రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం శతవర్థంతి

కందుకూరి వీరేశలింగం శతవర్థంతి సంవత్సర ప్రారంభ కార్యక్రమం మే 27న రాజమహేంద్రవరంలోని గనిరాజు కళ్యాణ మండపంలో సాహిత్య, సాంస్క ృతిక, కళా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సాహితీస్రవంతి గౌరవ అధ్యక్షులు తెలకపల్లి రవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ''కార్యశూరుడు వీరేశలింగం, కదం తొక్కి పోరాడిన సింగం' అని మహాకవి శ్రీశ్రీ వర్ణించినట్లు సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని అన్నారు. సాహిత్య, సాంస్కృతిక, కళా, సామాజిక, ప్రజా సంఘాల ఆధ్వర్యాన తొలుత కోటిపల్లి బస్టాండు వద్ద ఉన్న వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభా వేదిక వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సభలో తెలకపల్లి మాట్లాడుతూ బుల్లి, వెండి, రాజకీయ తెరలపై మూఢ నమ్మకాల ప్రచారం కన్పిస్తోందన్నారు. సాహితీ ప్రియులు, కవులు, కళాకారులు, ప్రజాశక్తి, ప్రజా సంఘాలు వీరేశలింగం వారసత్వాన్ని అందుకోవాలని కోరారు. దురాచారాలపై అగ్ని తరంగమని, వేమనకు కొనసాగింపు వీరేశలింగమని చెప్పారు.సామాజిక కార్యకర్త మంతెన సీతారాం మాట్లాడుతూ వీరేశలింగాన్ని స్ఫూర్తిగా తీసుకుని మూఢాచారాలపై సామాజిక ఉద్యమాన్ని నిర్వహించాలన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్‌ మాట్లాడుతూ వీరేశలింగం భావాలు మూలపడటం వల్ల సమాజం అజ్ఞానం వైపు వెళ్తోందన్నారు.  సమాజాన్ని విజ్ఞానం వైపుగా తీసుకెళ్లడానికి వీరేశలింగం రచనలు ఎంతో ఉపయోగపడ్తాయని అన్నారు. ఈనాటికీ మూఢనమ్మకాలను ప్రజల్లో వ్యాప్తిచేయడానికి స్వార్థశక్తులు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ఈ శతవర్థంతి సందర్భంగా వీరేశలింగం భావజాలాన్ని విస్త ృతంగా ప్రజలకు చేర్చడానికి అందరూ కృషిచేయాలని కోరారు. ప్రజాశక్తి బుక్‌హౌస్‌ జనరల్‌ మేనేజర్‌ కె.లక్ష్మయ్య మాట్లాడుతూ వీరేశలింగం రచనలను ప్రజాశక్తి బుక్‌హౌస్‌ ప్రచురిస్తోందని చెప్పారు. ప్రజాశక్తి రాజమహేంద్రవరం ఎడిషన్‌ మేనేజర్‌ టిఎస్‌.ప్రకాష్‌ మాట్లాడుతూ కందుకూరి ఆశయాలను, ఆస్తులను కాపాడుకునేందుకు ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముందన్నారు. రచయిత్రి డాక్టర్‌ విజయభక్ష్‌ మాట్లాడుతూ అన్నికులాలకు, మతాలకు కందుకూరి తమ సంస్థల్లో, ట్రస్టులో స్థానం కల్పించారన్నారు. సభాధ్యక్షులు, రాజమహేంద్రి ఆలోచనా వేదిక నాయకులు పి.సతీష్‌ మాట్లాడుతూ అశాస్త్రీయ భావాలకు వ్యతిరేకంగా అందరూ కలిసి ఐక్యంగా కృషి చేయాలని అన్నారు. ప్రజానాట్యమండలి కార్యరక్తరలు ప్రదర్శించిన సాంస్క ృతిక కార్యక్రమాలు, వేమన రూపకం ఆకట్టుకున్నాయి.