అలరించిన అనంత పుస్తక సంబరాలు

- డాక్టర్‌ యం.ప్రగతి

అనంతపురం వాసులకు దసరా ఉత్సవాలు కాస్త ముందుగానే విచ్చేశాయి. ఎన్‌.టి.ఆర్‌. ట్రస్ట్‌,  విజయవాడ బుక్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌, భాషా సాంస్క తిక శాఖ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా 2 వ పుస్తక మహోత్సవం అక్టోబర్‌ 6 వ తేదీ నుండి 14 వరకు 9 రోజుల పాటు అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో విజయవంతంగా జరిగింది. తొలి రోజు అంటే అక్టోబరు 6 వ తేదీ సాయంత్రం జిల్లా కలెక్టరు వీరపాండ్యన్‌, నగర మేయరు శ్రీమతి స్వరూప పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సభలో కలెక్టరు మాట్లాడుతూ పుస్తకం మంచి చెడులను విడమరచి చెబుతుందన్నారు. కుటుంబ సమేతంగా పుస్తక ప్రదర్శనను సందర్శించాలని కోరారు. ప్రముఖ కవి సింగమనేని నారాయణ మాట్లాడుతూ సాంకేతికంగా ఎంత అభివ ద్ధి చెందినా పుస్తకం విలువ ఏమాత్రం తగ్గలేదన్నారు. తొలిరోజు సభలో శాసనమండలి మాజీ సభ్యులు డాక్టర్‌ గేయానంద్‌, ఎమెస్కో అధినేత విజయ్‌ కుమార్‌, ఆర్డీవో మలోల, జిల్లా విద్యా శాఖాధికారి జనార్ధనాచార్యులు తదితరులు పాల్గొన్నారు. మిగిలిన ఎనిమిది రోజులు జరిగిన రకరకాల సాహిత్య, సాంస్క తిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. సభా వేదికకు అనంతపురం గర్వించదగ్గ రచయిత చిలుకూరి దేవపుత్ర వేదిక గా నామకరణం చేశారు. ఆరు గ్లాసులు, ఏకాకి నౌక చప్పుడు, వంకర టింకర ఓ వంటి కథా సంకలనాలతో పాటు పంచమం వంటి అద్భుతమైన నవలలు రాసిన దేవపుత్ర పేరు ప్రాంగణానికి పెట్టడం ఎంతైనా సముచితమని సాహితీ వేత్తలు అభిప్రాయపడ్డారు.

అక్టోబరు 7 వ తేదీ ఆదివారం జరిగిన రాయలసీమ కథ-నవల సదస్సుకు డాక్టరు ఎం.ప్రగతి అధ్యక్షత వహించారు. ఈ సభలో  డాక్టర్‌ నాగేశ్వరాచారి నవల గురించి మాట్లాడుతూ రాయలసీమలోని ఫ్యాక్షన్‌, కరువు, గ్రామీణ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను బండి నారాయణ స్వామి, చిలుకూరి దేవపుత్ర, శాంతి నారాయణ వంటి అనేక మంది రచయితలు గద్దలాడతాండాయి, మీ రాజ్యం మీరేలండి, పంచమం, పెన్నేటి మలుపులు మొదలైన నవలల్లో ఆలోచనాత్మకంగా చిత్రీకరించారని పేర్కొన్నారు. బతుకు వెతుకులాట రచయిత సడ్లపల్లి చిదంబర రెడ్డి రాయలసీమ కథ, నవలల్లో మాండలిక ప్రయోగం గురించి మాట్లాడుతూ ఆయా ప్రాంతాల భాష, సంస్క తిని ప్రతిబింబించేలా రచనలు కొనసాగాలని అన్నారు. తిరస్కారానికి గురైన రాయలసీమ మాండలికాన్ని ఇప్పుడు అనేక మంది రచయితలు అద్భుతంగా ఉపయోగించి, సఫలీక తులయ్యారని గుర్తు చేశారు. తాను రాసిన ఇసక, కొల్లబోయిన పల్లె కథలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనంతపురం లో వస్తున్న నూతన ఒరవడుల గురించి సీనియర్‌ రచయిత్రి శశికళ, వర్ధమాన కథా రచయితలు వెంకటేసులు, దీవెన, ప్రగతి తదితరులు మాట్లాడారు. ఈ సభను వర్ధమాన కథా రచయిత వేంకటేశులు నిర్వహించారు. సభకు ముందు జ్ఞాన స్కంద ప్రదర్శించిన శాస్త్రీయ న త్యం ఆహూతులను ఆకట్టుకుంది.

