'కవిత్వ భాష' పుస్తక పరిచయ సభ

విజయవాడ సాహితి స్రవంతి ఆధ్వర్యంలో నవంబర్‌ 3 న మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో ''కవిత్వ భాష'' పుస్తక పరిచయ సభ జరిగింది. ఈ సభకు శాంతిశ్రీ అధ్యక్ష్యత వహించారు. కవి, సాహిత్య విమర్శకుడు బొల్లోజు బాబా రచించిన 'కవిత్వ భాష' పుస్తకంపై పాపినేని శివశంకర్‌ విశ్లేషణాత్మక ప్రసంగం చేసారు. వర్తమానంలో రాస్తున్న కవులకు, ఔత్సాహికులకు కవిత్వ నిర్మాణంపై అవగాహనకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందన్నారు. సరళమైన పద్ధతిలో వివిధ కవిత్వాంశాలను వివరించడానికి ఒక మంచి ప్రయత్నం రచయిత చేసారన్నారు. ఆత్మీయ సందేశమిచ్చిన సత్యాజి మాట్లాడుతూ కవులు విరివిగా రాస్తున్నారని, కొత్తగా రాస్తున్న వారు ఈ పుస్తకం చదివితే తమ కవిత్వాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. పుస్తక రచయిత బొల్లోజు బాబా మాట్లాడుతూ 'కవిత్వ భాష' పుస్తకంలోని వ్యాసాలు కవిసంగమంలో రావడం జరిగిందని, అప్పుడు మంచి స్పందన రావడంతో పుస్తకంగా వేయడం జరిగిందన్నారు. బండ్లమాధవరావు, వెంకట్‌  సత్యరంజన్‌, అనిల్‌ డానీ, బుంగా రాజ్‌ కుమార్‌,  సాయికామేష్‌, కాకినాడ నుంచి  గనారా, అద్దేపల్లి ప్రభు, కె. మల్లేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. బాలాంత్రపు హేమచంద్ర దంపతులు బొల్లోజు బాబాను సత్కరించారు.