'అశోక నివాళి' పుస్తకాల ఆవిష్కరణ

శ్రీశ్రీ సాహిత్యనిధి నిర్వాహకులు కవి సింగంపల్లి అశోక్‌కుమార్‌ పుస్తకాలు 'అశోక నివాళి 1, 2 భాగాలను నవంబర్‌ 6న విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య మేడిపల్లి రవికుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగంపల్లి అశోక్‌కుమార్‌ రచనల నిండా శ్రీశ్రీ పరుచుకుని ఉంటారని అన్నారు. వందమంది ప్రసిద్ధ సాహిత్యవేత్తల పరిచయాలను రెండు భాగాలుగా పుస్తకరూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. పరిచయాలన్నీ చాలా శ్రద్ధగా కూర్చారని, ప్రతీ పదం ఆచితూచి వాడారని, ఆయా రచయితల గురించి రెడీ రిఫరెన్స్‌ గ్రంథాలుగా ఇవి నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసాహితి సంపాదకులు కొత్తపల్లి రవిబాబు, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, సాహితీస్రవంతి అధ్యక్షులు వొరప్రసాద్‌, జనసాహితి అధ్యక్షులు దివికుమార్‌, విరసం బాధ్యులు అరసవిల్లి కృష్ణ ప్రసంగించారు. సింగంపల్లి అశోక్‌కుమార్‌ స్పందనగా మాట్లాడుతూ ఈ పుస్తకాలు వెలువరించడంతో తనకు సంతోషం కలిగిందని, ప్రగతిశీల సాహిత్య ఉద్యమ సంస్థలతో నా అనుబంధం కొనసాగుతుందని అన్నారు. ప్రోగ్రెసివ్‌ ఫోరం కన్వీనర్‌ బుడ్డిగ జమీందర్‌ 'చిత్రాలలో తెలుగువారి చరిత్ర' గ్రంథాన్ని ఈ సందర్భంగా సింగంపల్లి అశోక్‌కుమార్‌కి బహుకరించారు.