అక్టోబరు 8 వ తేదీ అనంత కవిత్వం గురించి సదస్సు ప్రముఖ కవి మల్లెల నరసింహ మూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో పద్య కవిత్వం గురించి డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు ప్రసంగిస్తూ, పద్యానికి విశిష్ట లక్షణాలున్నాయని, సర్వ కవితలకు పద్యం ఆద్యంగా నిలుస్తుందని అన్నారు. ఈ భాష లోనూ లేని యతి ప్రాసలు తెలుగు పద్యాల సొంతమన్నారు. పల్లెల్లో పద్య నాటకాలు, పద్యాలతో నిండిన హరికథలను బాగా ఆదరిస్తున్నారన్నారు. డాక్టర్‌ జూపల్లి ప్రేం చంద్‌ అనంత కవుల కవిత్వంలోని వస్తు వైవిధ్యాల గురించి చర్చించారు. ప్రధానంగా కరువు గురించి ఇక్కడి కవులు చిత్రించిన కవిత్వం అద్భుతమని పేర్కొన్నారు. కరువు గురించి రాసిన కవితల సంకలనం వొరుపు గురించి ప్రస్తావించారు. ప్రక తి శీతకన్ను, పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వర్ధమాన కవులు తమ కలాలను ఎక్కుపెట్టిన తీరును ప్రశంసించారు. అనేక మంది యువ కవులు తమ వస్తు విస్త తిని పెంచి కవితలు రాస్తున్న తీరు అమోఘమని అనేక కవితలను గుర్తు చేశారు. విప్లవ కవి జెట్టి జైరాం మాట్లాడుతూ కవిత్వంలో ఆధునికత ప్రవేశించిన తీరుతో పాటు వివిధ ధోరణులను పరిచయం చేశారు. సభను వర్ధమాన కవి మిద్దె మురళీక ష్ణ నిర్వహించారు. సభ అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో దాదాపు 30 మంది కవులు తమ కవిత్వాన్ని వినిపించారు. కవిసమ్మేళనాన్ని డాక్టర్‌ ఎ.ఎ.నాగేంద్ర, మధురశ్రీ, మిద్దె మురళీక ష్ణ, దాదా ఖలందర్‌ నిర్వహించారు. సభ ప్రారంభంలో చిన్నారి రోహిత ప్రదర్శించిన శాస్త్రీయ న త్యం ప్రేక్షకులను ఆనంద డోలికలూగించింది.

నాలుగవ రోజు అంటే అక్టోబరు 9 వ తేదీ సాయంత్రం ''తెలుగు భాషా వికాసం'' అనే అంశం మీద జరిగిన సదస్సుకు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పెద్దిరెడ్డి అధ్యక్షత వహించారు.  ఈ సదస్సులో విశ్రాంత ఆచార్యులు పి.ఎల్‌.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ స్థాయిలో ద్వితీయ భాషగా తెలుగు స్థానే సంస్క తం చొరబడటం పాలకులకు తెలుగు భాష పట్ల సవతి ప్రేమను చాటుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాశవాణి సీనియర్‌ వ్యాఖ్యాత  డాక్టర్‌ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి మాట్లాడుతూ ఒక భాష మనుగడ సాగించాలంటే ఆ భాషను ఆ ప్రాంతంలో ప్రజలు తమ నిత్య దైనందిన జీవితంలో ఉపయోగించడం అవసరమన్నారు. గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన కొన్ని పద్యాలు పాడి వినిపించి, తెలుగు భాష వికాస ప్రాధాన్యత గురించి వివరించారు.  విజయకుమార్‌ మాట్లాడుతూ రవీంద్రనాథ్‌ టాగూర్‌ ఒక వ్యక్తి అభిప్రాయాలను మాత భాషలో మాత్రమే స్పష్టంగా వ్యక్తం చేయగలమన్నారని పేర్కొన్నారు. టాగూర్‌ తన మాత భాష లోనే గీతాంజలి రాసి నోబెల్‌ బహుమతి పొందారన్నారు. మన దేశంలో హిందీ తర్వాత తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య అధికంగా ఉండేది కాగా ఇప్పుడు తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య 4 వ స్థానానికి పడిపోయిందని ఆవేదన చెందారు. ఈవిషయాన్ని గురించి ప్రతి తెలుగు వ్యక్తి సింహావలోకనం చేసుకోవాలన్నారు. ఆర్ట్స్‌ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్‌ శ్రీధర్‌ నాయుడు మాట్లాడుతూ డిగ్రీ స్థాయిలో విద్యార్థులు తెలుగు ద్వితీయ భాష గా చదివే అవకాశం కేవలం మూడు సెమిస్టర్లకు మాత్రమే పరిమితం అయిందని, దీనివల్ల విద్యార్థులు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో తెలుగును చదివే అవకాశం కోల్పోతున్నారని అన్నారు. కళ్యాణ దుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ అంకె శ్రీనివాస్‌ ఆహ్వానం పలుకగా, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలఅధ్యాపకులు హేమమాలిని వందన సమర్పణ చేశారు. 

