నెల్లూరులో బంగోరె వర్దంతి సభ

నెల్లూరు సాహితి స్రవంతి ఆధ్వర్యంలో అక్టోబర్‌ 30న ప్రముఖ విమర్శకుడు, పరిశోధకుడు బంగోరె (బండి గోపాలరెడ్డి) 36 వర్దంతి సభ రేబాల లక్ష్మీనరసారెడ్డి పురమందిరం రీడింగ్‌ రూమ్‌లో జరిగింది. ఈ సభకు సాహితీస్రవంతి నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులు డా|| ఈదూరు సుధాకర్‌ అధ్యక్షత వహించి మాట్లాడుతూ పాత్రికేయ వృత్తిలో ఉంటూ సాహిత్య రంగ విశేషాలపై విశిష్ట పరిశోధన చేసిన బంగోరెను స్మరించుకోవడం నేటితరం బాధ్యత అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొద్దికాలం పాటు మాత్రమే జీవించి అర్ధాంతరంగా తనువు చాలించినా ఎంచుకున్న పాత్రికేయ వృత్తిలోనూ, ఆసక్తిని పెంచుకున్న సాహిత్య పరిశోధనా ప్రవృత్తిలోనూ బంగోరె విశేషమైన ప్రతిభ కనబరిచారని అన్నారు. సాహిత్య రంగంలో కవులకు, రచయితలకు లభించే గుర్తింపు విమర్శకులకు, సాహిత్య పరిశోధకులకు లభించక ఎందరో మరుగున పడిపోయారని, అదే విదేశాల్లో అయితే వీరి పరిశోధనలకు తగిన గౌరవం

ఉందని అన్నారు. బంగోరెలో నిర్మొహమాటం, ముక్కుసూటితనంతో వ్యవహరించే వ్యక్తిత్వమే కాక ఆవేదన, ఆవేశం నిండిన హృదయం కూడా ఉందని అన్నారు. ఆంధ్రదేశంలోని ప్రముఖ సాహిత్య పరిశోధకులలో మొదటి పదిమందిలో ఒకరుగా బంగోరెను గుర్తించ వచ్చని అన్నారు. తెలుగు భాషకు సి.పి. బ్రౌన్‌ చేసిన కృషిని మనస్ఫూర్తిగా అభినందించి, ఆయన జాడలను వెదికి పట్టుకునే ప్రయత్నాన్ని బంగోరె చిత్తశుద్ధితో చేశాడని అన్నారు. తెలుగు భాషకు, సాహిత్యానికీ బ్రౌన్‌ చేసిన సేవకు సంబంధించిన అనేక పత్రాలు ఈనాటికీ లండన్‌ మ్యూజియంలో పడి ఉన్నాయనీ, అలాగే నాయకరాజుల కాలంనాటి తంజావూరు సరస్వతీ గ్రంథాలయంలో తెలుగు సాహిత్యానికి సంబంధించిన వేలకొద్ది తాళపత్ర గ్రంథాలు డిజిటలైజేషన్‌కు నోచుకోకనే పడి ఉన్నాయని వాటిని వెలికితీసి తెలుగు చరిత్రను పదిలపరచవలసిన బాధ్యతను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని అన్నారు. బంగోరె స్ఫూర్తితో తెలుగువారి చరిత్రను తిరగరాయవలసిన అవసరం నేడు ఎంతైనా ఉందని అన్నారు. చెలంచర్ల భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల జీవన విధానం, వారి సమస్యలను గుర్తించి వెలికితీయడమే సాహిత్యానికైనా, చరిత్రకైనా అసలైన అర్థం అని, బంగోరె ఆ కోవకు చెందిన పాత్రికేయుడూ, పరిశోధకుడూ అన్నారు. సాహితీస్రవంతి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. గోపీనాథ్‌, ఈతకోట సుబ్బారావు, ఆచార్య ఆదిత్య, వల్లకవి సుబ్బారావు, కోటిరెడ్డి, బంగోరె కుటుంబ సభ్యులు, సాహిత్య అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.