అనంతపురం జిల్లా ముఖ్యంగా రాయలసీమ రైతుల జీవితాలను నేపధ్యాలుగా చేసుకొని శాంతినారాయణ రచనలు చేశారని పలువురు వక్తలు అన్నారు. అనంతపురం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో సెప్టెంబర్ 30న డా|| శాంతినారాయణ సాహితీ సమాలోచన సదస్సు జరిగింది. అనంతపురం జిల్లా సాహితీస్రవంతి ప్రధాన కార్యదర్శి హిదయ్‌తుల్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాంతినారాయణ రచనలు నమ్ముకున్న రాజ్యం, పల్లేరు ముల్లు, కొండ చిలువ, బతుకు బంతి కథా సంపుటాలు, కొత్త అక్షరాలమై, నడిచేయి నగరం కవితా సంపుటాలు, పెన్నేటి మలుపులు నవల తదితర రచనలపై చిలుకూరి దీవెన, పిళ్ళా కుమారస్వామి, ఎ.ఎ. నాగేంద్ర, దాదా ఖలందర్, డా|| కె. నాగేశ్వరాచారి ప్రసంగించారు. కరువు నేపథ్యంతో పాటు వివిధ ప్రక్రియలలో అనేక సామాజిక అంశాలను ఈ రచనల్లో చూడవచ్చని, పద్యం నుండి మాండలిక వచన రచనల వరకూ సాగిన శాంతినారాయణ సాహిత్య ప్రయాణం అరుదైనదే గాక విలువైనదని పలువురు తెలిపారు. డా|| శాంతినారాయణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యం.టి.జ్యోత్స్న ఆహ్వానం పలుకగా డా|| యం. ప్రగతి ముఖ్య అతిథి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో డా|| అంకే శ్రీనివాసులు, ప్రజ్ఞా సురేష్, బాలగొండ ఆంజనేయులు, ఎల్.ఆర్. వెంకటరమణ, జూటూరి షరీఫ్, రియాజుద్దీన్, జెన్నే ఆనంద్, నిర్మలారాణి, శశికళ, రాజారాం, అశ్వర్థరెడ్డి, గోసల నారాయణస్వామి, ప్రసన్నరామ తదితరులు పాల్గొన్నారు.