5 వ రోజు అక్టోబరు 10 వ తేదీ బుధవారం సాయంత్రం కార్యక్రమాలు చిన్నారులు వాక్య, కవన విలాసి ముద్దుముద్దుగా పలికిన పద్యాలతో ప్రారంభమయ్యాయి. అనంతరం ''సాహిత్య స జనలో అనంత మహిళలు'' అనే అంశం గురించి సభ జరిగింది. ఆచార్య ఎం.కె.దేవకి అధ్యక్షత వహిస్తూ, చాలమ్మ, తాళ్ళపాక తిమ్మక్క వంటి 10 మంది మహిళలు పద్య కవిత్వాన్ని ప్రాచీన కాలంలోనే రాశారన్నారు. తదనంతర కాలంలో సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి సంఘసంస్కర్తలు చేసిన క షి లో భాగంగా స్త్రీ విద్య ను ప్రోత్సహించారు. అలా చదువుకున్న మహిళలు రచనలు చేస్తూ మహిళలు ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావించారు. మాతుఝే సలాం రచయిత శశికళ మాట్లాడుతూ ఒకప్పుడు సాంఘిక దురాచారాల కారణంగా మహిళలు పడిన ఇక్కట్లను, ప్రేమ కథలను ప్రస్తావించిన మహిళా రచయితలు తర్వాతి కాలంలో విభిన్నమైన వస్తువులతో తమ కలాలకు స్త్రీ వాదమనే పదును పెట్టారన్నారు. ప్రసవ వేదన, ఋతు సమస్యలు, లైంగిక వేధింపులు, స్త్రీ విముక్తి వంటి అనేక వైవిధ్యమైన సాహిత్య వస్తువులను తీసుకుని రాస్తున్నారని పేర్కొన్నారు. నేటితరం రచయిత్రులు మరింత విస్త తంగా రచనలు చేయాలని కోరారు. మానస బాంధవ్యం నవలా రచయిత్రి షహనాజ్‌ మాట్లాడుతూ పురుష రచయితలతో పోలిస్తే మహిళలు రచనావ్యాసంగంలో అనేక ఇబ్బందులు, పరిమితులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాసిన రచనలను అచ్చేసుకోవడంలో కూడా మహిళలకు ఆర్థికంగా సంపూర్ణ స్వేచ్ఛ పొందలేక పోతున్నారన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి మాట్లాడుతూ తాము చేస్తున్న ఉద్యమాలకు రచయిత్రులు తమ కలాల ద్వారా మద్దతు పలకాలని, మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే రచనలు చేయాలని వర్ధమాన రచయితలను కోరారు. సభను తెలుగు అధ్యాపకురాలు డాక్టర్‌ అనితమ్మ నిర్వహించారు. సభానంతరం కవయిత్రులు తమ కవితా స్వరాలు వినిపించారు. చిలుకూరి దీవెన, యమునా రాణి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రగతి, యమున, దీవెన, దేవి, పేరిందేవి, డాక్టర్‌ అనితమ్మ, సైరాబాను, జ్యోత్స్న తదితరులు కవితాస్వరాలు వినిపించారు.

నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో భాగంగా గురువారం అక్టోబరు 11 న జరిగిన సాహిత్య సభలో ప్రముఖులు తమను ప్రభావితం చేసిన పుస్తకాల గురించి మాట్లాడారు. నందవరం కేశవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీనియర్‌ కథా రచయిత సింగమనేని నారాయణ తనను బాగా ప్రభావితం చేసిన పుస్తకం శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం అంటూ తన తాత్విక, సామాజిక ఆలోచనలో మార్పు తీసుకువచ్చిన పుస్తకమని పేర్కొన్నారు. సమాజాన్ని నడిపించేది శ్రమేనని మహాప్రస్థానం తాత్విక దక్పథమని అన్నారు. మానవ హక్కుల వేదిక నాయకులు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ శ్రీశ్రీ మహాప్రస్థానం తననెంతగా ప్రభావితం చేసిందో చలం యోగ్యతా పత్రం కూడా అంతగానే ప్రభావితం చేసిందన్నారు. డిగ్రీ రోజుల్లో షేక్స్పియర్‌ రాసిన హామ్లెట్‌ నాటకం, ఇతర రచనలు ప్రభావితం చేశాయని తెలిపారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ దశలో రొమిల్లా థాపర్‌ రచనలు చరిత్రను అర్థం చేసుకోవడానికి ఉపకరించాయని అన్నారు. వివిధ సందర్భాల్లో వివిధ పుస్తకాలు, వివిధ వ్యక్తులు, వివిధ ఉద్యమాలు ప్రభావితం చేశాయని, వాటిలో డార్విన్‌ రాసిన ఆరిజిన్‌ ఆఫ్‌ స్పీషిస్‌, మార్క్స్‌ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక, అంబేద్కర్‌ రాసిన కుల నిర్మూలన మొదలగు పుస్తకాల గురించి చంద్రశేఖర్‌ శ్రోతలతో పంచుకున్నారు. మానవత తరిమెల అమర్నాథరెడ్డి గోరా రచించిన మూఢనమ్మకాలు-నాస్తిక దష్టి పుస్తకం తన ఆలోచనలో, దక్పథంలో మార్పు తీసుకువచ్చిన పుస్తకం గా పేర్కొంటూ, ఆ పుస్తకం రంగనాయకమ్మ రాసిన రామాయణ విష వ క్షం పుస్తకం చదివేలా ప్రేరేపించిందని అన్నారు. విశ్రాంత డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు తనను ప్రభావితం చేసిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచాన్ని ఏవిధంగా కుదిపి వేసిందో సభికులకు గుర్తు చేశారు. ఆ పుస్తకం విడుదలయ్యాక అనేక దేశాలలో విప్లవాలు సాధ్యమయ్యాయని చెప్పారు. రాహుల్‌ సాంక త్యాయన్‌ రాసిన ''ఓల్గా నుంచి గంగ వరకు'' పుస్తకం గురించి విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ పూర్వ మేనేజర్‌ ఈశ్వరరెడ్డి తనను ప్రభావితం చేసిన పుస్తకం గా చెప్పారు. డాక్టర్‌ రమేష్‌ నారాయణ తన ప్రసంగంలో బండి నారాయణ స్వామి శప్తభూమి నవల తనకు బాగా నచ్చిన చారిత్రక నవలగా తెలిపారు. తెలుగు అధ్యాపకులు జ్యోత్స్న, అశ్వర్థరెడ్డి సభా నిర్వహణ చేశారు.

అనంతరం తరిమెల అమర్నాథరెడ్డి, నాగశయనా రెడ్డి, కోగిరి జయచంద్ర, సుధాకర మూర్తి, క ష్ణ కుమార్‌ తదితరులు హాస్య వల్లరి కార్యక్రమం నిర్వహించారు. హాస్యం మానవుని ఒత్తిళ్ళ నుంచి దూరం చేసే దివ్య ఔషధంగా పేర్కొన్నారు. నవ్వే వాడు భోగి, నవ్వించే వాడు యోగి, నవ్వని వాడు రోగి అని వక్తలు పేర్కొంటూ అనేక హాస్యభరిత సందర్భాలను ప్రేక్షకులకు చెబుతూ నవ్వించారు.

