వైల్డ్‌వింగ్స్‌ ఆంగ్ల కవితా సంపుటి పరిచయ సభ

 

సమాజంలోని అనేక సంఘటనల ద్వారా ప్రభావితం అయిన కవి మనసులోని భావాలకు అక్షర రూపం 'వైల్డ్‌వింగ్స్‌' అని పలువురు వక్తలు అన్నారు. వర్థమాన కవయిత్రి స్రష్టవాణి కొల్లి ఆంగ్ల కవితా సంపుటి పుస్తక పరిచయ సభలో వారు పాల్గొన్నారు. సాహితీస్రవంతి ఆధ్వర్యంలో విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో సెప్టెంబర్‌ 22న జరిగిన ఈ సభలో వి.ఆర్‌. సిద్ధార్థ కళాశాల ఆంగ్లాచార్యులు బాలాంత్రపు ప్రసూన మాట్లాడుతూ సృజనాత్మకమైన భావాలకు అక్షర రూపం ఇచ్చి పుస్తకంగా తీసుకురావటం అభినందనీయమన్నారు. మహిళలు, ఆకలి చావులు, రైతులు, ప్రకృతి, యువత వంటి అంశాలను తన కవిత్వంగా విభిన్నంగా వ్యక్తీకరించారన్నారు. తొలికవితా సంపుటి కావడంతో కొన్ని కవితల్లో సీనియర్‌ కవుల ప్రభావం కనపడుతుందని, కొత్తగా రాస్తున్న వారికి ఇది సహజమేనని అన్నారు. ముందు ముందు మరింత మంచి కవిత్వాన్ని రాసే శక్తి ఈ కవయిత్రికి ఉన్న విషయాన్ని ఈ తొలికవితా సంపుటిలో మనం గుర్తించవచ్చని అన్నారు. యువ రచయిత్రి ఆర్‌. ఇందు కవితలను విశ్లేషిస్తూ అంతర్జాతీయ స్థాయి కవులు రాసిన రీతిలో కవితలు ఉన్నాయని అన్నారు. సెమినార్‌లో ఎదురైన సంఘటనలు కవితలుగా మార్చి అందంగా అమర్చారని తెలిపారు. ఆంగ్ల కవితలను చక్కగా చదివి విశ్లేషించారు. సభకు అధ్యక్షత వహించిన శాంతిశ్రీ మాట్లాడుతూ నేటి యువతలో సృజనాత్మక శక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే స్రష్టవాణి వంటి వారు ముందుకొస్తారని అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పిల్లలు వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించగలుగుతారని అన్నారు. కవయిత్రి స్రష్టవాణి స్పందిస్తూ చిన్నప్పటి నుండి తనకు ప్రత్యేక గుర్తింపు పొందాలనే కోరిక ఉండేదని అన్నారు. కవిత్వం రాయడం ద్వారా తనకు అనేక అనుభవాలు కలిగాయని అన్నారు. ఆకాశంలో తారలను చేరుకోవచ్చేమో కాని మనిషి అంతరంగాన్ని అర్థం చేసుకోవడం అంత సులువైన విషయం కాదని అన్నారు. తన మనసును ప్రభావితం చేసిన అనేక అంశాలను అక్షరాలుగా పేర్చి కవితలుగా రాశానని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండు నారాయణ, కొండపల్లి మాధవరావు, ప్రజాశక్తి బుక్‌హౌస్‌ ఎడిటర్‌ కె. ఉషారాణి, సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్‌, కవయిత్రి తండ్రి, జర్నలిస్టు అరవింద్‌, కవి అనిల్‌ డ్యాని తదితరులు పాల్గొన్నారు.