ఎస్‌డివి అజీజ్‌కు పండిత హీరాలాల్‌ స్మారక పురస్కారం

  కర్నూలు సాహిత్య చరిత్రలో ప్రముఖ పండితుడు హీరాలాల్‌ అని, పరిశోధకుడుగా పలు గ్రంథాలు రాసి కర్నూలు చరిత్రను తెలుగు జాతికి అందించారని సాహితీస్రవంతి గౌరవ అధ్యక్షులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ఆగస్టు 19న కర్నూలులో హీరాలాల్‌ ద్వితీయ స్మారక పురస్కార ప్రదానోత్సవ సభ గన్నమరాజు సాయిబాబా అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలకపల్లి రవి పురస్కారాన్ని ఎస్‌డివి.అజీజ్‌కు అందజేశారు. ఆయన మాట్లాడుతూ సాహిత్య సుక్షేత్రం కర్నూలు అని తెలిపారు. బుచ్చిబాబు చివరకు మిగిలేది వంటి రచనలను కర్నూలులో ఉన్నప్పుడే రాశారన్నారు. సమకాలీన రచయితలపై పరిశోధన, పరిశీలన దష్టి రచయితలకు ఉండాలని, అది కొనసాగినప్పుడే గొప్ప రచనలు వస్తాయని తెలిపారు. చరిత్రను నిరంతరం అధ్యయనం చేయాలని, అప్పుడే సమాజంలో అసలైన చరిత్ర ఆవిష్క తమవుతుందని చెప్పారు. కర్నూలుపై మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. కర్నూలు రాజధానిగా కొన్నాళ్లయినా ఉన్నందుకు కొంత చరిత్ర, గుర్తింపు ఉందని తెలిపారు. అనంతరం గన్నమరాజు సాయిబాబా, రచయిత, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖాధికారి వాడ్రేవు చిన వీరభద్రుడు రచించిన 'దుఃఖం లేని దేశం', 'కబీర్‌ దోహ' తెలుగు అనువాదాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సిల్వర్‌ జూబ్లీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్‌ దండెబోయిన పార్వతి సమీక్షించారు. వాడ్రేవు వీరలక్ష్మీదేవి, వాడ్రేవు చిన వీరభధ్రుడు, ప్రముఖ న్యాయవాది ఎమ్‌డివై.రామమూర్తి, హీరాలాల్‌ కుమారుడు సీనియర్‌ జర్నలిస్టు విద్యారణ్య తదితరులు మాట్లాడారు. కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.