శుక్రవారం 12 వ తేదీ సాయంత్రం సాహిత్యం అస్తిత్వ వాదాలు అనే అంశంపై సభ జరిగింది. సభకు ప్రముఖ రచయిత డాక్టర్‌ శాంతి నారాయణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ దళిత, బహుజన అస్తిత్వం, ప్రాంతీయ, ముస్లిం అస్తిత్వ వాదాలతో పాటు, స్త్రీ అస్తిత్వ వాదం, క్రిస్టియన్‌ అస్తిత్వ వాదం, రైతు అస్తిత్వ వాదాలు ఉన్నాయన్నారు. కులం, మతం, ప్రాంతం, జెండర్‌ ప్రాతిపదికన వివక్షకు గురయినప్పుడు, నిర్లక్ష్యం చేయబడినపుడు అస్తిత్వ వాదాలు తలెత్తుతాయన్నారు. తానా పురస్కార గ్రహీత బండి నారాయణ స్వామి బహుజన అస్తిత్వ వాదం గురించి మాట్లాడుతూ కులాన్ని మినహాయించిన ఆర్థిక శాస్త్రం భారత దేశంలో లేదన్నారు. ఆనువంశికంగా కులవ త్తులు సంక్రమించడం ఆర్థిక శాస్త్రానికి పునాదిగా నిలిచిందన్నారు. వి.పి.సింగ్‌ వల్ల దళిత వాదం నుంచి బహుజన వాదం విడిపోయి తన ఉనికిని చాటుకుందన్నారు. రాయలసీమ, ఇంకా ఇతర ప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాల జీవితాలను సాహిత్యీకరించిన రచయితలను, వారి రచనలను గురించి ప్రస్తావించారు. తమకు సంబంధం లేని 'ఫాక్షనిజం' గొడవల్లో సమిధలైన బీసీ, ఎంబీసీ జీవితాలను చిత్రించే సాహిత్యాన్ని పరిశీలించి.. వాళ్ళనలా ఆ దీనస్థితిని తెచ్చిన వ్యవస్థను గురించి విశ్లేషించవలసి ఉందని అన్నారు.అతిముఖ్యమైన విషయమేమిటంటే బీసీల్లోనే అత్యంత వెనకబడిన కులాలైన కుమ్మరి, చాకలి, మంగళి, విశ్వకర్మ, గానుగ మొదలైన కులాల జీవితాలకు సంబంధించిన సాహిత్యానికి ప్రత్యేక గుర్తింపును అన్వేషించడం, సాహిత్యంలో ఈ అత్యంత వెనుకబడిన కులాలు జీవితచిత్రణ ఏవిధంగా జరిగిందో పరిశీలించి, విశ్లేషించాలని కోరారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత అప్పిరెడ్డి హరినాథ రెడ్డి మాట్లాడుతూ అన్ని రకాలుగా ప్రక తి తో పాటు పాలకుల నిర్లక్ష్యానికి గురయిన రాయలసీమ ఆటంకాలను అధిగమించి అభివ ద్ధి చెందటానికి ప్రజలను చైతన్యం చేయవలసిన బాధ్యత రచయితలదేనని పిలుపు నిచ్చారు. డాక్టర్‌ షమీవుల్లా ముస్లిం మైనారిటీ సాహిత్యం గురించి వివరించారు. రాయలసీమ లోని వేంపల్లి షరీఫ్‌, షహనాజ్‌, హిదయతుల్లా, జూటూరు షరీఫ్‌, రియాజుద్దీన్‌ వంటి ముస్లిం రచయితల గురించి ప్రస్తావించారు. డాక్టర్‌ జెన్నే ఆనంద్‌, రియాజుద్దీన్‌ సభా నిర్వహణ గావించారు.

నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో భాగంగా శనివారం అక్టోబరు 13 సాయంత్రం సాహిత్యం - కళలు అనే అంశంపై సభ జరిగింది. సభకు ప్రజానాట్యమండలి అధ్యక్షులు ఈశ్వరయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న శ్రీ క ష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య సుధాకరబాబు మాట్లాడుతూ సాహిత్యానికి కళలకు అవినాభావ సంబంధమున్నదన్నారు. సంగీతం, నాట్యం, చిత్ర లేఖనం వంటి కళారూపాలు సాహిత్యం సహకారం లేకుండా మనుగడ సాగించలేవన్నారు. అదే విధంగా సాహిత్యం పలు రకాల కళా రూపాల ద్వారా ప్రాచుర్యం పొందగలిగిందని పేర్కొన్నారు. పండిత పామరులకు ఆనందాన్ని కలిగించడంతో పాటు చైతన్యాన్ని నింపడంలో కళలు ప్రముఖ పాత్ర వహిస్తాయని అన్నారు. మానవ జీవన పరిణామ క్రమం లో సాహిత్యం, కళలు నిరంతర ప్రవాహం గా వెంట నిలిచాయన్నారు. భావ వ్యక్తీకరణకు కళలు సరైన మాధ్యమమని అన్నారు. ఆద్యంతం పాటలు, పద్యాలతో సాగిన ఆయన ప్రసంగం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ప్రముఖ చిత్రకారుడు, రచయిత ఎల్‌. ఆర్‌. వెంకటరమణ చిత్రలేఖన సాహిత్యం గురించి మాట్లాడుతూ, ప్రప్రథమంగా సాహిత్యం చిత్రలేఖనం రూపంలోనే మొదలయిందన్నారు. ఆదిమ మానవుల మధ్య సమాచార మార్పిడి బొమ్మల ద్వారానే జరిగిందన్నారు. మానవ పరిణామం మెదడు తో పాటు చేతులను ఉపయోగించడం ద్వారా సాధ్యమయిందని పేర్కొన్నారు. వివిధ నాగరికతలలో, వివిధ దేశాల్లో చిత్ర లేఖన సాహిత్యం ఎలా పరిణామం చెందిందో వివరించారు. సాంస్క తిక పునరుజ్జీవన కాలంలో ఖ్యాతి నొందిన లియోనార్డో డావిన్సి తదితరుల కళా నైపుణ్యం, ప్రయోజకత గురించి వివరించారు. కవిత్వాన్ని వాటర్‌ కలర్స్‌ తో పోల్చారు. ఒపాక్‌ కలర్స్‌ ను కథలతోను, ఆయిల్‌ కలర్స్‌ ను నవలలతోను పోల్చారు. సాహిత్యం అక్షరాస్యులకు మాత్రమే అర్థమయ్యే కళారూపం కాగా, చిత్రకళ ఎవరికైనా అర్థమయ్యే ప్రక్రియ అని తెలిపారు. విశ్రాంత వ్యాయామ అధ్యాపకుడు శివయ్య మాట్లాడుతూ క్రీడా కళ కూడా వ్యక్తి ఎదుగుదలకు అనివార్యమని అన్నారు.

నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో భాగంగా చివరి రోజు శనివారం సాయంత్రం సైన్సు సాహిత్యం అనే అంశంపై మొదటి సదస్సు జరిగింది. సభకు జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు డాక్టర్‌ వీరభద్రయ్య అధ్యక్షత వహించారు. సభలో ముఖ్య వక్తగా పాల్గొన్న డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ మాట్లాడుతూ సైన్స్‌ అనేది మూల పదార్థం, సాహిత్యం అనేది వ్యక్తీకరణ అన్నారు. గణిత శాస్త్రం చదివిన డి.డి.కోశాంబి చరిత్రకు కొత్త భాష్యాలు చెప్పారు. సాహిత్యానికి సైన్స్‌ ను రంగరిస్తే అద్భుతంగా ఉంటుంది. హెచ్‌.జి.వెల్స్‌ సైన్స్‌ ఫిక్షన్‌ కథలు రాశారు. విషయం బాగా అర్థం చేసుకొని, ఆయా కాలాల్లో అందుబాటులోకి వచ్చిన అంశాలను క్రోడీకరించి రచనల్లో పొందుపరచాలి. స్థానికతను కూడా జోడించి, సమస్యలను విశ్లేషణ చేసి రాయచ్చునని తెలిపారు. విశ్రాంత ఆచార్యులు రామక ష్ణారెడ్డి మాట్లాడుతూ వైజ్ఞానిక శాస్త్రానికి, మతానికి మధ్య సంఘర్షణ అనాదిగా జరుగుతున్నదన్నారు. వైజ్ఞానిక శాస్త్రం - సాహిత్యం నాణానికి బొమ్మా బొరుసు వంటివన్నారు. వైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించిన పారిభాషిక పదకోశాలు, నిఘంటువుల కొరత ఉందన్నారు. కందుకూరి వీరేశలింగం 1881 లోనే విజ్ఞాన శాస్త్ర జనీనం వంటి అనేక పుస్తకాలు రాశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైజ్ఞానిక అంశాలను కథా రూపంలో చెప్పడం ద్వారా సులభతరం చేయవచ్చునని తెలిపారు.

