేదిక) ఆధ్వర్యంలో సివి సంస్మరణ సభ విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో నవంబర్‌ 15న జరిగింది. సివి నివాళి, ఇతర వ్యాసాల సంకలనం 'మన తరం ప్రజా స్వరం' పుస్తకాన్ని ఈసభలో ప్రజాశక్తి సంపాదకులు పాటూరు రామయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కుల వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాల నుంచీ ఉందని, దీనిపై జమిలిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కల్బుర్గి, గౌరీ లంకేష్‌ వంటి వారు ప్రయత్నిస్తే హత్యకు గురయ్యారన్నారు. సమాజ లోతులకు వెళ్లి మనం కనీ వినీ ఎరుగని విషయాలను సులువుగా అర్థమయ్యేలా చెప్పిన గొప్ప సాహిత్య మేధావి సివి అని రాఘవులు కొనియాడారు. ఆయన రచనలు ఒక తరాన్ని ప్రభావితం చేయగలిగాయని చెప్పారు. 300 ఏళ్లలో నిర్మించలేని ప్రత్యామ్నాయాన్ని కేవలం 15 రోజుల్లో ఎలా ఆవిష్కరిస్తారో సివి రచించిన 'ప్యారిస్‌ కమ్యూన్‌'లో కొట్టొచ్చిన్నట్లు కనపడుతుందన్నారు. ఒక తరాన్ని ప్రభావితం చేసి సమాజంలో ఉత్ప్రేరక పాత్ర పోషించిన అతి కొద్ది మందిలో సివి ఒకరని చెప్పారు. విస్మరణకు గురైందే చివరికి గొప్ప సాహిత్యం అయిందని చెప్పారు. సివి రచనలను భవిష్యత్తు మార్పునకు, క షికి కరదీపికగా వాడుకోవాలని సూచించారు. నాగార్జునా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ చల్లపల్లి స్వరూపరాణి మాట్లాడుతూ ప్రజాశక్తి ప్రచురణలతోనే సివి రచనలకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. భారతీయ సాహిత్యాన్ని సివి సాహిత్యం ప్రభావితం చేసిందన్నారు. సాహిత్యకారులకు సివి రచనలు నచ్చలేదన్నారు. దళిత సాహిత్యకారులు , సాహిత్య పురవీధుల్లోకి రావడానికి సివియే కారకులని చెప్పారు. సోషల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ ఎన్‌ అంజయ్య మాట్లాడుతూ ప్రస్తుతం పురాణాల చాటున రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. విరసం సభ్యులు సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ సివి రచనలు కాలాన్ని జయించాయన్నారు. కులానికి, మతానికి ప్రాముఖ్యం ఉన్నంత కాలం, ఆలోచన, ఆచరణ, మానసిక వెనుకబాటుతనంఉన్నంత కాలం సివి రచనలు ఉంటాయని చెప్పారు. ప్రజా సాహితి ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబు, సంగమం కన్వీనర్‌ సి ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ఎడిటర్‌ కె ఉషారాణి, సాహితీ స్రవంతి అధ్యక్షులు వొరప్రసాద్‌, జన సాహితి సభ్యులు దివికుమార్‌, నాస్తిక సమాజం సభ్యులు కె అయ్యన్న, ప్రొగ్రెసివ్‌ ఫోరం సభ్యులు జమిందార్‌, శ్రీశ్రీ సాహిత్యనిధి తరపున సింగంపల్లి అశోక్‌ కుమార్‌, సమన్విత తరపున శమంతకమణి, హేతువాద సంఘం సభ్యులు నార్నె వెంకట సుబ్బయ్య, ఎపి దళిత మహాసభ సభ్యులు పి క ష్ణ, శ్రీశ్రీ ప్రింటర్స్‌ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.