'జుమ్మా' కన్నడ అనువాదానికి పురస్కారం

 

వేంపల్లి షరీఫ్‌ కథల సంపుటి 'జుమ్మా' కన్నడ అనువాదానికి కర్నాటక ప్రభుత్వం 'కన్నడ సాహిత్య పరిషత్‌ పురస్కారం' ప్రకటించింది. ఏటా కన్నడలోకి అనువాదమైన ఉత్తమ సాహిత్యానికి ఈ పురస్కారం ఇస్తారు. 2017 సంవత్సరానికి 'జుమ్మా'ను ఉత్తమ అనువాద కథా సంకలనంగా ఆ ప్రభుత్వం ప్రకటించింది. కడపజిల్లా వేంపల్లెకు చెందిన షరీఫ్‌ తాను రాసిన 12 కథలను 'జుమ్మా' పేరుతో సంకలనం చేశారు.  2011లో సూఫీ పబ్లికేషన్స్‌ తరపున ఈ పుస్తకం వెలువడింది. 2012లో ఈ పుస్తకానికి గాను కథకుడు వేంపల్లె షరీఫ్‌కు కేంద్రం 'సాహిత్య అకాడెమి యువ పురస్కారం' ప్రకటించింది. 'జుమ్మా' కథాసంకలనాన్ని ప్రముఖ కన్నడ రచయిత సృజన్‌ అనువాదం చేశారు. కర్నాటకలో  ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థ  'నవ కర్నాటక పబ్లికేషన్స్‌'ఈ పుస్తకాన్ని అచ్చువేసింది. తెలుగులో ప్రముఖుల గుర్తింపు పొందిన ఈ పుస్తకానికి కన్నడలోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఆగస్టు 12, 2018న బెంగళూరులో కన్నడ సాహిత్య పరిషత్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ కవి ఎల్‌. హనుమంతయ్య చేతుల మీదుగా సృజన్‌ ఈ పురస్కారం అందుకున్నారు.