రెండవ సదస్సు బాలసాహిత్యం మీద డాక్టర్‌ చంద్రశేఖర శాస్త్రి అధ్యక్షతన జరిగింది. ప్రధాన వక్తగా పాల్గొన్న ఆచార్య ఎం.కె.దేవకి తన ప్రసంగంలో బాల సాహిత్యం అనగానే పంచతంత్ర కథలు, పేదరాసి పెద్దమ్మ కథలు, ఈసపు కథలు, చందమామ కథలు గుర్తురావడం సహజం. సింహం, పులి, ఏనుగు వంటి జంతువులను కథల పుస్తకాల బొమ్మల్లో చూసి నిన్నటి తరం పిల్లలు ఆనందించేవారు. నగర వాసుల పిల్లల్లో కొందరు మాత్రం జంతు ప్రదర్శనశాలలో చూస్తుంటారు. ప్రస్తుతం టీవీ చానల్స్‌ పుణ్యమా అని ఏనిమల్‌ ప్లానెట్‌, డిస్కవరీ చానల్స్‌ వచ్చిన తర్వాత పులి, సింహం, ఏనుగు లాంటి జంతువుల్ని, రకరకాల సర్పాలని, వివిధ జాతుల పక్షుల్ని వాటి జీవన విధానాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నారు నేటి తరం పిల్లలు. పొడుపు కథలు, వినోద కథలు, చిట్టి కథలు, నీతి కథలు, పిట్టకథలు బాల సాహిత్యంలో భాగమన్నారు. నేటి పత్రికలు పిల్లల కోసం ఓ పేజీని ప్రత్యేకంగా కేటాయించి వారిపట్ల తమకున్న ప్రేమను, బాధ్యతను నిరూపించుకుంటున్నాయి. పిల్లలకు వినోదం, విజ్ఞానం, వికాసం అందించడంలో భాగంగా పద వినోదం, గడి - నుడి, గణితంలో సమస్యలు, కథలు, గేయాలు, కవితలు, వ్యాసాలు, కార్టూన్లు ఇలా ఏ రూపంలో వచ్చినా సరే బాలసాహిత్యాన్ని సుసంపన్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జూటూరు తులసీదాస్‌ మాట్లాడుతూ కోగిర జై సీతారాం, చొప్పా వీరభద్రప్ప, చం, జూటూరు తులసీదాస్‌ తదితరులు బాల సాహిత్యాన్ని స జించిన అనంతపురం జిల్లా సాహిత్య వేత్తలని పేర్కొన్నారు. తను రాసిన అమ్మ నేర్పిన గుణింతాలు పుస్తకం గురించి ప్రస్తావించారు.

నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో చివరి రోజు జిల్లా కలెక్టర్‌ శ్రీ వీరపాండ్యన్‌ తన కుటుంబ సభ్యులతో సహా సందర్శించడం పుస్తకాల పట్ల ఆయనకున్న మక్కువను తెలియజేస్తుంది. గత తొమ్మిది రోజులుగా వివిధ ప్రచురణకర్తలు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు, అన్ని రోజులు సాహితీ సమావేశాలను నిర్వహించినందుకు, పాల్గొన్న వారందరికీ పుస్తకాలను బహూకరించినందుకు నిర్వాహకులను అభినందించారు. సంబరాలు జరిగిన అన్ని రోజులు స్థానిక పత్రికలు ప్రత్యేకమైన కథనాలు రాయడం తో పాటు, స్థానిక కవులను, రచనలను పరిచయం చేయడం ఆకట్టుకుంది.